నయవంచనపై యువ గర్జన

12 Aug, 2018 08:26 IST|Sakshi

కదం తొక్కిన నిరుద్యోగ   యువత 

వైఎస్సార్‌సీపీ యువజన,  విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో  సాగిన ర్యాలీ 

నిరుద్యోగ భృతి చెల్లింపులో    నిరంకుశ విధానాలను నిరసిస్తూ   రోడ్డెక్కిన యువత 

నల్ల చొక్కాలు ధరించి  ప్రభుత్వ   విధానాలకు వ్యతిరేకంగా  నినాదాలు 

కోట నుంచి వైఎస్సార్‌ కూడలి  వరకు సాగిన నిరసన ర్యాలీ

నయవంచక పాలనకు చరమ గీతం పాడుదాం: కోలగట్ల, బొత్స  

విజయనగరం మున్సిపాలిటీ:  విద్యలకు నిలయమైన విజయనగరం జిల్లా యువత గర్జించింది.  ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా నిరుద్యోగలను నయవంచనకు గురి చేస్తోన్న చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన యువగర్జన ర్యాలీలో వేలాది మంది యువత పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. 2014 ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు చంద్రబాబు ఇచ్చిన హమీల అమలు చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి నేతృత్వంలో జరిగిన నిరసన ర్యాలీలో యువత నల్ల చొక్కలు ధరించి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

 స్థానిక కోట జంక్షన్‌ వద్ద  మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామిలు యువగర్జన ర్యాలీని ప్రారంభించగా.. డీసీసీబీ రోడ్, మూడులాంతర్ల జంక్షన్, మెయిన్‌రోడ్, గంటస్తంభం జంక్షన్, కన్యకాపరమేశ్వరి ఆలయం జంక్షన్, డాబాగార్డెన్స్, స్టేట్‌బ్యాంక్‌ మెయిన్‌ బ్రాంచ్, ఎన్‌సీఎస్‌ రోడ్డు మీదుగా వైఎస్సార్‌ కూడలి వరకు ర్యాలీ సాగింది. చంద్రబాబు సర్కారు నయవంచన పాలనపై పెద్దపెట్టున యువత గర్జించారు. సీఎం డౌన్‌డౌన్‌.. నిరుద్యోగులకు ఇచ్చిన హమీలు అమలు చేయాలంటూ నినదించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి జిల్లా యువజన, విద్యార్థి విభాగం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో అనేక పోరాటాలు చేస్తున్నా  ప్రభుత్వంలో చలనం లేకపోవడం దుర్మార్గమన్నారు. ఇచ్చిన హమీలను మర్చిపోవడంతో పాటు మోసపూరిత మాటలు చెబుతూ పబ్బం గడుపుకుంటోందన్నారు. 14న జిల్లాకు వస్తున్న చంద్రబాబుకు కనువిప్పు కలగాలని, నిరుద్యోగుల వేదనను తెలియజెప్పాలనే ఈ యువగర్జన కార్యక్రమం నిర్వహించామన్నారు. చంద్రబాబు జిల్లాకు ఇచ్చిన హమీల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, 15 నెలల కిందట జ్యూట్‌ మిల్లులు తెరిపిస్తానని చేసిన ప్రకటనల ఇప్పటికీ అమలుకునోచుకోలేదన్నారు.

 వేలాది మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడినా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు, సీఎం తరువాత తన కొడుకు లోకేష్‌ను మంత్రి చేసుకున్నారే తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లాలో లక్షల సంఖ్యలో నిరుద్యోగ యువత ఉండగా... వారికి ఉపాధి అవకాశాలు లేక పొట్టచేత పట్టుకుని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఇతరప్రాంతాలకు వలసలు వెళ్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. 2014 నుంచి ఈ రోజు వరకు జిల్లాకు మీరు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజల కోసం కేటాయించిన సంక్షేమ నిధులు పచ్చచొక్కా నేతల జేబుల్లోకి చేరుతున్నాయని విమర్శించారు. 

యువత మేల్కొనాలి... 
బాబు నయవంచక పాలనపై యువత మేల్కొనాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పిలుపునిచ్చారు. ప్రజలను మభ్యపెడుతూ, వారికి అండగాఉన్న పచ్చమీడియాతో ప్రజలను మాయచేస్తూ నాలుగేళ్లు పాలన సాగించారన్నారు. మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు యువత, విద్యార్థులు నడుంబిగించాలన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారం చేసి ఉన్న జాబ్‌లను పీకేసారన్నారు. 

ఇంటికో ఉద్యోగం ఇవ్వకుంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన పెద్ద మనిషి నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్నికల వేళ రూ.వెయ్యి చొప్పున ఇస్తామంటూ ప్రకటించి మరోసారి మోసం చేసేందుకు చూస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ద్వారా మళ్లీ రాష్ట్రంలో స్వర్ణయుగం వస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌.బంగారునాయుడు, జిల్లా కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌ కౌషిక్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షుడు నెలపర్తి రాజ్‌కుమార్‌లు మాట్లాడారు.

 కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం నగర కన్వీనర్‌ ఆశపు వేణు, మండలాధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, సీనియర్‌ కౌన్సిలర్‌లు ఎస్‌వీవీ రాజేష్, కేదారశెట్టి సీతారామ్మూర్తి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌ రాజు, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.వి.రంగారావు, రాష్ట్ర బీసీసెల్‌ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు, జిల్లా సేవాదళ్‌ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మారెడ్డితో పాటు పార్టీ నాయకులు మారోజు శ్రీను, రెడ్డి గురుమూర్తి, కెల్ల త్రినాథ్, గాదం మురళి, తాడ్డి సురేష్, ఆవాల రోహిణీకుమార్, చిన్నిరవితేజ, బి.కిరణ్, జి.సన్యాసిరావు, బండారు ఆనంద్, కె.జగదీష్, కరకవలస అనీల్,  కె.రమేష్, తరుణ్, చలుమూరి ఫణిరాజశేఖర్, బి.అప్పలరాజు, ఎం.నాగబాబు, రజినీ, టి.ప్రసాద్, గుణ, బైక్‌ రమేష్,  రవి పట్నాయక్, ఎస్‌. ప్రసాద్, తాళ్లపూడి పండు, కృష్ణ, గోపి, శ్రీను, బాషా, శివ, లక్ష్మణ్, నాని, వైగేర్‌ ప్రసాద్, కరుణాకర్, అశోక్, వాసు, మురళి, అవినాష్, అంజిబాబు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు