పకడ్బందీ వ్యూహంతో అధికారపక్షం

9 Dec, 2019 04:40 IST|Sakshi

ఏ అంశంపై అయినా చర్చకు వెనుకాడకుండా సమాయత్తం

ప్రతిపక్షం వ్యక్తిగత అజెండాను తిప్పికొట్టేందుకు సిద్ధం

ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత చర్చ జరిగే అవకాశం

సాక్షి, అమరావతి : నేటి నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలను ఎదుర్కోవడానికి అధికార వైఎస్సార్‌సీపీ పకడ్బందీ వ్యూహంతో సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఆరు నెలల పాలనను పూర్తి చేసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలు కీలకంగా మారనున్నాయి. ఎన్నికలకు ముందు జగన్‌ చేసిన ప్రజా సంకల్ప పాదయాత్రలో, ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే యత్నంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఆరు నెలల్లో ప్రజలకు ఎంతో చేశామన్న ధీమా, సంపూర్ణ ఆత్మ విశ్వాసంతో అధికార పక్షం ముందుకు కదులుతోంది. శీతాకాల సమావేశాలు మొదలు కావడానికి కొద్ది రోజుల ముందు నుంచే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కసరత్తు మొదలు పెట్టారు. ఉభయ సభల్లో చర్చకు రానున్న, తాము ప్రస్తావించనున్న అంశాలపై వారు కూలంకషంగా చర్చించారు.

టీడీపీ లేవనెత్తే అనవసర వివాదాలు, సభను పక్క దోవ పట్టించే విధంగా సభలో ప్రస్తావించే అంశాలను తిప్పి కొట్టడానికి సిద్ధమయ్యారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఇవ్వాలనే చట్టాన్ని చాలా వరకు ఆచరణలో అమలు చేసి చూపించారు. ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడం అనేది ముమ్మాటికీ ఘనతే. ఈ అంశం చర్చకు వచ్చినపుడు ప్రతిపక్షం ఏవైనా అవాంతరాలు సృష్టిస్తే సరైన సమాధానాలతో వాటిని ఎదుర్కొనేందుకు అధికారపక్షం సిద్ధమవుతోంది. ప్రకృతి వల్ల ఉత్పన్నమైన ఇసుక కొరతను విజయవంతంగా నివారించడం, మద్యం వినియోగాన్ని రాష్ట్రంలో గణనీయంగా తగ్గించడం, చరిత్రాత్మకమైన రీతిలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలు, అమరావతి రాజధాని రైతుల సమస్యలు, కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలు, తదితర అంశాలన్నింటిపై చర్చకు అధికార పక్షం సిద్ధంగా ఉంది. 

ప్రజల కోసమే అసెంబ్లీ 
గడికోట శ్రీకాంత్‌రెడ్డి
ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో అధికార పక్షం ఉందని, ప్రతిపక్షం బాధ్యతగా సభలో చర్చకు తెచ్చే ఏ అంశానికైనా సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. అలా కాకుండా వ్యక్తిగత అజెండాతో సభను తప్పు దోవ పట్టించే విధంగా వ్యవహరిస్తే అధికారపక్షం చూస్తూ ఊరుకోబోదన్నారు. అసెంబ్లీ ఉన్నది ప్రజల సమస్యలను చర్చించి పరిష్కరించడం కోసమేనన్నది అందరూ గుర్తించాలన్నారు. 

>
మరిన్ని వార్తలు