నేడే ప్రజా సంకల్ప మానవహారాలు

19 Mar, 2018 02:15 IST|Sakshi

సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో:  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సోమవారం చర్చకు రానున్న సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా సంకల్ప మానవహారం కార్యక్రమాలను సోమవారం నిర్వహించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ సీనియర్‌ నేతలతో చర్చించి నిర్దేశించిన ఈ కార్యక్రమంలో పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు భాగస్వాములు కానున్నారు.

రాష్ట్ర ప్రజల ప్రత్యేక హోదా ఆకాంక్ష ఢిల్లీకి తెలిసి వచ్చేలా ప్రజా సంకల్ప మానవహారాన్ని విజయవంతం చేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసింది. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు శ్రద్ధ తీసుకుని కార్యక్రమాలను భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ కోరింది. కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర మార్గంలో.. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు వద్ద ప్రజా సంకల్ప మానవహారంలో ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ ఆదివారం తెలిపారు.

మరిన్ని వార్తలు