‘హోదా’ కోసం తుది పోరు

19 Mar, 2018 08:03 IST|Sakshi

నేడు ప్రజా సంకల్ప మానవహారం

నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహణ

వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సమాయత్తం

కాకినాడ :  ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తుదిపోరుకు సన్నద్ధమైంది. గడచిన నాలుగేళ్లలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు కలెక్టరేట్‌ వద్ద బైఠాయింపులు, నిరాహార దీక్షలు, యువభేరి సహా ఎన్నో నిరసన కార్యక్రమాలను చేపట్టింది. ఆది నుంచి ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌కు సంజీవని అంటూ ఎలుగెత్తి చాటింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హోదాకన్నా ప్యాకేజీ మిన్న అంటూ కేంద్రం వద్ద మోకరిల్లి ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను తాకట్టు పెట్టినా.. ఒక్కటే మాట, ఒక్కటే నినాదంతో ఉద్యమించిన వైఎస్సార్‌ సీపీ ఇప్పుడు నేరుగా కేంద్ర ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుని తుదిపోరుకు సన్నద్ధమవుతోంది. 

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ అంశంపై దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడా పార్టీ కూడగడుతోంది. ఈ తీర్మానంపై సోమవారం పార్లమెంట్‌లో చర్చకు రానున్న నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహాసంకల్ప మానవహారం చేపట్టాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఆయా ప్రాంతాల్లో కలిసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల భాగస్వామ్యంతో సోమవారం మానవహారాలు చేపట్టాలని నిర్ణయించారు.

ప్రజల ఆకాంక్షను ఢిల్లీలో ప్రతిబింబించేలా పార్టీ తరఫున అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, కురసాల కన్నబాబు, మోషేన్‌రాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్ష ఢిల్లీలో ప్రతిబింబించేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రజా సంకల్ప మానవహారాన్ని విజయవంతం చేసి అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చకు సంఘీభావం తెలియజేయాలని ఆయా పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బోస్, కన్నబాబు, మోషేన్‌రాజు కోరారు. పార్టీ నేతలు, కార్యకర్తలు విధిగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
 

మరిన్ని వార్తలు