పోలవరానికి నిరంతరంగా నిధులు ఇవ్వాలి : వైఎస్సార్‌సీపీ

11 Jul, 2019 20:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బడ్జెట్‌లో ఏపీకి ఏమి దక్కలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోలియం ఉత్పత్తులపై అదనంగా ఒక రూపాయి ఎక్సైజ్‌ డ్యూటీ విధించడం సామాన్యుడిపై తీవ్ర భారంగా మారుతుందన్నారు. రైల్వేల ఆపరేటింగ్‌ నిష్పత్తి తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లక్ష్యాన్ని చేరుకోవడం శుభపరిణామంగా చెప్పుకొచ్చారు. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు విజయసాయి రెడ్డి.

పొలవరానికి నిరంతరంగా నిధులు: వేమిరెడ్డి
బడ్జెట్‌లో ఏపీకి చాలా ఇస్తారని ఆశించాం.. కానీ నిరాశే మిగిలిందన్నారు ఎంపీ వేమిరెడ్డి ‍ప్రభాకర్‌ రెడ్డి. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేయలేదని ఆయన ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, రాజధానికి నిధులు ఇవ్వలేదన్నారు. ఏపీ రెవెన్యూ లోటు ఎంతో లెక్క తేల్చడం లేదని ఆయన విమర్శించారు. ఏపీ ఏజీ రూ. 16 వేల కోట్ల రెవెన్యూ లోటుగా తేల్చిందన్నారు. రెవెన్యూ లోటుకు సంబంధించి నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌కు నిరంతరంగా నిధులు విడుదల చేయాలని వేమిరెడ్డి డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో కడప స్టీల్‌ ప్లాంట్‌, వెనకబడిన జిల్లాలకు నిధుల ఊసే లేదన్నారు. ఐఐటీ, ఐఐఎంల నిర్మాణానికి నిధులు లేక ఆ ప్రాజెక్ట్‌లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భారత్‌మాల, సాగర్‌ మాల ప్రాజెక్ట్‌లను స్వాగతిస్తున్నాం అన్నారు.

మరిన్ని వార్తలు