‘ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా నిలవండి ’

30 Mar, 2020 20:56 IST|Sakshi

సాక్షి, అమరావతి : కరోనా మహమ్మారిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరిమికొట్టేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తమ వంతు బాధ్యతగా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా నిలవాలని ఆ పార్టీ అధ్యక్షుడు,  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు వారి వంతుగా చర్యలు చేపడుతూనే.. మరోవైపు ప్రజల్లో ధైర్యం నెలకొల్పాలని సూచించారు.

స్వీయ సామాజిక దూరం పాటిస్తూనే.. ప్రభుత్వానికి- ప్రజలకు వారధిగా నిలవాలని మార్గదర్శకం చేశారు. వారి వారి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు ప్రజలకు అందుతున్నాయో లేదో గమనించి, లోపాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయించకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. అనాథలు, అన్నార్తులకు ఆహార సదుపాయాలు కల్పించాలన్నారు. అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్య సేవలు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు ఆటంకం రాకుండా చూడటం... వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో రైతుకు మేలు జరిగేలా చూడటం... వలస కార్మికులు, వ్యవసాయ కూలీలకు భోజన వసతి కల్పించడం తదితర అంశాలపై పార్టీ నాయకులకు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు