టీటీడీ ప్రతిష్టను పెంచుతాం 

23 Jun, 2019 05:49 IST|Sakshi
టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి దంపతులకు ప్రసాదాలు అందజేస్తున్న టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

స్వామి ఆభరణాల విషయంలో అవకతవకలుంటే చర్యలే 

అర్చకుల వివాదాన్ని ఆగమ శాస్త్రానికి లోబడి పరిష్కరిస్తాం 

పీఠాధిపతుల సలహాలు స్వీకరిస్తాం 

వారం రోజుల్లో పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పాటు 

నేటి నుంచే టీటీడీలో ప్రక్షాళన ప్రారంభం 

టీటీడీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారానంతరం వైవీ సుబ్బారెడ్డి 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆగమ శాస్త్రాలు, సంప్రదాయాలు, నియమాలను గౌరవిస్తూ టీటీడీ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా మరింత పెంచుతామని తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. టీటీడీ మీద వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ ఉంటుందని ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం 50వ చైర్మన్‌గా శనివారం ప్రమాణ స్వీకారానంతరం మీడియాకు తెలిపారు. వారం రోజుల్లో పూర్తిస్థాయి పాలక మండలి ఏర్పాటవుతుందన్నారు. అంతకుముందు.. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కొత్త చైర్మన్‌తో ఉదయం 11.47గంటలకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించిన వైవీ సుబ్బారెడ్డి.. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు.  

సామాన్య భక్తులకూ ప్రాధాన్యత.. 
కలియుగ దైవం కృపవల్ల సీఎం వైఎస్‌ జగన్‌ ఈ బాధ్యతను తనకు అప్పగించినందుకు ముఖ్యమంత్రికి వైవీ సుబ్బారెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అందరినీ కలుపుకుని సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ వారికి మెరుగైన సేవలు అందించమని సీఎం చేసిన సూచనలను పాటిస్తానన్నారు. ఇక్కడ ప్రతి పైసా పేద ప్రజలది, భక్తులదని.. అలాంటిది ప్రతిపైసా స్వామి సేవకే వెచ్చిస్తామన్నారు. తిరుమల నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తానని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

అర్చకుల వయోపరిమితిపై పీఠాధిపతుల సలహాలు తీసుకుని బోర్డులో చర్చించి చివరిగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామన్నారు. స్వామివారి ఆభరణాల విషయంలో వస్తున్న ఆరోపణల్లో వాస్తవం ఉందని తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆలయ ప్రతిష్టను దేశ విదేశాలకు విస్తరించేలా, ప్రభుత్వ ప్రతిష్టను పెంపొందించేలా వైవీ సుబ్బారెడ్డికి శక్తినివ్వాలని కోరుతూ శ్రీవారిని ప్రార్థించానన్నారు. వైవీని టీటీడీ బోర్డు చైర్మన్‌గా నియమించడం హర్షించదగ్గ విషయమని డెప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.  

మరిన్ని వార్తలు