సమరానికి సై అంటున్న వైసీపీ..

18 Mar, 2019 07:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే గెలుపు గుర్రాలను వైఎస్సార్‌ సీపీ ప్రకటించింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీనియర్లకు పెద్ద పీట వేస్తూనే.. కొత్త వారికి అవకాశం కల్పించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతను ఇస్తూ సమ న్యాయాన్ని పాటించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా సమన్వయకర్తలకే సీటు ఇవ్వడంతో అసమ్మతికి ఆస్కారం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు.. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో సమరాన్ని మరింత ఉధృతం చేయనున్నారు.జిల్లాలోని 16 అసెంబ్లీ, రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఒకేసారి విడుదల చేశారు. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ప్రకటించడంపై కార్యకర్తలు, నాయకుల్లోనూ హర్షం వ్యక్తం అవుతోంది. 

సిట్టింగ్‌లు, సీనియర్లకు ప్రాధాన్యం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తిరిగి సీట్లు లభించాయి. గుడివాడ నుంచి కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), నూజివీడు నుంచి మేకాప్రతాప్‌ అప్పారావు, తిరువూరు నుంచి కె.రక్షణనిధి మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. మాజీ మంత్రి పార్థసారథి పెనమలూరు, మాజీ ప్రభుత్వ విప్‌లు సామినేని ఉదయభాను, పేర్ని శ్రీ వెంకటేశ్వరరావు(నాని)లు జగ్గయ్యపేట, మచిలీపట్నం నియోజకవర్గాల నుంచి ఎన్నికలో గోదాలో దిగుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్‌ నుంచి, వెలంపల్లి శ్రీనివాస్‌ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి జోగిరమేష్‌ పెడన నుంచి పోటీ చేస్తున్నారు. 

కొత్త ముఖాలు.. 
ఈసారి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నుంచి నలుగురు అభ్యర్థులు కొత్తగా రంగంలోకి దిగారు. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావ్, కైకలూరు నుంచి దూలం నాగేశ్వరరావు, పామర్రు నుంచి కైలే అనిల్‌కుమార్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బొప్పన భవకుమార్‌లు ఎన్నికల సమరంలో తమ సత్తా చూపేందుకు ఊవ్విళ్లూరుతున్నారు. అలాగే గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉన్న వారికి ఈసారి సీట్లు లభించాయి. నందిగామ నుంచి మొండితోక జగన్మోహనరావు, మైలవరం నుంచి వసంతకృష్ణ ప్రసాద్, అవనిగడ్డ నుంచి సింహాద్రి రమేష్‌లు మరోసారి పోటీ చేస్తున్నారు. 

అన్ని వర్గాలకు సమన్యాయం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాలో తన సొంత సామాజిక వర్గానికి పెద్ద పీఠ వేస్తే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అందుకు భిన్నంగా అన్ని సామాజికవర్గాలకు సమాన ప్రాధాన్యాన్ని కల్పించింది. కమ్మ, కాపు సామాజిక వర్గాలకు నాలుగేసీ సీట్లు కేటాయించగా, యాదవ వర్గానికి చెందిన పార్థసారథి, గౌడ వర్గానికి చెందిన జోగి రమేష్, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణువర్థన్, వెలమవర్గానికి చెందిన మేకాప్రతాప్‌ అప్పారావు, వైశ్య వర్గానికి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌లకు సీట్లు కేటాయించి సమన్యాయం చేసిందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

అంతా అనుకున్నట్లే..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారికే పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సీట్లు కేటాయించారు. పార్టీని నమ్ముకుని పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి  పార్టీ పదవులు లభిస్తాయనడానికి ఈ సీట్లు కేటాయింపే ఉదాహరణ అని పలువురు నాయకులు చర్చించుకోవడం కనిపించింది. నియోజకవర్గ సమన్వయకర్తలుగా బాధ్యతలు మోస్తున్న వారికందరికీ సీట్లు కేటాయించడంతో అసమ్మతికి అవకాశం లేకుండా పోయింది.

విద్యావంతులు.. యువకులు
పార్టీలో యువకులకు అనుభవం ఉన్నవారికి, చదువుకున్న వారికి ప్రాధాన్యత లభించింది. మొండితోక జగన్మోహనరావు వైద్యుడిగా నియోజకవర్గంలో అందనికి సుపరిచితుడే. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన పార్థసారథి ప్రజాసేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఎంసీఏ చదివి విదేశీ ఉద్యోగావకాశాలను వదులుకుని ప్రజాసేవకు వచ్చిన కైలే అనిల్‌కుమార్,  అమెరికాలో ఐటీ రంగంలో స్థిరపడినప్పటికీ సొంత గడ్డపై ప్రేమతో గన్నవరం వచ్చిన యార్లగడ్డ వెంకట్రావ్‌లను పార్టీ సముచితంగా గౌరవించి సీట్లు కేటాయించింది. 

సీనియర్లకు అందలం..
ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) నాల్గోసారి ఎన్నికల్లో పోటీ చేయనుండగా.. మూడోసారి గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మేకాప్రతాప్‌ అప్పారావు ఐదోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు నూజీవీడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. పార్థసారథి, పేర్ని వెంకట్రామయ్య, సామినేని ఉదయభానులు నాల్గోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరికి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 

మరిన్ని వార్తలు