పదునెక్కిన వ్యూహం

30 Jun, 2014 03:02 IST|Sakshi
పదునెక్కిన వ్యూహం

- ‘స్థానిక’ పీఠం కైవసంలో నువ్వా..నేనా..?
- జెడ్పీచైర్మన్‌పై ‘వైఎస్సార్ సీపీ’ ధీమా
- టీడీపీ కుయుక్తులపై బీసీ సంఘాల గుర్రు

 సాక్షి, ఒంగోలు: సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ప్రాభవం కోల్పోయింది. ఆ పార్టీ తరఫున మెజార్టీ సభ్యులు స్థానిక ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఇన్నాళ్లకు చైర్మన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీకావడంతో.. స్థానిక పగ్గాలూ అధికార పార్టీకే దక్కాలనే ఆలోచనతో...బలహీనంగా ఉన్నచోట ధనబలం ప్రదర్శించేందుకు తెలుగు తమ్ముళ్లు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కూడా మున్సిపాలిటీ, మండల స్థాయిల్లో తమ బలాన్ని పదిల పరుచుకునే ప్రయత్నాలపై వ్యూహ రచన చేస్తోంది.
 
జెడ్పీపీఠం బీసీ నేతకే..
ముందెన్నడూ లేని విధంగా ల్లాలో బీసీలకు రాజకీయ గుర్తింపును ఇవ్వడంలో వైఎస్సార్ సీపీ ముందంజలో నిలిచింది. వాస్తవానికి రిజర్వేషన్ల ప్రకటన ప్రకారం జిల్లా జెడ్పీచైర్మన్ పదవి ఓసీ జనరల్ అయింది. అయితే, వైఎస్సార్ సీపీ మాత్రం ఆ పదవిని బీసీ వర్గానికే కేటాయిస్తున్నామని ప్రకటించి...జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ నూకసాని బాలాజీని జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేసింది.

దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో బీసీవర్గంలో కదలిక వచ్చింది. మొత్తం 56 జెడ్పీటీసీ స్థానాలకు గాను 31 స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించింది. టీడీపీని మాత్రం 25 స్థానాలకే పరిమితం చేశారు. సాధారణంగా జెడ్పీచైర్మన్ పదవిని ఎన్నుకునే క్రమంలో మ్యాజిక్‌ఫిగర్ 29 కాగా... వైఎస్సార్‌సీపీ పూర్తిబలం చాటుకున్న విషయం తెలిసిందే. నూకసాని బాలాజీ ఎన్నిక ఖాయం కావడంతో బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
తప్పుడు ప్రచారంతో కుయుక్తులు    
మండల ప్రాదేశిక సభ్యుల బలాల ప్రకారం ఎంపీపీలను కూడా ఎన్నుకునే ప్రక్రియ జరగనుంది. అయితే, జెడ్పీపీఠం కైవసానికి వైఎస్సార్ సీపీకి స్పష్టమైన సభ్యుల మెజార్టీ ఉన్నప్పటికీ... టీడీపీ కూడా ఆ పీఠం తమదేనంటూ ప్రచారం చేసుకుంటోంది. తమకు ఇప్పటికే ఉన్న 25 మందితో పాటు మరికొంత మంది ప్రత్యర్థి పార్టీ నుంచి అనుకూలంగా కలిసివస్తారని.. తమతో ఆయా సభ్యులు మాట్లాడుతున్నారంటూ మైండ్‌గేమ్ ప్రచారం  చేయడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  
 
అధికారం, ధనం పలుకుబడితో ప్రత్యర్థులను మచ్చికజేసుకుని జెడ్పీపీఠం కైవసం చేసుకోవడం సాధ్యం కాదని... వైఎస్సార్ సీపీ విప్ జారీ చేసే అవకాశంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంపై వైఎస్సార్ సీపీ నేతలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఏకతాటిపై నిలిచి తమపార్టీ సభ్యులతో సమావేశమై పార్టీ గీత దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు.
 
12 మున్సిపాలిటీల్లోనూ తమ ఆధిక్యత చాటేందుకు ఆరెండు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు పన్నుతున్నాయి. ఏదిఏమైనా జెడ్పీపీఠంపై టీడీపీ పన్నుతోన్న కుట్ర, కుయుక్తి రాజకీయాలపై జిల్లాలోని బీసీసంఘాల నేతలంతా గుర్రుగా ఉన్నారు. తమ సామాజికవర్గానికి తీరని అన్యాయం చేసేందుకే తెలుగు తమ్ముళ్లు ప్రయత్నిస్తున్నారని ఆపార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు