500 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ప్రారంభం

1 Jun, 2020 09:30 IST|Sakshi

150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

రాణిస్తున్న బ్యాంకింగ్‌ రంగ షేర్లు 

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు

కలిసొచ్చిన లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపు

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ సోమవారం భారీ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 500 పాయింట్ల లాభంతో 32921 వద్ద, నిఫ్టీ 200 పాయింట్లు పెరిగి 9780 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను మన మార్కెట్‌ అందిపుచ్చుకుంది. కరోనా కట్టడికి విధించి లాక్‌డౌన్‌ను కేంద్రం విడతల వారీగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. 

ఒక్క ఫార్మా తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 4శాతం పెరిగి 20వేల పెన 20049 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

శుక్రవారం మార్కెట్‌ ముగింపు అనంతరం 2019-20 ఆర్థిక సంవత్సరపు జీడీపీ గణాంకాలు విడుదలయ్యాయి. గణాంకాలు 4.2శాతంగా నమోదై 11 ఏళ్ల కనిష్టాన్ని తాకడంతో భారత ఆర్థిక వృద్ధి 17 ఏళ్ల స్థాయి 3.1 శాతానికి చేరుకుంది. కంటోన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ ఈ జూన్‌ 30వరకు పొడగిస్తున్నట్లు కేంద్రం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ తెలిపాయి. ఈ కారణాలు మార్కెట్‌పై ఒత్తిడికి కలిగించే అంశాలుగా ఉన్నాయి. నేడు మే నెలకు సంబంధించిన పీఎంఐ తయారీ రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. అలాగే సుమారు 12 కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు, నాలుగో తైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది.


నిప్టీ-50 ఇండెక్స్‌లో ఒక్క సిప్లా షేరు తప్ప మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇండస్‌ ఇండస్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఐఓసీ, ఐషర్‌ మోటర్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 4శాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి

మరిన్ని వార్తలు