సమైక్య సింహనాదం

4 Aug, 2013 03:46 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓలు ఉమ్మడిగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పేరుతో నిర్వహిస్తున్న ఉద్యమం నాల్గో రోజూ ఉధృతంగా సాగింది. వైఎస్సార్‌సీపీ నేతలు శనివారం నగరంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
 
   ఎన్‌జీఓ నేతలు నెల్లూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూయించి ఉద్యోగులతో విధులు బహిష్కరింపజేశారు. విద్యార్థులు రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించి సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.  నెల్లూరులో వైఎస్సార్‌సీపీ నేతలు కోటంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 అనంతరం కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోనియా చిత్రపటానికి మహిళలు రక్తం పూసి నిరసన తెలిపారు. ఎన్‌జీఓ అసోషియేషన్ నేతలు రోడ్డుపై సోనియా పోస్టర్లను తగులబెట్టారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూసివేయించి ఉద్యోగులతో విధులు బహిష్కరింపజేశారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యం లో ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు.
 
 డీకేడబ్ల్యూ కళాశాల విద్యార్థిను లు రోడ్లపై ఆటలు ఆడి నిరసన తెలిపారు. అనంతరం ఇందిరాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కరెంట్ ఆఫీసు సెంటర్‌లో విద్యార్థులు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్‌సీపీ మహిళానేత ధనూజారెడ్డి,ముత్యాలరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ఆత్మకూరు బస్టాండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సమైక్యాంధ్ర ప్లెక్సీతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రికారెడ్డి, సుగుణారెడ్డి, శ్యామలమ్మ, పద్మజాయాదవ్, పద్మారెడ్డి, రజని తదితరులు పాల్గొన్నారు. వీఆర్‌సీ సెంటర్‌లో  విద్యార్థి జేఏసీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ముత్తుకూరు బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు.
 
  సూళ్లూరుపేటలో జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. బ్యాంకులు, విద్యాలయాలు బంద్ పాటించాయి.
  ఆత్మకూరులో శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో, మానవహారం నిర్వహించారు. సోని యా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మహిమలూరులో స్థానిక యువకులు రాస్తారోకో నిర్వహించారు.
 
  గూడూరు రైల్వేస్టేషన్‌లో కార్లు, టెంపోల యూనియన్ ఆధ్వర్యంలో  వాహనాల ర్యాలీ జరిగింది. టవర్ క్లాక్ సెంటర్‌లో జర్నలిస్టులు అరగుండు గీయించుకొని నిరసన తెలిపారు. విద్యార్థులు రైల్‌రోకో నిర్వహించారు. విద్యార్థి నాయకుడు రాజా  ఆత్మహత్యా యత్నం చేశాడు. సాధుపేట కూడలిలో ప్రజలు సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. విద్యానగర్‌లో విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. చిల్లకూరు మండలం తిక్కవరంలో దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
 
  కావలిలో విక్రమ సింహపురి యూనివర్సిటీ పీజీ సెం టర్‌కు చెందిన మూడు వందల మంది విద్యార్థులు పొట్టి శ్రీరాములు సెంటర్‌లో ర్యాలీ ,మానవహారం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేత ప్రసాద్ ఆధ్వర్యంలో ఆందోళనకారులు జిల్లా కేంద్రంతో పాటు సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరి, కావలి, ఉదయగిరి, గూడూరులో సమైక్యాంధ్ర కోరుతూ యాగం నిర్వహించారు.
  కోవూరు నియోజక వర్గంలోని బుచ్చిరెడ్డిపాళెంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతబడ్డాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్, బీసీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాలు బంద్‌ను పర్యవేక్షించాయి.
 
  సర్వేపల్లి నియోజక వర్గంలోని ముత్తుకూరులో విద్యార్థులు ర్యాలీ ,మానవమారం నిర్వహించారు. పొదలకూరులో వంటావార్పు నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మనుబోలులో ప్రదర్శన, మానవహారం, వెంకటాచలంలో బ్యాంకులు, విద్యాసంస్థలు మూసివేశారు.  ఉదయగిరిలో సోనియా దిష్టిబొమ్మలను దహనం చేశారు. వరికుంటపాడు, వింజమూరుతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. విద్యాసంస్థలు మూతబడ్డాయి.
 
  వెంకటగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. డిగ్రీ కాలేజీ విద్యార్థులు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు. సైదాపురంలో వైఎస్సార్‌సీపీ నేతలు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు