రాజన్న హయాంలో బతుకులు సాఫీగా సాగాయి...

26 Sep, 2018 06:41 IST|Sakshi
జిందాల్‌ కార్మికుల సమస్యలు తెలుసుకుంటున్న జగన్‌మోహన్‌రెడ్డి

ఇప్పుడు అర్ధాకలి బతుకులయ్యాయి...

జగన్‌మోహన్‌రెడ్డి వద్ద జిందాల్‌ కార్మికులు 

విజయనగరం , ప్రజాసంకల్ప యాత్ర బృందం: ‘రాజన్న హయాంలో కచ్చితంగా సమయానికి వేతన సవరణ జరగడంతో మా జీవితాలు సాఫీగా సాగాయి...రాజన్న మరణం తరువాత వచ్చిన ప్రభుత్వాలు జీఓలు మార్చి కార్మికుల పొట్టకొడుతున్నాయి. యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నాయి. ఇప్పుడు అర్ధాకలి బతుకులయ్యాయి...మళ్లీ మీరు సీఎం అయితేనే మా బతుకులు మారుతాయి....’ ఇవీ....జిందాల్‌ ఫెర్రో ఎలాయిస్‌ కర్మాగారం కార్మిక సంఘాల నేతలు ఆర్‌.ఎం.అప్పలనాయుడు, పి.ప్రసాదరావుతో పాటు పలువురు కార్మికులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద అన్న మాటలు. పాదయాత్రగా వస్తున్న జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం కలిసి తమ సమస్యలు మొరపెట్టుకున్నారు. వినతిపత్రం అందజేశారు. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జిందాల్‌ కర్మాగార కార్మికుల సమస్యలు తెలుసుకున్నారని, కర్మాగారం మూతపడిన తరువాత కుటుంబాలతో రోడ్డున పడ్డామంటూ చెప్పారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఫెర్రో ఎల్లాయిస్‌ కర్మాగారాలకు విద్యుత్‌ చార్జీలు తగ్గించడంతో పాటు వేతన సవరణ చట్టాన్ని ప్రతీ రెండేళ్లకొకసారి అమలు చేసేవారని గుర్తు చేశారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్‌ పథకాలతో సంతోషంగా జీవించే వారమని చెప్పారు. రాజన్న తరువాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో 2012లో వేతన సవరణ చట్టాన్ని మార్చి రెండేళ్లకొకసారి జరగాల్సిన వేతన సవరణను ఐదేళ్లకు మార్చి డీఏ మంజూరు చేశారని తెలిపారు. మారిన చట్టం ప్రకారం 2017లో వేతన సవరణ జరగాల్సి ఉన్నా నేటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రాజన్న హయాంలో వేతన సవరణతో జీతాలు పెరిగాయని తరువాత తమను పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్నారు. 30 ఏళ్ల సర్వీసు ఉన్న కార్మికులకు ఇప్పుడు రూ.5,500లు వేతనం లభిస్తోందని ధరలు స్థిరీకరణ లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోందంటూ ఆవేదనతో చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉన్న ఫెర్రో ఎల్లాయిస్‌ కర్మాగారాల్లో 30 ఏళ్లుగా పని చేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కాగానే తమకు పూర్వం మాదిరిగా రెండేళ్లకోసారి వేతన సవరణ జరిగేలా చూడాలని కార్మికుల బతుకులకు భరోసా కల్పించాలని విన్నవించారు.

జగన్‌ను కలిసిన  కడప నేతలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన పలువురు నేతలు  విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో కలిశారు. ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం తుమ్మికాపల్లి సమీపంలో యాత్ర శిబిరం వద్ద కమలాపురం నియోజకవర్గం పెళ్లిమర్రి మండలం మమ్మసిద్దిపల్లి గ్రామానికి చెందిన సింగిల్‌ విండో అధ్యక్షుడు కె.నాగేందర్‌రెడ్డి, ఎస్‌.శివశంకర్‌రెడ్డి కలిశారు. ప్రజా సంకల్పయాత్రకు మద్దతుగా, ఆయన్ను చూసేందుకు వచ్చినట్టు తెలిపారు. అలాగే ఎస్‌.శివశంకర్‌రెడ్డి ఇంట్లో వివాహ వేడుకకు సంబంధించిన శుభలేఖను జగన్‌మోహన్‌రెడ్డికి ఇచ్చినట్టు చెప్పారు.–ప్రజా సంకల్ప యాత్ర బృందం

మరిన్ని వార్తలు