నిరసనాంధ్ర..

3 May, 2016 01:32 IST|Sakshi
నిరసనాంధ్ర..

 రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు.. ధర్నాలు.. ర్యాలీలు
 
 సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలో కరువు ఉరుముతోంది. తాగడానికి గుక్కెడు నీరు, తినడానికి తిండి, చేసుకోవడానికి పనులు దొరక్క జనం నానా అగచాట్లు పడుతున్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దుర్భిక్షం వల్ల కుదేలైన ప్రజలను తక్షణమే ఆదుకోవాల్సిన పాలకుల్లో కదలికే కరువైంది. ఈ నేపథ్యంలో సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, రైతులు మండుటెండను సైతం లెక్కచేయకుండా ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

కరువు కాటేస్తున్నా ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. చేతకాని పాలకులు గద్దె దిగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో ధర్నాలు, సైకిల్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. రహదారులపై బైఠాయించారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ‘కరువుపై కళ్లు తెరవండి’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరు జిల్లా మాచర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాల్సి ముఖ్యమంత్రి అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనేసే పనిలో తీరిక లేకుండా ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.

>
మరిన్ని వార్తలు