వెలిగొండ నీళ్లు ఏ సంక్రాంతికి బాబూ?

31 Dec, 2018 09:07 IST|Sakshi

ప్రకాశం జిల్లా ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే పట్టించుకోరు

ఫ్లోరైడ్‌ నీరు తాగి మరణిస్తున్నా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు

న్యాయ స్థానాన్ని తప్పుదోవ పట్టించే ఘనత చంద్రబాబుది

నాలుగున్నరేళ్ల నుంచి రాజధాని నిర్మిస్తూనే ఉన్నావు

మెగా ఉచిత వైద్య శిబిరంలో ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

యర్రగొండపాలెం: వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి సంక్రాంతి నాటికి నీళ్లు ఇస్తానన్నావు, ఏ సంక్రాంతికి నీళ్లు ఇస్తావన్న విషయం స్పష్టం చేయలేదని ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షత వహించారు. వైవీ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ప్రజలు సాగునీరు మాట అటుంచి తాగునీటి కోసం అల్లాడుతుంటే టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. పశ్చిమ ప్రాంత ప్రజలు ఫ్లోరైడ్‌ నీరు తాగి మరణిస్తున్నా.. 

ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని ఆయన అన్నారు. ఫ్లోరైడ్‌ నీటితో జిల్లాలో దాదాపు 500 మంది మరణించినా టీడీపీ నాయకులు చోద్యం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రం కరువుతో అలమటిస్తోందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని  అన్నారు. ముఖ్యంగా జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోందని, రైతు ఆత్మహత్యలు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. కరువు పీడిత ప్రాంత ప్రజలను ఆదుకోవటానికి పశ్చిమ ప్రకాశంను సస్యశ్యామలం చేయటానికి వైఎస్సార్‌ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి 70 శాతం పనులు  పూర్తి చేశారని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాజెక్టుకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, పర్సెంటేజీల కోసం కాంట్రాక్టర్‌ను మార్పు చేశారని విమర్శించారు. ప్రాజెక్టుకు నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలని తాను 3 నెలల క్రితం ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతమైన కనిగిరి నుంచి పాదయాత్ర చేసినా ప్రభుత్వం కళ్లు తెరవలేదన్నారు.

జగన్‌తోనే వెలిగొండ సాధ్యం: 
టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదికే వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చిన ఆ పెద్దమనుషులు అధికారం చేజిక్కించుకొని ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని వైవీ విమర్శించారు. ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితోనే వెలిగొండ ప్రాజెక్టు సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. జగన్‌ సీఎం అయిన సంవత్సరంలోపేప్రాజెక్టును పూర్తి చేస్తారని అన్నారు. 

సీఎం అఫిడవిట్‌ వల్లే హైకోర్టు మార్పు: 
ఏపీలో హైకోర్టు డిసెంబర్‌ 15 నాటికి సిద్ధం అంటూ సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ ప్రకారమే హైకోర్టును తరలించేలా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా అమరావతిలో రాజధాని నిర్మిస్తూనే ఉన్నావు.. అక్కడ ఒక్క ఇటుక కూడా పేర్చలేకపోయిన వాడివి హైకోర్టు సిద్ధం అంటూ అఫిడవిట్‌ ఏ విధంగా ఇచ్చావని ఆయన ప్రశ్నించారు. 

కాసుల కోసం పాకులాడుతున్నారు: 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చరిష్మా, ఆ పార్టీ గుర్తుతోపాటు వైఎస్సార్‌ బొమ్మను అడ్డుపెట్టుకొని గెలిచిన ప్రజాప్రతినిధులు అధికార దాహంతో పార్టీ ఫిరాయించారని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వారికి అధికారం ఉన్నప్పటికీ వెలిగొండ ప్రాజెక్టును గాలికి వదిలివేసి కాసుల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో  ప్రత్యేక హోదా సజీవంగా ఉందంటే అందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులను త్యాగం చేయడం వల్లనే అని ఆయన అన్నారు. పదవులు ప్రధానం కాదని,  ప్రజాసేవే పరమావధిగా భావించించిన వైవీ సుబ్బారెడ్డి ప్రజలకు సేవలు చేస్తూనే ఉన్నారని ఆయన కొనియాడారు.

 వెలిగొండ ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేశారని, పేదల వద్దకు వైద్యం తీసుకొని వెళ్లేలా మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారని, ఇప్పటి వరకు ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారని ఆయన అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకుడు వెన్నా హనుమారెడ్డి, వైపాలెం ఎంపీపీ చేదూరి విజయభాస్కర్, పెద్దారవీడు, పెద్దదోర్నాల జెడ్పీటీసీ సభ్యులు దుగ్గెంపూడి వెంకటరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు డి.కిరణ్‌గౌడ్, యు.శ్రీనివాసరెడ్డి, జె.ఆవులరెడ్డి, పి.చంద్రమౌళిరెడ్డి, సీనియర్‌ నాయకుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర నాయకులు కె.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, ఎం.బాలగురవయ్య, కె.ఓబులరెడ్డి, ఎం.సుబ్బారెడ్డి, కె.ప్రమీల, ధనలక్ష్మిబాయి, అరుణాబాయి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోట్ల సుబ్బారెడ్డి, త్రిపురాంతకం మాజీ ఎంపీపీ ఆళ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు