11 మంది పోలీసులకు జీవిత ఖైదు

23 Jul, 2020 02:50 IST|Sakshi

మధుర: రాజస్తాన్‌లోని డీగ్‌ ప్రాంతంలో భరత్‌పూర్‌ రాజవంశానికి చెందిన రాజామాన్‌ సింగ్, అతని ఇద్దరు అనుచరులను 35 ఏళ్ళక్రితం హతమార్చిన 11 మంది మాజీ పోలీసు అధికారులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మధుర జిల్లా జడ్జి సాధనారాణి ఠాకూర్‌ తీర్పునిచ్చారు. శిక్ష పడిన వారిలో డీగ్‌ డీఎస్‌పీ కాన్‌సింగ్‌(82), స్థానిక పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జ్, ఎస్‌ఐ వీరేంద్ర సింగ్‌ (78) ఉన్నారు. వీరేంద్ర సింగ్‌ నాయకత్వంలోని పోలీసు బృందం ఫిబ్రవరి 21, 1985న రాజామాన్‌ సింగ్, అతని ఇద్దరు అనుచరులు సుమేర్‌ సింగ్, హరిసింగ్‌లను హతమార్చారు.

ఇతర పోలీసు అధికారులైన ఏఎస్‌ఐ రవిశంకర్, కానిస్టేబుల్స్‌ సుక్‌రామ్, జీవన్‌రామ్, జగ్మోహన్, భన్వర్‌సింగ్, హరిసింగ్, ఛత్తార్‌ సింగ్, షేర్‌ సింగ్, దయారాం, రవిశేఖర్‌లకు ఈ కేసులో యావజ్జీవ శిక్ష పడింది. వీరంతా 70 ఏళ్ళు పైబడిన వృద్ధులే. ఆనాటి రాజస్థాన్‌ ముఖ్యమంత్రి శివచరణ్‌ మాథుర్‌ ఎన్నికల ప్రచారం కోసం వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజామాన్‌ సింగ్‌ ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ వైపు జీపులో దూసుకెళ్లాడు. ఈ ఎన్నికల ఘటన జరిగిన మరునాడే రాజామాన్‌ సింగ్, అతని అనుచరులను పోలీసులు డీగ్‌ వ్యవసాయ మార్కెట్‌ వద్ద ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు.

మరిన్ని వార్తలు