మీ వెంట మేముంటాం..

30 Nov, 2018 08:13 IST|Sakshi
ఉద్యోగులతో పాటు ర్యాలీలో పాల్గొన్న శ్రీనివాస్‌ వంశీకృష్ణ

ఉద్యోగ భద్రతకు భరోసా కల్పిస్తాం..

పార్టీ అధ్యక్షుడికి సమస్య వివరించా..

ఏయూ ఉద్యోగులను పర్మినెంట్‌ చేసేందుకు వైఎస్‌ జగన్‌ హామీ

అధికారంలోకి రాగానే వారం రోజుల్లో ఉత్తర్వులు

జేఏసీ నిరసన ర్యాలీలో వైఎస్సార్‌సీపీ తూర్పు సమన్వయకర్త శ్రీనివాస్‌ వంశీకృష్ణ

ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగులకు పూర్తిస్థాయిలో ఉద్యోగ భద్రత కల్పించే వరకు వైఎస్సార్‌సీపీ విశ్రమించబోదని పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాస్‌ వంశీకృష్ణ భరోసా ఇచ్చారు. గురువారం ఉదయం ఏయూలో జరుగుతున్న ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యను పలుమార్లు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం మరో పర్యాయం మంత్రితో ఉద్యోగుల సమస్య పరిష్కరించమని, రెగ్యులరైజ్‌ చేయాలని కోరానన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంటి అద్దెలు చెల్లిస్తూ నగరంలో కుటుంబంతో జీవనం కష్టతరమవుతోందన్నారు. అధికార పార్టీ నేతలు, స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం విచారకరమన్నారు.

తాను ఇప్పటికే ఉద్యోగుల సమస్యలను పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. వర్సిటీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తానని ఆయన తన మాటగా చెప్పమన్నారన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే వర్సిటీ ఉద్యోగుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగులకు న్యాయం చేయని పక్షంలో విద్యాశాఖమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. వర్సిటీ ఉద్యోగులు నిర్వహించే ప్రతీ ఉద్యమంలో తాను భాగం అవుతానని, వారి వెంట నిలచి ఉద్యమాన్ని మరింత ముందుకు నడిపిస్తామన్నారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి చేపట్టే సమ్మెకు తాము సంఘీభావం తెలుపుతున్నామన్నారు. ఉద్యోగులు చాలీచా లని జీతాలతో ఇబ్బందులు పడుతున్నారని, వారి కుటుంబాలకు మంచి జీవితాన్ని ఇవ్వాలంటే ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయడం ఒక్కటే పరిష్కారమన్నారు. అవసరమైతే ఉద్యోగులతో కలసి మంత్రి గంటా ఇంటికి వెళ్లి మాట్లాడటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

ఉద్యోగుల శ్రేయోభిలాషికే మద్దతు
జేఏసీ ఉపాధ్యక్షుడు డి.వి.రామకోటిరెడ్డి మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు చేస్తామని ఇప్పటికే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని దీనిని స్వాగతిస్తామన్నారు. అదే విధంగా వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తారని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. వారు మాట నిలుపుకోవాలని మరో పర్యాయం విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చిత్తశుద్ధితో ఉద్యోగుల సంక్షేమానికి పనిచేసే వారికే పట్టం కడతామన్నారు. స్వతంత్య్ర వ్యవస్థగా ఉన్న విశ్వవిద్యాలయం ఉద్యోగులకు పర్మినెంట్‌ చేయడంలో వివిధ జీవోల సాకు చూపుతూ నిలుపు చేయడం సరికాదన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవం ఉద్యోగులకు అందించాలన్నారు. జేఏసీ అధ్యక్షుడు డాక్టర్‌ జి.రవికుమార్‌ మాట్లాడుతూ 28 రోజులు, టైంస్కేల్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఇ.లక్ష్మణరావు, జాయింట్‌ సెక్రటరీ ఎస్‌.కె ఫరీద్‌ మాట్లాడుతూ సమస్య పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ కార్యదర్శి కె.అప్పారావు, వర్కింగ్‌ సెక్రటరీ సి.హెచ్‌.ఎన్‌. సత్యనారాయణ, మెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహిచారు. పరిపాలనా భవనం నుంచి ఏయూ మెయిన్‌ గేట్‌ వరకు ర్యాలీ జరిపారు.

‘అమలుకాని వాగ్దానాలతో టీడీపీ వంచన’
ఏయూక్యాంపస్‌ (విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించి, వారిని పర్మినెంట్‌ చేయాలని వైఎస్సార్‌ఎస్‌యూ నాయకులు డిమాండ్‌ చేశారు. వర్సిటీలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు తమ సంఘీభావం తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్‌ విధానంలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్‌ చేస్తామని అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు పూర్తయినా నేటికీ సమస్యలు పరిష్కరించకపోవడం విచారకరమన్నారు. ఉద్యోగుల పోరాటానికి బాసటగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ఎస్‌యూ పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.కాంతారావు, అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు టి.సురేష్‌ కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.మోహన్‌బాబు, కోటి రవికుమార్, ఎం.కళ్యాణ్, విద్యార్థి నాయకులు పి.సుధీర్‌పాల్, కుమార స్వామి, క్రాంతి కిరణ్, సాయికృష్ణ, రాధాకృష్ణ, విజయ కృష్ణ, వెంకటేష్, విజయ్, వినోద్, సంజయ్, జాన్సన్, ధనుష్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు