జాతర ముసుగులో జబర్దస్త్ వసూళ్లు..?

18 May, 2016 01:29 IST|Sakshi

చందాల కోసం అధికార పార్టీ  నేతల ఒత్తిళ్లు
బెంబేలెత్తుతున్న కుప్పం వ్యాపారులు, వైద్యులు

 

తిరుపతి :  అమ్మవారి జాతర పేరిట విరాళాల దందా మొదలైంది. జాతర నిర్వహణకు భారీగా చందాలివ్వాలంటూ పలువురు టీడీపీ నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. చందాలు ఇచ్చేందుకు నిరాకరించే వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలతో పాటు వ్యాపారులు, పేరున్న వైద్యులు బెంబేలెత్తి పోతున్నారు. సీఎం చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తోన్న కుప్పం పట్టణంలో ఈ పరిస్థితి నెలకొంది.

 
కుప్పంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరను ఏటా భక్తులు సంప్రదాయ బద్దంగా జరుపుతుంటారు. ఈ సారి కూడా ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల నిర్వహణకు ఆలయ కమిటీతో పాటు ప్రత్యేకంగా సబ్ కమిటీలు, ఉత్సవ కమిటీలు కూడా ఏర్పడ్డాయి. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు హాజరయ్యే వీలున్నందున భారీ ఎత్తున జాతర జరపాలని పెద్దలు నిర్ణయించారు.  ప్రధానంగా ఉత్సవాల నిర్వహణ బాధ్యతల్లో ఉన్న కొందరు టీడీపీ నేతలు ఇందుకోసం చందాలు వసూళ్లు చేస్తున్నారు. సాధారణంగా అమ్మవారిపై భక్తి భావం ఉన్న వారంతా ఏటా తమకు తోచినంత విరాళాలను జాతర టకోసం ఇస్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం చందాల దందా కనిపిస్తోందని సమాచారం.

 
వేలు...లక్షల కోసం ఒత్తిళ్లు...
ఉత్సవాలకు విరాళాలివ్వడం భక్తుల మనోభీష్టానికి సంబంధించిన అంశం. తమకున్న ఆర్థిక స్తోమతను బట్టి భక్తులు, వ్యాపారులు చందాలిస్తుంటారు. అయితే జాతర ముసుగులో బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. గంగమ్మ దేవస్థానం ఉన్న నేతాజీ రోడ్డులో వ్యాపారాలు నిర్వహించే షాపుల యజమానులందరూ రూ.5 నుంచి రూ.25 వేల వరకూ చందాగా ఇవ్వాలని నిర్ణయించినట్లు కొందరు పెద్దలు నిర్ణయించినట్లు తెల్సింది. ఉత్సావాల నిర్వహణ కోసం ఓ క్వారీ యజమానిని రూ.5 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. పట్టణంలో పేరున్న వైద్యులు కూడా లక్షల్లో చందాలివ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపారులు సైతం పెద్ద మొత్తంలో చందాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లు తేవడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఒత్తిళ్లు, వసూళ్లు సమంజసం కాదని భావించిన పలువురు పట్టణ పెద్దలు, ప్రజాసంఘ నాయకులు ఈ నెల 20 లోగా టీడీపీ జిల్లాస్థాయి నేతలను కలిసి పరిస్థితిని వివరించేందుకు సమాయత్తమవుతున్నారని తెల్సింది.

మరిన్ని వార్తలు