ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

11 May, 2015 04:48 IST|Sakshi
ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో

పాల్గొన్న విపక్ష రాజకీయపార్టీలు, కార్మిక సంఘాలు
ఆందోళనకారుల అరెస్టు, విడుదల

 
పట్నంబజారు (గుంటూరు) :  న్యాయమైన కోర్కెలు తీర్చాలని కోరతున్నా.. .సమస్యలు పట్టకుండా వ్యవహరిస్తున్న రాష్ట్రప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంపై కార్మికులు కన్నెర్ర జేశారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. బస్టాండ్ ఎదుట రాస్తారోకో దిగారు. కార్మికులు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ.

సీపీఎం పార్టీలు, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ సంఘాలు మద్దతుగా పాల్గొన్నాయి. బస్టాండ్ ఎదుట ఉదయం పది గంటలకు రాస్తారోకో చేపట్టారు. పెద్దఎత్తున ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, కార్మికులు తరలివచ్చి రోడ్డుపై బైఠాయించడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బస్టాండ్‌లో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈస్ట్ డీఎస్పీ సంతోష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవే క్షించి పోలీసు బలగాలను మోహరించారు.

రాస్తారోకో చేస్తున్న రాజకీయ, కార్మిక సంఘాల నేతలను బలవంతంగా అక్కడ నుంచి పక్కకు తొలగించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలను అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో కార్యకర్తలు, కార్మికులు అడ్డుపడడంతో తోపులాట చోటుచేసుకుంది. నేతలతో పాటుగా 23మందిని అరెస్ట్ చేసి పాతగుంటూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ కనీస కనికరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. 43 శాతం ఫిట్‌మెంట్, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సౌకర్యాలు కల్పించాలన్న కనీస కోర్కెలను తీర్చకుండా ఒంటెద్దు పోకడలు పోతోందని మండిపడ్డారు. కార్మికుల హక్కులు సాధించేవరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

గుంటూరు తూర్పు  ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించినంత మాత్రాన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాల వలనే తెలుగుదేశం పార్టీ పాతాళానికి దిగజారిపోయిందన్నారు. మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు అధికార టీడీపీ నేతలా వ్యవహరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాయాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ ఐదు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహమూద్, కొట్టె కవిత, ఝాన్సీ, షేక్ ముస్తఫా, పూనూరి నాగేశ్వరరావు, గుండు శ్రీను, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, రీజయన్ అధ్యక్షుడు ఎన్‌వీకే రావు, శివరాత్రి శ్రీనివాసరావు, ఎన్‌ఎంయూ రీజయన్ కార్యర్శి నరసింహారావు, సీపీఎం నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి, పలు కార్మిక సంఘాల నాయకులు నేతాజీ, వెలుగూరి రాధాకృష్ణమూరి, సుబ్బారావు, భగవాన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఐదో రోజుకు చేరిన సమ్మె
 పట్నంబజార్ (గుంటూరు): సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ  కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారంతో  ఐదో రోజుకు చేరుకుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి ఓ మోస్తరుగా బస్సులు నడిచాయి. అయితే కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెకు దిగడంతో తాత్కాలిక కార్మికులచే ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపించారు. డీఎస్సీని దృష్టిలో పెట్టుకుని తాత్కాలిక సిబ్బంది అధికంగా విధుల్లోకి తీసుకుని బస్సులు నడిపించారు.

రీజియన్ పరిధిలో విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు రాస్తారోకోకు పిలుపులు నివ్వడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకులేదు. రీజియన్‌పరిధిలో సుమారు 952 బస్సులు తిరగాల్సి ఉండగా, 450 బస్సులు మాత్రమే తిరిగాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విద్యార్థులు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సర్వీసులు నడిపేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమ్మె కారణంగా ఈ ఐదు రోజుల్లో ఆర్టీసీ రీజియన్‌కు రూ. 6 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీఎస్సీకి తెల్లవారుజాము నుంచి బస్సులు అధికారులు అందుబాటులో ఉంచారని తెలిపారు.
 
 ఆర్టీసీ సమ్మె దృష్ట్యా ప్రత్యేక రైళ్లు..
 సంగడిగుంట: ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించినట్లు గుంటూరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం జి.శ్రీరాములు ఆదివారం తెలిపారు.  
 సోమవారం..
     07623 నంబరు ప్యాసెంజరు రైలు గుంటూరులో ఉదయం 9.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 14.30 గంటలకు గిద్దలూరు చేరుతుంది.  07624 నంబరు ప్యాసెంజరు రైలు గిద్దలూరులో 15.00 గంటలకు బయలుదేరి 21.00 గంటలకు గుంటూరు చేరుతుంది.ఈ రైళ్లు మార్గం మధ్యలోని అన్ని స్టేషన్లలో ఆగనున్నాయి.

     07053 నంబరు ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాదలో 21.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 13.55 గంటలకు కాకినాడ పోర్ట్ చేరుతుంది.
 మంగళవారం..
     07054 నంబరు ఎక్స్‌ప్రెస్ రైలు కాకినాడ పోర్ట్‌లో 15.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.15 గంటలకు హైదరాబాదు చేరుతుంది. ఈ రైలు మార్గంమధ్యలోని నల్లగొండ, మిర్గాలగూడ, నడికుడి, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

>
మరిన్ని వార్తలు