జీవీఎంసీ పీఠంపై జెండా ఎగరాల్సిందే..

1 Jul, 2019 10:12 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ 

ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశం

సాక్షి, విశాఖపట్నం: త్వరలో జరగనున్న జీవీ ఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యం గా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవల సాధారణ ఎన్నికల్లో నగరంలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కొన్ని లోపాలు వల్ల ఓడిపోయామని, వాటిని సవరించుకుని వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు.

రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకుని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త వ్యక్తులు పార్టీలో కలుస్తున్నారని, అందరినీ గమనిస్తున్నామని చెప్పారు. మొదటి నుంచి పార్టీలో ఉండి కష్టపడిన వారికి తగిన గుర్తింపునిస్తామని స్పష్టం చేశారు. కార్యకర్తలు అభద్రతా భావానికి గురికావొద్దన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కులమతాలకు అతీతంగా పాలన సాగుతుందన్నారు.


జిల్లా ఇన్‌చార్జి మంత్రి మోపిదేవిని సన్మానిస్తున్న మంత్రి అవంతి, ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, తదితరులు

ఇన్‌చార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం, గౌరవం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కల్పిస్తారనడానికి తానే ఒక ఉదాహరణని చెప్పారు. తాను ఓడిపోయి ఆస్పత్రిలో ఉంటే పిలిచి మంత్రి స్థానం కల్పించి ఒక పెద్ద జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా నియమించారన్నారు. గత ప్రభుత్వ అవినీతి అక్రమాల వల్ల రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందన్నారు. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి చరిత్రలో ఎన్నడూలేని విధంగా మొట్టమొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలు చేసిని తీరు చూస్తే తండ్రిని మించిన తనయుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో సదస్సుల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. నగరంలో ఓడిపోయిన నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులు నిరుత్సాహం పడకుండా కార్యకర్తల్లో చైతన్యం నింపాలన్నారు.

ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో అన్ని కార్పొరేట్‌ స్థానాలు గెలిపించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో 11 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నామంటే దాని వెనక నాయకులు, కార్యకర్తలు కష్టం ఉందన్నారు. ఇదే కసితో కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ నగరంలో వార్డులు పెరిగాయని, అందులో కొన్ని వార్డులు రెండుగా విభజించబడ్డాయన్నారు. త్వరలో ఆ వార్డులకు అధ్యక్షులను నియమిస్తామని చెప్పారు. అందరి లక్ష్యం జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడించడమే కావాలన్నారు.

ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వమని, జగనన్న నిర్ణయాలు ప్రజల సంక్షేమానికి నాంది పలుకుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని వార్డులను కైవసం చేసుకుంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. ఎమ్మెల్యే కన్నబాబురాజు మాట్లాడుతూ కార్పొరేట్‌ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుస్తామన్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఇంకా ప్రజల దగ్గరికి వెళ్లి పింఛన్‌ ఇస్తామని, ఇళ్లు కట్టిస్తామని మభ్యపెడుతున్నారన్నారు. కార్యకర్తలంతా ప్రజల దగ్గరికి నేరుగా వెళ్లి నవరత్నాలను వివరించాలని సూచించారు.

మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, ద్రోణంరాజు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఇటీవల ఎన్నికల్లో కొన్ని సమన్వయ లోపాలతో ఓడిపోయామని, వాటిని పునరావృతం కాకుండా అందరం సమష్టిగా పనిచేద్దామన్నారు. పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ పార్టీలో ఉన్న సీనియర్ల సలహాలు తీసుకుని జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు దిశగా పనిచేద్దామని చెప్పారు. కష్టపడి పనిచేస్తే పదవులు అవే వస్తాయని, తనకు పదవులపై ఆశలేదన్నారు. త్వరలో నియామకం కానున్న వార్డు వలంటీర్ల విషయంలో పార్టీ వార్డు అధ్యక్షులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వార్డులో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, పాయకరావుపేట సమన్వయకర్త చిక్కాల రామారావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి, సీనియర్‌ నేతలు బెహరా భాస్కర్, సత్తి రామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, ఫరూఖి, అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, పక్కి దివాకర్, కృష్ణంరాజు, శ్యాంకుమార్‌రెడ్డి, మొల్లి అప్పారావు, శ్రీధర్, మంత్రి రాజశేఖర్, నగర అనుబంధ సంఘాల అధ్యక్షులు రాజీవ్‌గాంధీ, గరికిన గౌరి, పీలా వెంకటలక్ష్మి, బోని శివరామకృష్ణ, బద్రినాథ్, కాంతారావు, శ్రీదేవివర్మ పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు