జీరో బ్యాలెన్స్‌తో ఖాతా తెరుస్తాం

5 Mar, 2019 12:27 IST|Sakshi

 పోస్టల్‌ శాఖ బ్యాంకింగ్‌ రంగంలోను విస్తరణ

పోస్టాఫీసులు ద్వారా ఆధార్, పాస్‌పోర్టు సేవలు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : తపాలా అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉత్తరాల బట్వాడా. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ అనేక మార్పులను చేసుకుంటూ తన పరిధి పెంచుతోంది. తపాలాశాఖ పూర్తిగా డిజిటలైజేషన్‌తో ప్రజలకు విస్తృత సేవలు అందించడంలో ముందు వరుసలో ఉంటోంది. పోస్టల్‌ శాఖ ప్రస్తుతం బ్యాంకింగ్‌లో ప్రవేశించి తన పరిధిని మరింత విస్తృతపరిచింది. మారు మూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్ని రకాల సేవలను అందుబాటులో ఉంచినట్లు కడప డివిజనల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌  ఎ. శ్రీనివాసరావు వెల్లడించారు. తపాలా సేవలను మెరుగు పరుస్తున్నామని ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ఆ వివరాలు ..

 

డిజిటలైజేషన్‌..  
‘తపాలా శాఖ మార్పుల్లో భాగంగా ఎలక్ట్రానిక్‌ వ్యాపార లావాదేవీలపై దృష్టి సారించింది. డిజిటలైజేషన్‌తో   పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఆర్థికపరమైన లావాదేవీలు అందించేందుకు ఇండియా పోస్ట్‌ పేమెంట్‌  బ్యాంకును రంగంలోకి దించాం. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అతి చేరువయ్యేలా ఈ బ్యాంకింగ్‌ విధానాన్ని రూపొందించారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా బ్యాంకులను ప్రారంభించాం. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక లబ్ధి చేకూర్చే పథకాలను పొందే లబ్ధిదారులకు నేరుగా రాయితీలను వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

9వేల బ్యాంకు ఖాతాలతో.....
కడప డివిజన్‌ పరిధిలో ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకును కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంకులో ఇప్పటి వరకు   దాదాపు 9 వేల ఖాతాలను ప్రారంభించాం. అంతా ఆన్‌లైన్‌ కావటంతో  ఖాతాదారుల ఖాతాల్లో ప్రభుత్వం అందిస్తున్న రాయితీ  నేరుగా జమ అవుతోంది. ఖాతాదారుల ఖాతా ద్వారా పన్నులు, విద్యుత్‌ బిల్లులు వంటివి చెల్లించవచ్చు.ఇతర ఖాతాల్లోకి నగదును కూడా తమ ఖాతా నుంచి చెల్లించే సదుపాయం ఉంది. అలానే ఖాతాదారుడి ఇంటికే సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఐపిపిబి బ్యాంకు వ్యవహారమంతా కాగితరహిత పాలన జరుగుతోంది. ఖాతాను ప్రారంభించేందుకు కూడా ఎలాంటి కాగితాలు , పాస్‌ పుస్తకాలు ఉండవు. క్యూఆర్‌ కార్డు విధానాన్ని అమలుల్లోకి తీసుకువచ్చాం. పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌ నెంబర్‌ ఇస్తే చాలు బ్యాంకు ఖాతాను తెరుస్తారు. పాస్‌పుస్తకం బదులు క్యూఆర్‌ కార్డు ను ఇస్తారు. ఈ కార్డు బ్యాంకుకు తీసుకెళితే కార్డును స్కానింగ్‌ చేయగానే ఖాతాదారుల వివరాలు కంప్యూటర్‌లో దర్శనమిస్తాయి.‘0’ బ్యాలెన్స్‌తో ఖాతాను తెరిచే సదుపాయం కల్పిస్తున్నాం. అలానే ఐపిపిబి యాప్‌ను కూడ ఆవిష్కరించాం.
తపాలా శాఖ ద్వారా మెరుగైన సేవలు అందిస్తున్నాం. స్పీడ్‌ పోస్ట్‌ లావాదేవీలు, లాజిస్టిక్‌ పోస్టు, బిజినెస్‌ పార్శిల్, ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్, మీడియాపోస్టు, డైరెక్ట్‌ పోస్ట్, ఈ పోస్టు, ప్యాక్‌పోస్ట్‌ తదితర సేవలు అందిస్తున్నాం. 

తపాలా బీమాకు విశేష ఆదరణ...
తపాలా బీమా పథకం ప్రాచుర్యంలో ఉంది. ముందుగా తపాలా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని ప్రారంభించగా తర్వాత ఉద్యోగుల కోసం.. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ తపాలా పేరిట విస్తరించింది. ప్రస్తుతం దీనిని కూడా ఆన్‌లైన్‌ చేయటం ద్వారా ప్రీమియంను ఎక్కడైనా చెల్లించవచ్చు.

ఆధార్, పాస్‌పోర్టు సేవలు...
తపాలా శాఖ ద్వారా ఆధార్, పాస్‌పోర్టు సేవలు కూడ అందిస్తున్నాం. యూఐడీఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని కడప డివిజన్‌ పరిధిలో పోస్టాఫీసులో దాదాపు 18 ఆధార్‌ సెంటర్లు ఏర్పాటు చేసి రోజుకు దాదాపు 300 మంది వరకు ఆధార్‌ సేవలు అందిస్తున్నాం. పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సైతం అందుబాటులోకి తెచ్చి జిల్లా వాసులకు ఈసేవలను విస్తృతంగా అందజేస్తున్నాం.’ అని  కడప డివిజనల్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌  ఎ. శ్రీనివాసరావు వివరించారు.

మరిన్ని వార్తలు