ఏపీ రాజధాని ప్రాంతంలో జూపార్కు

20 Apr, 2016 03:37 IST|Sakshi
ఏపీ రాజధాని ప్రాంతంలో జూపార్కు

పర్యాటక శాఖపై సమీక్షలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో జంతు ప్రదర్శన శాఖ(జూపార్కు) ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, తిరుపతిలో ప్రస్తుతం ఉన్న జూలను అభివృద్ధి చేయడంతోపాటు రాజధానిలో కొత్త జూ ఏర్పాటుచేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలని చెప్పారు. రాష్ట్రానికి స్వదేశీ పర్యాటకుల రాక గతేడాది 45 శాతం పెరగ్గా విదేశీ టూరిస్టుల రాక 81 శాతం పెరిగిందని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ సీఎంకు తెలిపారు.

విశాఖ జిల్లాలో ఇప్పుడున్న బీచ్‌లు కాకుండా మరో 6 బీచ్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. విశాఖలోని కంభాలకొండ, కైలాసగిరి ప్రాంతాలను హిల్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. శ్రీశైలంలో టైగర్ సఫారీ, కుప్పంలో ఎలిఫెంట్ సఫారీ ఏర్పాటు చేయాలన్నారు. నేలపట్టు, కొల్లేరు, పులికాట్ ప్రాంతాలను వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నంలో ఈట్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలన్నారు.

విశాఖపట్నం, తిరుపతి, అమరావతి నగరాల్లో బొటానికల్ గార్డెన్లు నెలకొల్పాలని సూచించారు. అన్నవరం క్షేత్రాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ టౌన్‌గా తీర్చిదిద్ది అక్కడ జరిగే సత్యనారాయణస్వామి వ్రతాలకు ఉత్తర భారతదేశంలోనూ ప్రాచుర్యం కల్పించాలన్నారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు ప్రాంతాన్ని విద్యుత్ వెలుగులతో సుందరీకరించాలని, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఫోర్టులో ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు