కన్నీరు పెట్టుకున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే!

24 Aug, 2019 20:43 IST|Sakshi

రానున్న రెండేళ్లలో అందరికీ ఆరోగ్యం: జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని

వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్ష

మన్యానికే ఎందుకింత కష్టం..? 

సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

గత రెండు రోజులుగా ‘సాక్షి’లో వచ్చిన కథనాల ప్రస్తావన

కాకినాడ సిటీ: గిరిజనులు ఏం పాపం చేశారు. ప్రతి తల్లీ ప్రసవ వేదన అనుభవిస్తోంది. ఓవైపు పురిటి నొప్పులు పడుతూనే పుట్టే బిడ్డ సజీవంగా పుడతాడా లేదా అనే ఆందోళనతోనే ఉంటోంది. కొద్దిపాటి అనారోగ్యంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ వందల సంఖ్యలో చిన్నారులు మృతి చెందారు. దీనికి తోడు కాళ్ల వాపు కబళిస్తోంది. అసలు ఏజెన్సీలో ఏం జరుగుతోంది? నివారణా చర్యలేమిటనే కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్య ఆరోగ్యశాఖ పనితీరును జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణి తనకు పుట్టిన బిడ్డ బతుకుతుందో లేదోనన్న ఆందోళనతో ఉన్నారని, వీరికి సరైన వైద్యం అందకపోవడంతో పుట్టిన బిడ్డలు చనిపోవడం, ఒక్కొక్కసారి తల్లీ, బిడ్డా కూడా మరణిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అసలు పుట్టిన బిడ్డలు ఎందుకు చనిపోతున్నారో అర్థం కావడంలేదని, పౌష్టికాహార లోపమా లేక, మరే ఇతర సమస్యా అన్నది ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.

రానున్న రెండేళ్లలో అందరికీ ఆరోగ్యం: ఆళ్ల నాని
రానున్న రెండేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో సంస్కరణలు చేసి ప్రజలకు మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని) ఉద్ఘాటించారు. శుక్రవారం కాకినాడలో జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వైద్యాధికారులు, వైద్యులతో నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖ పనితీరును ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పేదలందరికీ నాణ్యమైన కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు వీలుగా బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. నవరత్న పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తామన్నారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబాన్నీ కవర్‌ చేసేందుకు వీలుగా హెల్త్‌ కార్డులు అందిస్తున్నామన్నారు. ఈ పథకాన్ని జనవరి 1, 2020న పశ్చిమగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రి నాని తెలిపారు.  అన్ని ప్రాంతాలను ప్రామాణికంగా తీసుకుని సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో సమీక్షించిన అనంతరం పూర్తి స్థాయిలో వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తామని, ప్రస్తుతం 1070 వ్యాధులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుండగా మరో వెయ్యి వ్యాధులను యీ పరిధిలోకి తీసుకువస్తామని అన్నారు. ప్రతి మండలానికి 108, 104 వాహనాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సెప్టెంబర్‌ నాటికి 108 వాహనాలు 676 , 104 వాహనాలు 773 కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖా మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ జిల్లాలో డయాలసిస్‌ వ్యాధిగ్రస్తులు  పెరుగుతున్నారని, ఇప్పటికే 32 మంది డయాలసిస్‌ రోగులు ఉన్నారని, ఏరియా ఆస్పత్రుల్లో డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు.

సమావేశంలో పాల్గొన్న వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం దారుణంగా ఉంటోందని, ఈ ప్రాంతంలో కాళ్లవాపు వ్యాధి వచ్చి అనేక మంచి మరణించారని అన్నారు. ఇప్పటికీ ఆ వ్యాధి ఎందుకు వస్తుందో వైద్యులు తెలుసుకోలేదన్నారు. జిల్లాలో 24  ్ఠ7 గా పీహెచ్‌సీలు నడుస్తున్నా, 7 గంటలు కూడా అవి పనిచేయడం లేదని అన్నారు. కరపలో నర్సింగ్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను తీసుకువచ్చి భవనం నిర్మిస్తే గత ప్రభుత్వంలో ఆ భవనాన్ని బీసీ హాస్టల్‌కు ఇచ్చారని అన్నారు. జిల్లాలో లెప్రసీ మళ్లీ విజృంభిస్తున్నట్లు సాంకేతికాలు అందుతున్నాయని, దీనిపై వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సాంఘిక సంక్షేమశాఖామంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ కోనసీమ ప్రాంతం పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని ఈ ప్రాంతంలో వైద్యాన్ని మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జవహర్‌రెడ్డి మాట్లాడుతూ నవరత్నాల పథకంలో పేదల ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మండలాల్లో ఉన్న ఆస్పత్రులను 2020 డిసెంబర్‌ నాటికి పూర్తి స్థాయిలో ఆధునికీకరించి మౌలికసదుపాయాలు కల్పిస్తామన్నారు. ప్రతీ పీహెచ్‌సీలో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌తో పాటు చిన్న, చిన్న ఆరోగ్య పరీక్షలు అన్ని అక్కడే ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందేవారి సంఖ్యను 60 శాతానికి పెంచేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తుని ఆస్పత్రిలో 20 మంది సిబ్బంది అవసరం ఉన్నారని, అనస్థీషియా వైద్యుని, గైనకాలజిస్ట్‌లను నియమించాలన్నారు.

ఎంపీ గీత మాట్లాడుతూ తీరప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అలాగే జిల్లాలో చాపకింద నీరులా హెచ్‌ఐవీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందని దీనికి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ రావులపాలెంలో ట్రామాకేర్, డయాలసిస్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని, దీనికి కావల్సిన స్థలాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలా గైనకాలజిస్ట్‌లను, సివిల్‌ సర్జన్‌లను, ఆర్థోపెడిక్‌ వైద్యులను నియమించాలన్నారు. జగ్గంపేట ఏజెన్సీ ముఖద్వారంగా ఉండడం వల్ల బైపాస్‌ రోడ్డులో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, జగ్గంపేటలో ట్రామాకేర్‌ సెంటర్, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఏలేశ్వరం ఆస్పత్రిని 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని, ప్రత్తిపాడు పీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా మార్చాలన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ పిఠాపురం ఆస్పత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులను డిప్యూటేషన్‌ ఇవ్వకుండా చూడాలని, అవసరమైన చోట్ల వైద్యులను, నర్సులను, ఆస్పత్రి సిబ్బందిని నియమించాలన్నారు.

రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాజమహేంద్రవరం ఆస్పత్రిని 500 పడకల ఆస్పత్రిగా మార్చాలని అన్నారు. ట్రామాకేర్‌ సెంటర్‌ ఉన్నా సిబ్బంది లేరన్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ నగరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ ప్రాంతంలో గ్యాస్‌ లీకైన సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటే వారిని కాకినాడ తరలించాల్సి వస్తోందన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కాకినాడ జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీ చేయాలన్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ మాట్లాడుతూ తమ నియోజకవర్గం పూర్తిగా వెనుకబడి ఉందని, ఈ ప్రాంతంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కిడ్నీ రోగులకు అందించినట్టే పెరాలసిస్‌ రోగులకు కూడా రూ.10వేలు పెన్షన్‌ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులు తమ ప్రాంతాల్లో ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని, వైద్యుల ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆయుష్‌ కమిషనర్‌ రమ్యశ్రీ, అమలాపురం ఎంపీ చింతా అనురాధ, డీఎంఅండ్‌హెచ్‌వో బి.సత్యసుశీల, జేసీ–2 జి రాజకుమారి, మేయర్‌ సుంకర పావని పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు