యువనేస్తం అస్తవ్యస్తం

8 Oct, 2018 12:01 IST|Sakshi

భృతి.. భ్రాంతి

సార్వత్రిక ఎన్నికల వేళ కంటితుడుపు భృతి  

అరకొరగా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు

హామీ ఇచ్చిన నాలుగున్నరేళ్లకు భృతి మంజూరు

సవాలక్ష కొర్రీలతో అనర్హత వేటు

వయోపరిమితితో దరఖాస్తుకు దూరం

అనంతపురం, ఎస్కేయూ: ప్రభుత్వ యువనేస్తం..నిరుద్యోగులకు రిక్తహస్తం చూపుతోంది. ప్రభుత్వం అట్టహాసంగా నిరుద్యోగులందరికీ భృతి ఇస్తున్నామంటూ గొప్పలు చెబుతున్నా...సవాలక్ష నిబంధనలతో జిల్లాలో 4 శాతం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. 2014 ఎన్నికల వేళ అలవిగానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత అన్ని వర్గాలను మోసం చేశాడు. ఇపుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అరకొర విదిల్చి మళ్లీ ఓట్ల రాజకీయానికి తెరలేపాడు.

సార్వత్రిక ఎన్నికల వేళ చెప్పిన హామీ
ఏటా డీఎస్సీ ప్రకటిస్తాము. క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకారం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలు ప్రకటిస్తాము. ఖాళీగా ఉన్న 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాము. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని 2014 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ. 

నిరుద్యోగులపై ఉక్కుపాదం
అరకొరగా నిరుద్యోగభృతి కల్పించి.. నిరుద్యోగులను అన్యాయానికి గురిచేయడమే కాకుండా ప్రభుత్వ నోటిఫికేషన్లలో పేర్కొన్న ఉద్యోగాలు సంఖ్యనామమాత్రంగా ఉంది. ప్రస్తుతం డీఎస్సీ ద్వారా 10 వేల ఉద్యోగాలు , గ్రూప్‌–2 కేవలం 330 పోస్టులు, పంచాయతీ సెక్రటరీ 1,600 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో (ఇపుడు ఇవ్వబోయే నోటిఫికేషన్లతో కలిపి) అరకొరగానే పోస్టులను మంజూరు చేశారు. అటు ప్రభుత్వ ప్రకటనలు సజావుగా జారీ చేయకపోగా, నిరుద్యోగ భృతిని చివరి ఆరు నెలల కాలంలో, కేవలం 4 శాతం మందికి మాత్రమే భృతి కల్పించి నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపారు. 

వయోపరిమితి ప్రధాన అవరోధం
రాష్ట్ర విభజన నేపథ్యంలో నిరుద్యోగులకు ఊరట కలిగించి, ఉపాధి కల్పన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకోలేదు. క్రమం తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా జాప్యం చేసింది. దీంతో ఉద్యోగాలు రాకుండా వయోపరిమితి భారమైన నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అటు నిరుద్యోగ భృతికి అనర్హులుగా మిగిలిపోయి. ఈ నాలుగున్నర సంవత్సరం కాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో వేదన మిగిలింది. నిరుద్యోగభృతి దక్కాలంటే వయోపరిమితి సడలించాలనే ప్రధానమైన డిమాండ్లు వినిపిస్తున్నాయి.

దరఖాస్తు తిరస్కరణకు కారణాలు
35 సంవత్సరాల వయోపరిమితి దాటకూడదు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.50 వేలకు మించకూడదు.  
కుటుంబానికి 5 ఎకరాల భూమి (నిరుద్యోగికి కాదు) మించకూడదు.  
నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు.
ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా చేయకూడదు.  
వయోపరిమితిని పరిగణలోకి తీసుకోవడంతో సింహభాగం నిరుద్యోగులు అనర్హులుగా మిగిలారు. అనంతపురం జిల్లాలో కరువు కాటకాల నేపథ్యంలో వ్యవసాయం కుదేలైంది. కుటుంబానికి 5 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదు. అయినా ప్రభుత్వం మాత్రం భూమిని పరిగణలోకి తీసుకుని సింహభాగం నిరుద్యోగులకు రిక్తహస్తం చూపింది.

ఒక్కొక్కరికిరూ.1.08 లక్షలు బాకీ  
సీఎం చంద్రబాబు హామీ మేరకు నిరుద్యోగులందరికీ 54 నెలల భృతి అందాలి. నెలకు రూ. 2 వేలు చొప్పున రూ.1.08 లక్షల బాకీ ఉన్నారు. ఆరు నెలల భృతి ఇచ్చి నిరుద్యోగులను మోసం చేద్దామంటే కుదరదు.  – ఓబులేసు యాదవ్, ఎస్కేయూ.  

వయోపరిమితి పెంచాలి
ఉద్యోగ వయోపరిమితిని పెంచాలి. లేదంటే రానున్న నోటిఫికేషన్లలో చాలా మంది అభ్యర్థులు అనర్హులు అవుతారు. పోలీసు శాఖలోనూ ఉద్యోగ వయోపరిమితి 5 సంవత్సరాలు పెంచాలి. నిరుద్యోగుల శ్రేయస్సుకు విఘాతం కలిగించే చర్యలను విరమించకపోతే రానున్న రోజుల్లో పతనం తప్పదు. – సాకే నరేష్,

బీసీ రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి.క్యాలెండర్‌ ఇయర్‌ ఏమైంది?  
ఏపీపీఎస్సీ ద్వారా ఏటా క్యాలెండర్‌ ఇయర్‌ ప్రకటిస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. గ్రూప్‌–2లో అరకొరగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆశలు వదులుకున్నారు. 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. భర్తీకి నోచుకోలేదు. ఫలితంగా వయస్సు దాటిపోయి .. నోటిఫికేషన్లు వచ్చినా అనర్హులుగా మిగిలిపోతున్నారు.
– క్రాంతికిరణ్,జాగ్రఫీ పరిశోధన విద్యార్థి, ఎస్కేయూ. 

>
మరిన్ని వార్తలు