పన్ను విధింపుపై పునరాలోచించాలి

2 Apr, 2015 02:16 IST|Sakshi
పన్ను విధింపుపై పునరాలోచించాలి

రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి
అదనపు పన్ను భారం ప్రజలపైనే పడుతుందని ఆందోళన

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధించాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కారు అదనంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ట్యాక్స్ రూపంలో లాభం చూసుకుంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ ప్రభావం తెలంగాణ ప్రజలపై పడుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు అదనపు పన్ను వసూలు చేస్తాం, ఈ విషయంలో ఇక ముందు ఎవరితోనూ చర్చలుండవని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొనడం సబబుగా లేదని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పంజాబ్, హరియాణాలకు ఛండీగఢ్ రాజధాని అని అక్కడ ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడం లేదని గుర్తుచేశారు. అక్కడి నిబంధనలనే తెలంగాణ సీఎం కేసీఆర్ పాటిం చాలని డిమాండ్ చేశారు.
 
 విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉందన్న విషయం మరువకూడదన్నారు. 2 రాష్ట్రాల రవాణా విషయంలో ప్రజలు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పా రు. తెలంగాణ సర్కారు అవలంబించిన పన్ను వసూలు విధానం ఏపీ సర్కారు కూడా అవలంబిస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటో ఓసారి ఆలోచించాలని కోరారు. వాహనాలపై విధించే అదనపు పన్ను భారం చివరికి రెండు రాష్ట్రాల ప్రజలపైనే ఏదో ఒకవిధంగా పడుతుందన్నా రు. వైఎస్సార్ సీపీకి రెండు తెలుగు రాష్ట్రాలూ సమానమేనని, రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బం దులు పడకూడదని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో సరుకు రవాణా భారంగా మారనుందని, ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలు, పూలు, పండ్లు రవాణా అవుతుంటాయని, వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని రాఘవరెడ్డి చెప్పారు.

మరిన్ని వార్తలు