‘ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా మేము సిద్ధం’

6 Mar, 2020 20:02 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌

సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ శుక్రవారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ, టీడీపీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, జనసేన పార్టీల నేతలు హాజరు అయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్‌ సీపీ తరపున ఎమ్మెల్యే జోగి రమేష్‌ హాజరు అయ్యారు.

సమావేశం అనంతరం ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ క్షణంలో ఎన్నికలు నిర్వహించినా వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. మద్యం, నగదుకు ప్రభావితం కాకుండా స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సూచించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొన్ని పార్టీలు ఎన్నికలంటే భయపడుతున్నాయని, అందుకే కరోనా వైరస్‌ అంటూ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. బీసీలను మోసం చేసే చంద్రబాబు నాయుడు 23 ఎమ్మెల్యే సీట్లకు పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్‌ వేసిన బిర్రు ప్రతాప్‌రెడ్డి టీడీపీ నేత అనేది ప్రజలుకు తెలుసు అని అన్నారు.

ఇంటర్‌ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం సూచించారు. మద్యం, ధన ప్రభావం లేకుండా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగం చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఎం నేత వెంకటేశ్వర రావు తెలిపారు. తమ పార్టీ కూడా ఇదే స్టాండ్‌పై ఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై పరిశీలించాలని కోరుతున్నట్లు సీపీఐ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్షన్‌ పేర్కొన్నారు. పరీక్షలు సమయంలో స్థానిక ఎన్నికల నిర్వహణ పరిశీలన చేయాలని, వీలైతే ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన కోరినట్లు తెలిపారు. అదే విధంగా ఎన్నికలు నిర్వహణ కు ఇది సరైన సమయం కాదని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. కరోనా వైరస్ ప్రభావము ఉందని, రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండగా ఎలా నిర్వహిస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు