మాయానేస్తం..డిగ్రీ ఉన్నా.. దరఖాస్తుతిరస్కరణ

4 Oct, 2018 13:51 IST|Sakshi
చిచ్చడి సుశీల

విభజన మండలాల నిరుద్యోగులపై పిడుగుపాటు

ఆన్‌లైన్‌లో లేని తెలంగాణ యూనివర్సిటీలు

6,500 మందికి 100 మందే అర్హులట

నిరుద్యోగ భృతికి నోచుకోని నిర్వాసిత యువత

ఈ చిత్రంలో కనిపిస్తున్న నిరుద్యోగ యువతి పేరు చిచ్చడి సుశీల. వేలేరుపాడు  మండలంలోనిచాగరపల్లి గ్రామం. ఈమె తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో బీఏ పొలిటికల్‌ సైన్స్‌2017లో పూర్తి చేసింది. యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకుంది. రిజిస్టేషన్‌ చేసుకున్నా నంబర్‌ ఎలాట్‌ కాలేదు. ఆన్‌లైన్‌లో అన్ని ఆప్షన్‌లలో ఓకే అయింది. కానీ చదువుకున్న కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో లేకపోవడంతో దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో అర్హత ఉన్నా యువనేస్తం పథకానికి ఎంపిక కాలేకపోయింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశ పెట్టిన యువనేస్తం పథకం పోలవరంముంపు మండలాల్లో 6,500 మంది నిరుద్యోగులకు మొండిచేయి చూపింది. గాంధీ జయంతి రోజున ప్రారంభమైన
ఈ పథకం నిరుద్యోగ యువతను నిరుత్సాహానికి గురి చేసింది. పోలవరం ముంపుతో నిర్వాసితులమై ఇప్పటికే అంతా కోల్పోయామని వేదన చెందుతున్న ఈ ప్రాంత యువత మరింత షాక్‌కు గురయ్యారు.

పశ్చిమగోదావరి, వేలేరుపాడు: ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే స్థాయిలోనే కష్టాలు ఎదురుకాగా వాటిని పరిష్కరించే నాథుడే లేకుండా పోయాడు. ఉమ్మడి ఆంధ్రాలో ఉండగా తమకు సమీపంలోని కళాశాలలో చదువుకోవడం, విభజన తర్వాత అవి తెలంగాణలో ఉండిపోవడమే వీరికి శాపంగా మారింది. ముంపు ప్రాంత ప్రజల పట్ల అధికారుల నిర్లక్ష్యానికి యువనేస్తం పథకం నిదర్శనంగా నిలుస్తోంది. ఓట్లతో సహా అధికారికంగా ఇటీవలే ఆంధ్రాలో కలిపిన అధికారులకు యువనేస్తం పథకం అమలులో వచ్చిన చిన్న ఆటంకాన్ని పరిష్కరించే తీరిక లేకపోవడంపై నిరుద్యోగ యువత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు ప్రాంతమైన పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు, తూర్పుగోదావరి జిల్లాలో కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లో అధికారిక లెక్కల ప్రకారం 66,328 కుటుంబాల నిర్వాసితులున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో మొత్తం 29,545 నిర్వాసిత కుటుంబాలుఉండగా ఇందులో పదివేల గిరిజన కుటుంబా లున్నాయి. ఏడు ముంపు మండలాల్లో సుమారు 6,500 మంది నిరుద్యోగ యువతీ, యువకులు ఉన్నారు. ఈ మండలాల్లో వేలసంఖ్యలో యువనేస్తం పథకానికి నిరుద్యోగులు నిరుద్యోగ భృతి లభిస్తుందని ఆన్‌లైన్‌లో ఎంతో ఆశతో దరఖాస్తులు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.

100 మందే అర్హులట
ఈ ఏడు ముంపు మండలాల్లో 6,500 మంది నిరుద్యోగులుండగా, అందులో వందమంది యువనేస్తం పథకానికి అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. వేలేరుపాడులో 17, కుక్కునూరులో 34, కూనవరంలో 13, చింతూరు మండలంలో 14, వీఆర్‌పురంలో 14, ఎటపాక మండలంలో 8 మంది ఎంపిక అయినట్లు అధికారులు ప్రకటించారు. వేలేరుపాడు, కుక్కునూరు మినహా మిగతా నాలుగు మండలాల్లో మంజూరైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు.

అడుగడుక్కీ కొర్రీలే
నిరుద్యోగ యువకులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నా అడుగడుగునా ప్రభుత్వం కొర్రీలు పెట్టింది. దరఖాస్తు చేసుకున్నాక ఎన్నో నిబంధనలు తెరపైకి వచ్చాయి. ఆధార్‌కార్డు, రేషన్, ఇతర ఆధారాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీలు మాత్రమే  కన్పిస్తున్నాయి. తెలంగాణ యూనివర్శిటీలు లేవు. అసలు తెలంగాణ యూనివర్సిటీల ఆప్షనే లేదు. హాల్‌ టికెట్‌ నంబర్‌ కొట్టినా ఆ డేటా ఎంట్రీ కావడంలేదు. దీంతో వేలమంది అభ్యర్థుల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి.

లభించని తెలంగాణ విద్యాసంస్థల డేటా
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ప్రాంత యువతీ యువకులు తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయ, ఉస్మానియా, జేఎన్‌టీయుహెచ్‌ యూనివర్శిటీలలో విద్యనభ్యసించారు. వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం, ఎటపాకలలో కళాశాలలు కాకతీయ యూనివర్శిటీకి అనుసంధానంగా ఉండేవి. విభజన తర్వాత ఈ కళాశాలలన్నీ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోకి వచ్చాయి. గతంలో చదువుకున్న విద్యార్థుల డేటా అంతా తెలంగాణలోనే ఉంది. ఆంధ్రాలో ఉండే అవకాశమే లేదు. ఫలితంగా నిరుద్యోగ భృతి పథకానికి ఈ ప్రాంత నిరుద్యోగులు నోచుకోవడంలేదు.

గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
ఇలా ఇతర రాష్ట్రాల్లో  విద్యనభ్యసించిన వారు  గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా ఎలాంటి  పరిష్కారం లభించడంలేదు. మీరు ఈ రాష్ట్రపు  గ్రాడ్యుయేట్‌ కాదు అని ఫిర్యాదు చేసిన నిరుద్యోగులకు సమాధానం వస్తోంది. అధికారులు ఎవరూ ఈ ముంపు మండలాల నిరుద్యోగుల గురించి పట్టించుకోవడంలేదు.

వెబ్‌సైట్‌లో మార్పులు చేస్తున్నాం
యువనేస్తం పథకం ముంపు మండలాల నిరుద్యోగులకు వర్తించేలా వెబ్‌సైట్‌ను ప్రభుత్వం మారుస్తోంది. రెండు రోజుల్లో తెలంగాణ యూనివర్సిటీలను కూడా వెబ్‌సైట్‌లోకి తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వెబ్‌సైట్‌లో తిరస్కరణకు గురైన నిరుద్యోగులంతా మళ్ళీ   దరఖాస్తు చేసుకోవచ్చు.  – కె.శ్రీనివాస్, డీఆర్‌డీఏ పీడీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా