అంతా రహస్యమే!

15 Aug, 2015 04:10 IST|Sakshi
అంతా రహస్యమే!

జిల్లా పరిషత్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అంతా రహస్యంగా నడిపారు. వివిధ ఆంక్షల నేపథ్యంలో ఉద్యోగులను బదిలీ చేశారు. ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చారు. జెడ్పీ సీఈవో కనుసన్నల్లోనే పూర్తి కథ నడిపారు. దీనిపై పలువురు ఉద్యోగులు విమర్శలు గుప్పించారు.
 
- జిల్లా పరిషత్ ఉద్యోగుల బదిలీలు  
- ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా ఎంపీడీవోలకు స్థాన చలనం
- ముందుగా ఖరారైనస్థానాలకు మినిస్టీరియల్ సిబ్బంది నియామకం
- మీడియాకు అనుమతి నిరాకరణ
అనంతపురం సెంట్రల్ :
జిల్లా పరిషత్ చైర్మన్ చమన్ చాంబర్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉద్యోగుల బదిలీలు నిర్వహించారు. ఎంపీడీవోలు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, టైపిస్టులు, ఆఫీస్ సబార్డినేట్‌లు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరినీ తప్పనిసరిగా బదిలీ చేశారు. ఐదేళ్లు పూర్తికాని వారిలో కొందరికి పరిపాలన సౌలభ్యం దృష్ట్యా స్థాన చలనం కల్పించారు. జిల్లా పరిషత్ సీఈవో రామచంద్ర అంతా తానై వ్యవహరించారు. ఉద్యోగులు వారి సమస్యలు చెప్పుకునే వీలుకూడా లేని పరిస్థితిని కల్పించారు. ఉద్యోగులు పలానా ప్రాంతానికి నేను వెళ్తాను అని ముందుకొచ్చిన సమయంలో నీవు అక్కడ చేయలేవు మరో చోటకు కోరుకో అంటూ వారిని భయపెట్టి సీఈవోనే నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

జిల్లా పరిషత్‌లో పనిచేసే ఓ మహిళా సీనియర్ అసిస్టెంట్ త్వరలో పదోన్నతి వస్తున్న దృష్ట్యా దగ్గరలో ఉన్న రాప్తాడు మండల పరిషత్‌కు బదిలీ చేయాలని కోరితే నీవు అక్కడ తట్టుకోలేవని సర్ధిచెప్పినట్లు తెలిసింది. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఓ జూనియర్ అసిస్టెంట్ తనను అర్‌డబ్ల్యూఎస్‌కు బదిలీ చేయాలని కోరగానే ఆయనపై సీఈవో మండిపడినట్లు సమాచారం. ‘ఐదేళ్లుగా తినేందుకు అలవాటు పడినట్లు ఉన్నావ్.. ఒకసారి చెబితే అర్థం కాదా.. మళ్లీ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు పోవాలని కోరుతావ్’ అంటూ అందరి సమక్షంలోనే ఫైర్ అయినట్లు తెలిసింది.
 
ఊహించిన విధంగానే ఎంపీడీవోల బదిలీలు :

ముందుగా ఊహించిన విధంగా ఈ సారి ఎంపీడీవోల బదిలీలు ఎమ్మెల్యేల లేఖల ఆధారంగా జరిగాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభవుతున్న సమయంలోనే ఎంపీడీవో అసోషియేషన్ ఆధ్వర్యంలో పలువురు ఎంపీడీవోలు చైర్మన్ చమన్‌ను కలిశారు. మండలాల్లో జరుగుతున్న పరిస్థితిని ఆయనకు వివరించారు. ఈ సారి బదిలీలు వద్దు.. ఎమ్మెల్యేలు ఎవరు చెబితే వారికి ఆ స్థానాలు కేటాయించాలని కోరారు.

ఎమ్మెల్యేలను కాదని కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేస్తే ఆయా మండలాల్లో పనిచేయలేమని స్పష్టం చేశారు. ఇందుకు చెర్మైన్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సాధారణ బదిలీల అనంతరం నూతనంగా ఉద్యోగోన్నతి పొందిన 13 మంది ఎంపీడీవోలకు పోస్టింగ్ కేటాయిస్తామని తొలుత ప్రకటించారు. అయితే రెండు రోజుల క్రితమే వారికి పోస్టింగ్ ఖరారు చేసినట్లు తెలిసింది.
 
52 మంది ఉద్యోగుల బదిలీ
నూతనంగా పదోన్నతి పొందిన 13 మంది ఎంపీడీవోలకు, అదనంగా కొం తమందికి స్థాన చలనం కల్పించారు. అయితే వీరికి శనివారం పోస్టింగ్‌లు కల్పించనున్నట్లు చెర్మైన్ చమన్ తెలిపారు. అలాగే ముగ్గురు సూపరిం టెండ్, నలుగురు టైపిస్టులు, 29 మంది జూనియర్ అసిస్టెంట్‌లు, 16 మంది  సీనియర్ అసిస్టెంట్‌లకు స్థానం చలనం కల్పించారు. ఉద్యోగుల బదిలీలు సజావుగా నిర్వహించడానికి కృషి చేసిన జెడ్పీ చైర్మన్ చమన్‌ను ఉద్యోగ సం ఘాల నాయకులు అభినందించారు.

మరిన్ని వార్తలు