నారా వారి సారా ప్రవాహానికి అడ్డుకట్ట పడదా?

17 Dec, 2017 10:36 IST|Sakshi

ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు బాబు క్షమాపణ చెప్పాలి

నేటి నుంచి భూమన రెండు రోజుల జిల్లా పర్యటన

వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం అర్బన్‌: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు, డ్వాక్రా మహిళలకు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తానని, మద్య పాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానని 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని, నేడు అందుకు విరుద్ధంగా మద్యపానాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతా రాం ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం ఆదాయాన్ని పెంచుకునేందుకు చంద్రబాబు విచ్చల విడిగా అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. బెల్ట్‌షాపులు, మద్యం దుకాణాలు, పర్మిట్‌రూంల ద్వారా జనంచేత పూటుగా తాగిస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా సరఫరా చేసేందుకు అదనంగా మద్యం బ్రేవరీ(మద్యం డిపో)లను ఏర్పాటు చేయనుందన్నారు. 

ఇప్పటికే మద్యం కారణంగా చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నారా వారి సారా ప్రవాహానికి అడ్డుకట్ట వేయరా అని ప్రశ్నించారు.  ప్రపంచపటంలో హైదరాబాదును పెట్టింది తానేనని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది తానేనని గొప్పలు చెప్పుకునే చంద్రబాబుకు ప్రపంచ తెలుగు మహాసభలకు ఆహ్వానం లేకపోవడం శోచనీయమన్నారు. టీడీపీని స్థాపించిన ఎన్‌టీఆర్‌కే వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని బాబు తన కబంద హస్తాల్లోకి లాక్కుని ఆయన ఆశయాలను, సిద్ధాతాలను ఎన్‌టీఆర్‌ సమాధిలోనే పాతిపెట్టి టీడీపీని మలినపరచారన్నారు.  అటువంటి బాబు తెలుగు మహాసభలకు వచ్చేందుకు అనర్హుడని భావించి కేసీఆర్‌ ఆహ్వానం పంపలేదని తాము భావిస్తున్నామని సీతారాం అన్నారు.  ఎన్‌టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో 20లీటర్ల మంచినీటిని రూ.2కే ప్రజలకు అందిస్తానని హామీనిచ్చిన చంద్రబాబు ఇపుడు నీరుకు బదులు బీరును అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

నేడు భూమన రాక..
పార్టీ సీఈసీ సభ్యుడు అంధవరపు సూరిబాబు మాట్లాడుతూ పార్టీ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం శ్రీకాకుళం జిల్లాకు రానున్నారని, రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారని వెల్లడించారు. ఉదయం 10గంటలకు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో పార్టీ సర్వసభ్య సమావేశంలోను, మధ్యాహ్నం 2గంటలకు పలాస నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలోనూ కరుణాకరరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10గంటలకు టెక్కలిలో నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ ఆధ్వర్యంలో, మధ్యాహ్నం 2గంటలకు నరసన్నపేట నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త ధర్మాన కృష్ణదాస్‌ ఆధ్వర్యంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలోనూ పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమాలకు పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అద్యక్షుడు తమ్మినేని సీతారాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మాన ప్రసాదరావు, రెడ్డి శాంతి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సమావేశాలకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.  సమావేశంలో పార్టీ నేతలు ఎన్ని ధనుంజయ్, కె.ఎల్‌.ప్రసాద్, గంట్యాడ రమేష్, పొన్నాడ రుషి, గేదెల పురుషోత్తం, కోరాడ రమేష్, తంగుడు నాగేశ్వరరావు, నీలాపు ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు