రేపటి నుంచి వైఎస్సార్ సీపీ సమీక్షలు

31 May, 2014 03:54 IST|Sakshi
కుడుపూడి చిట్టబ్బాయి

అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో వచ్చిన ఫలితాలపై జూన్ 1,2,3 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు. త్రిసభ్య కమిటీ సభ్యులు భూమా నాగిరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి  రాజమండ్రి, కాకినాడ, రావులపాలెంలలో జరిగే ఈ సమీక్ష సమావేశాలకు హాజరవుతారన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపోటములకు దారితీసిన పరిస్థితులపై వారు లోతైన అధ్యయనం, విశ్లేషణ చేస్తారన్నారు. రాజమండ్రి జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణమండపంలో ఆదివారం ఉదయం 9 గంటలకు రాజమండ్రి రూరల్, 10 గంటలకు రాజానగరం, 11 గంటలకు అనపర్తి, మధ్యాహ్నం 2 గంటలకు రంపచోడవరం, 3 గంటలకు మండపేట, 4 గంటలకు రామచంద్రపురం, 5.30కు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాలపై సమీక్షిస్తారన్నారు.

జూన్ 2న కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు కాకినాడ రూరల్, 10.30కు పెద్దాపురం, 11.30కు ప్రత్తిపాడు, 12.30కు జగ్గంపేట,  3 గంటలకు పిఠాపురం, 4 గంటలకు తుని, 5గంటలకు కాకినాడ సిటీ నియోజకవర్గాలపై సమీక్షిస్తామని చెప్పారు. 3వ తేదీన రావులపాలెం సీఆర్సీలో జరిగే సమీక్షసమావేశంలో ఉదయం 9గంటలకు కొత్తపేట, 10 గంటలకు పి.గన్నవరం, 11కు అమలాపురం, 12కు రాజోలు, 1.30గంటలకు ముమ్మిడివరం నియోజకవర్గాలపై సమీక్షలు జరుగుతాయన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశాల్లో పాల్గొంటారని చిట్టబ్బాయి తెలిపారు.

మరిన్ని వార్తలు