వైఎస్సార్ సీపీ బలోపేతానికే పల్లెబాట

9 Jan, 2015 02:37 IST|Sakshi
వైఎస్సార్ సీపీ బలోపేతానికే పల్లెబాట

‘ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సమస్యలను గుర్తిస్తూ, వాటికి పరిష్కారం చూపుతూ తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే పల్లె బాట కార్యక్రమం చేపట్టాం’ అని  పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
 
చౌడేపల్లె: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లెబాట కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం ఎమ్మెల్యేలు కే.నారాయణస్వామి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, రాజంపేట ఎంపీ  పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డితో కలిసి చౌడేపల్లె మండలంలో పర్యటించారు. చిన్నగొర్నికుంట, కాటిపేరి, వడ్డివారిపల్లె, గురుమర్థనపల్లె, అగిస్తిగానిపల్లె, గిరిజాపురం, కావలివారిపల్లె,పెద్దగొర్నికుంట, లద్దిగం, పుదిపట్ల తదితర గ్రామాల్లో పర్యటించారు. పల్లెపల్లెలో వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలను మోసగించే కార్యక్రమాలు చేపట్టిందన్నారు. చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటి కూడా అమలు కాలేదని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని విస్మరించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హుద్‌హుద్ బాధితుల సాయం కోసం కేంద్రం ఇస్తామన్న రూ.వెయ్యి కోట్లను తీసుకోలేని స్థాయిలో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. త్వరలోనే తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారన్నారు.
 
పార్టీని పట్టిష్టం చేస్తాం..


జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కే.నారాయణస్వామి తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసమే పల్లెబాట కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, జెడ్పీటీసీలు రుక్మిణమ్మ, వెంకటరెడ్డియాదవ్, ఎంపీపీలు అంజిబాబు, నరసింహులు, పార్టీ జిల్లా నేతలు ద్వారకనాథరెడ్డి, పెద్దిరెడ్డి, ఎన్.రెడ్డెప్ప, పోకల అశోక్‌కుమార్, మునిక్రిష్ణారెడ్డి, జింకా వెంకటాచలపతి, బెరైడ్డిపల్లె క్రిష్ణమూర్తి, విశ్వనాథం, జి.శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు