పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో టీటీడీ చైర్మన్

1 Dec, 2019 14:42 IST|Sakshi

సాక్షి, తిరుపతి: నవంబరు 23 నుంచి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనుండగా.. ఆదివారం జరిగిన పంచమి తీర్థం వేడుకల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయన్నారు. నవంబరు 23న ప్రారంభమైన కార్తీక బ్రహోత్సవాలు డిసెంబరు 1న చక్రస్నానంతో ముగిశాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమలకు వచ్చినట్లే తిరుచానూరుకు కూడా లక్షల మంది భక్తులు వచ్చారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు కల్పించామని ఆయన పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి అమ్మవారి ఆశిస్సులు ఉండాలని కోరుకున్నట్లు వైవి సుబ్బారెడ్డి, సతీమణి స్వర్ణలత తెలిపారు. 

అమ్మవారికి శ్రీవారి సారె:
బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం పంచమితీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను తీసుకొచ్చి పద్మావతి అమ్మవారికి సమర్పించారు. పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాభరణాలతో కూడిన సారె తిరుమల మాడ వీధుల్లో ఉదయం 4.30 గంటలకు ఏనుగులపై ఊరేగించారు. ఉదయం10 గంటలకు పుష్కరిణిలోని పంచమితీర్థం మండపంలో స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 12.10కి కుంభ లగ్నంలో పంచమితీర్థం చక్రస్నానం నిర్వహించారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన ఉప ముఖ్యమంత్రి
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆదివారం తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం వేడుకల్లో ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగటం తన అదృష్టం అని పేర్కొన్నారు.  ఇందుకు సీఎం జగన్ కు రుణ పడి ఉంటానని తెలిపారు. సీఎం జగన్ వల్లే నాకు ఈ భాగ్యం కలిగిందని,  రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని కోరుకొన్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు