హోదా వచ్చే వరకు పోరాటం: వైవీ సుబ్బారెడ్డి

28 Jun, 2018 13:46 IST|Sakshi

సాక్షి, చింతలపూడి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 25 ఎంపీ స్థానాలు ఇస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని పార్టీ పశ్చిమగోదావరి జిల్లా పరిశీలకులు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. గురువారం ఉదయం చింతలపూడిలో పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. 

తమ పార్టీ అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రజలకు మేలు చేస్తామని, వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాజన్న రాజ్యం వస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ కుట్రలను ఇంటింటికి ప్రచారం చేయాలని, పశ్చిమలో అన్ని స్థానాలు పార్టీ గెలిచేలా కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. పామాయిల్‌ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చింతలపూడి రైతాంగానికి న్యాయం చేయకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అందోళనలు చేపడతామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. 

చంద్రబాబు చేతిలో మోసపోయిన పశ్చిమ ప్రజలు వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రజాసంకల్పయాత్రను విజవంతం చేసిన జిల్లా ప్రజలకు, నాయకులకు వైవీ సుబ్బారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అంతకముందు నియోజకవర్గ సమన్వయకర్త ఎలీజా ఆధ్వర్యంలో ధర్మాజీగూడెం నుంచి చింతలపూడి వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్తలు విఆర్‌ ఎలీజా, కొఠారు అబ్బాయి చౌదరి, తలారి వెంకట్రావు, నేతలు దయాల నవీన్‌ బాబు, సాయిజాల పద్మ, జానకీ రెడ్డి, పోల్నాటి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు