‘నలుగురుండి ఏం చేస్తున్నారు’

21 Nov, 2014 01:27 IST|Sakshi
‘నలుగురుండి ఏం చేస్తున్నారు’

రాజానగరం : అన్నదాన సత్రానికి ఆస్తులు అధికంగా ఉన్నా, ఆదాయం అంతంత మాత్రంగా ఉండడంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ వైవీ అనురాధ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ మంటపం నిర్మిస్తామంటూ గ్రామంలోని శ్రీరాజాకాండ్రేగుల జోగిజగన్నాథరావు బహుదూర్ పంతులు అన్నదాన సత్రాన్ని నేలకూల్చిన ప్రాంతాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సత్రానికి ఉన్న ఆస్తులు, వస్తున్న ఆదాయాన్ని పరిశీలించారు. అధికారులపై మండిపడ్డారు. ఏడు గ్రామాల్లో 142 ఎకరాలు ఉంటే దానిలో సాగు భూమిగా ఉన్న 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షల 20 వేలు మాత్రమే ఆదాయం రావడంపై ఆరా తీశారు. ‘నాలుగు ఎకరాలకు కనీసం రూ. లక్ష ఆదాయం రావలసిన తరుణంలో 80 ఎకరాలకు రూ.ఎనిమిది లక్షలా?’ అంటూ అసహనం వ్యక్తం చేశారు.
 
 నలుగురు ఉద్యోగులు ఉండి ఏం లాభం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణం నిబంధనల మేరకు ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని, పన్నుల వసూలుపై దృష్టిని సారించాలని సూచించారు. కూల్చి వే సిన సత్రం స్థల ంలో కల్యాణ మంటపాన్ని నిర్మించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉంటుందనే విషయమై చర్చించారు. రెండు అంతస్తులతో భవనాన్ని నిర్మించి, దిగువన కల్యాణాలకు, ఎగువ భోజన వసతులకు ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్నారు. దాతలు ఇచ్చిన భూములను కూడా కాపాడలేని స్థితిలో ఉద్యోగులు ఉండడం విచారకరమంటూ ఆక్రమణలపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సర్వే చేయించి, గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఉన్న ఆస్తులను ఆక్రమణల నుంచి కాపాడుకోవాలన్నారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ సూరిబాబు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఈఈ సుబ్బారావు, ఆర్‌జేసీ అజాద్, స్థానిక ఉద్యోగులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు