రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

14 Sep, 2019 07:45 IST|Sakshi

జన్మనక్షత్రం తెలియదా? నో ప్రాబ్లమ్‌! మీ పుట్టినరోజు తెలుసా? మీ పుట్టిన తేదీని బట్టి ఈవారం (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు) మీ రాశి ఫలితాలు -డా‘‘ మైలవరపు శ్రీనివాసరావు జ్యోతిష్య పండితులు

మేషం(మార్చి 21 –ఏప్రిల్‌ 19)
చేస్తున్న ఉద్యోగంలో మీ నైపుణ్యాన్ని గమనించిన పై అధికారులు మీకు పదవిలో ఉన్నతిని కలిగించాలని ఏకగ్రీవంగా భావించే అవకాశముంది. ఇదే సందర్భంలో మీరు గ్రహించాల్సిందొకటే– ఒకరిని పక్షపాత దృష్టితో, వేరొకరిని మరొక దృష్టితో చూడకూడదని. కేతు గ్రహం 9లో ఉన్నందువల్ల చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభన ఏర్పడవచ్చు. అంతమాత్రాన నిరుత్సాహ పడనవసరం లేదు. ఎల్లకాలమూ అనుకూలతా ఉండదు– ప్రతికూలతా ఉండదని గ్రహించండి.

తల్లీ తండ్రీ ఉద్యోగాల్లో ఉండడం లేదా వ్యాపారం వృత్తీ అనే వాటిలో తీరిక లేకుండా గడుపుతూ ఉండడం– ఆ కారణంగా ఇంట్లో ఉన్న కాసేపూ విందూ వినోదం అనుకుంటూ గడిపేయడం కారణంగా పిల్లల్ని పట్టించుకునే అవకాశం ఉండకపోవచ్చు. దీనిక్కారణం శని 9వ ఇంట ఉండడమే. పట్టించుకో(లే)ని కారణంగా పిల్లలకి ప్రవర్తనల్లో మార్పులొచ్చే అవకాశముంది జాగ్రత్త! పాదు బాగా విస్తరించడంతోపాటు దానికి చీడాపీడా పట్టకుండా చూసుకోవాలి కదా! బోళాబోళీతనంతో ఎవరు పడితే వారికి హామీలనో వాగ్దానాలనో చేసేయడం అనేది– గొంతు పట్టుకునే సమస్యగా అయిపోతుంది ప్రస్తుత దశ కారణంగా. ఇప్పుడు ఎదుటివాడి ఆనందానికి హామీనిచ్చేద్దాం! వాడొచ్చినప్పుడు కదా! ఒకవేళ వస్తే ఏదో ఓ కారణం చెప్పి పంపించేద్దా–మనుకోకండి. మీరిచ్చిన హామీని బలమైన అండగా భావించి ఆర్థికంగా కొంత పెట్టుబడి పెట్టి మీ హామీని నమ్ముకున్న ఎవరో– మీరు కాదన్నప్పుడు– తీవ్రంగా దెబ్బతినచ్చు.

పైగా మిమ్మల్ని నిందించడం– దుష్ప్రచారం చేయడం వంటివి ఉండచ్చు. గురుగ్రహం అష్టం (8)లో ఉన్న కారణంగా కోపం ఆవేశం మాట నిలుపుకోలేనితనం ఎదుటివాడి మీద నెపాన్ని నెట్టివేసే మనస్తత్వం మీకు పెరిగిపోవచ్చు. తప్పుని తప్పుగా మృదువుగా ఒప్పేసుకోండి. చింత ఉండదు కూడా.

లౌకిక పరిహారం: పిల్లల్ని పట్టించుకోండి– విద్యలో, ప్రవృత్తిలో కూడా.
అలౌకిక పరిహారం: పితృపక్షాల కాలం కాబట్టి గతించిన తలిదండ్రుల పేరిట గోధుమల్ని దానం చేయండి.

వృషభం  (ఏప్రిల్‌ 20 –మే 20)
వాళ్లూ వీళ్లూ విదిల్చిన ఎంగిలి మెతుకుల్ని ఈవేళ ఆవేళ అని లేకుండా తిన్న ఓ కాకి ఆకాశంలో ఎగురుతూన్న హంసతో పోటీ పెట్టుకుంది భారతంలో. అలా పోటీ పెట్టుకోవడానిక్కారణం ఊళ్లో జనమంతా ఈ బొంతకాకి శరీర పరిమాణంలో మరింత పెద్దగా ఉండడమే. హంసతోపాటు ఎగరలేక మధ్యలోనే నేలన పడిపోయింది. ఎవరో మిమ్మల్ని ఉసిగొల్పి పొగిడి ఇతరులతో పోటీ పెట్టుకోవలసిందంటే ముందుకి ముందే మౌనంగా తిరస్కరించండి తప్ప పొగడ్తల్ని నిజమనుకోకండి.

శని 8వ ఇంట ఉన్న కారణంగా వివాదాన్ని భార్యాభర్తల మధ్యలో రేకెత్తిస్తాడు. నా ఆస్తి– నీ ఆస్తి, నా తలిదండ్రుల హోదా, నీ తలిదండ్రుల స్థాయి.. అని ఈ తీరుగా మాటలు రావడం ప్రారంభమైందంటే శని మెల్లగా నోరు రగిలేలా చేస్తున్నాడన్నమాటే. వివాదం రాగానే ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోతే మీ దంపతులు సుఖంగా ఉండగలుగుతారు. లేదా కొంతకాలంపాటు మనఃస్పర్ధలతో శాంతి లేకుండా ఉండాల్సి రావచ్చు. ఎందుకంత శ్రమ? తిండి దొరక్కపోవడాన్ని ఆకలిబాధ అంటారు. సగం ఆహారం లభిస్తే అర్ధాకలి. సరిపడినంత దొరికితే సంతృప్తికర భోజనం. ఎక్కువెక్కువ ఆహారం కనక లభ్యమైతే అది అతి అయిన భోజనంగా గుర్తింపబడుతుంది. ఈ అతి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి ముందుకి ముందే పరిమిత భోజనానికి సిద్ధపడి ఉండండి. వైద్యావసరం ఉండదు– రాదు.

దూరంగానూ– భారంగానూ ప్రయాణించవలసిన పరిస్థితేగనక వస్తే శరీరాగ్యోన్ని గమనించుకుని నిర్ద్వంద్వంగా తగినంత ఓపిక లేని పక్షంలో రా(లే)నని చెప్పండి తప్ప– ప్రయాణం రోజు నాటికి బాగుంటుందేమో, ఇప్పుడే చెప్పడం బాగుండదనుకోకండి. రాలేనని చె ప్పి అంతా బాగుంటే వె ళ్లడం వల్ల ప్రయోజన ముంటుందిగాని, వస్తారని మాటనిచ్చి ఎగగొడితే అది మీ వ్యక్తిత్వం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. రాలేనంటే ఏమనుకుంటారో అనుకోకండి. ఆది నిష్ఠురంగా ఉన్నదున్నట్టు చెప్పగలిగినందుకు ఆనందపడతారు కూడా. దిగులొద్దు.

లౌకిక పరిహారం: అతిభోజనం వద్దు. స్పష్టంగా మీ అభిప్రాయాన్ని ముందుకి ముందే చెప్పెయ్యండి.
అలౌకిక పరిహారం: స్వయంపాకాన్ని యథాశక్తి కొందరికి సమర్పించుకోండి ఈ మహాలయ పక్షంలో.

మిథునం (మే 21 – జూన్‌ 20)
చెయ్యి ఉందనే ఉద్దేశ్యంతో ఇష్టం వచ్చినట్లుగా విదలించడం, చేయి చేసుకోవడం, చూపుడు వేలితో బెదిరించడం... వంటివి చేస్తే ఎంత ముప్పు రాబోతుంది? అలాగే కాలుంది కదా అనే భావంతో తన్నడం కాలెత్తుతూ ఒంటికాలి మీద లేసు తంటే ఎంతటి ఉపద్రవం తలమీదికొస్తుంది? సరిగ్గా ఇలాగే నోరుంది కదా! అని ఇష్టం వచ్చిన వాగ్దానాలని పదిమందిలోగాని, ఏకాంతంలోగాని చేసిన పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశముంది! నోరు జారకండి! చేయదలిచిందేమైనా గనక ఉంటే చేసి చూపండి తప్ప నోటి ద్వారా దేనికీ హామీలు వద్దు. లోగడ ఒకప్పుడు పడ్డ ఇబ్బందిని గుర్తు తెచ్చుకోండి. రాహుగ్రహం ప్రస్తుతం జన్మ(1వ ఇల్లు)లో ఉన్న కారణంగా విదేశ ప్రయాణం కలగవచ్చు. అయితే విదేశీ ప్రయాణం వల్ల కొత్తగా వచ్చే లాభమెంతో బాగా లెక్కించుకోండి ఒకసారి. ఎంతకాలంపాటు ఇక్కడ మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టం వస్తుందో తిరిగి వచ్చాక మళ్లీ వాటిని గుడిలో పెట్టుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఆలోచించుకుని ముందడుగు వెయ్యండి. వెళ్లే అవకాశాలు తక్కువేమో. గురుగ్రహం 6వ ఇంట ఉన్న సందర్భంగా మీ మాట కొంత కఠినంగా మారవచ్చు. దానిక్కారణం ఏమీ చేయలేని తనం– కుటుంబ సభ్యులు సరిగా అదుపులో లేరని తెలిసి కూడా అనలేని తనం– ఆర్థికంగా అనవసరంగా వ్యయమౌతుందని హెచ్చరించినా కూడా కుటుంబ సభ్యులెవరూ విననితనం కారణంగా మీ మాట కఠినం కావచ్చు. అయినా ఏ మార్పునీ మీరు గమనించలేరు. మీ మాటకి విలువ ఉండకపోవచ్చు. అయితే ఒక్క మాట మాత్రం నిజం. తప్పు జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం సరికాదు. మన  అనుకున్న వాళ్లు తప్పు చేస్తుంటే వాళ్లు విన్నా వినకున్నా చెప్పడం మాత్రం చేసి తీరాల్సిందే! కేతుగ్రహం 7వ ఇంట ఉన్న కారణంగా విందు భోజనాలో వీధి భోజనాలో ఎక్కువై ఆరోగ్యం కొంత చెడే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి భోజనాన్ని మాత్రమే చెయ్యండి. అనారోగ్యం వస్తే వెనువెంటనే వైద్యుని దగ్గరకు పరిగెత్తెయ్యకండి. ఏ కారణంగా అనారోగ్యం వచ్చిందో గమనించుకుని పొట్టకి విశ్రాంతినియ్యండి. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఏమాత్రమూ లేవు కాబట్టి.

లౌకిక పరిహారం: హామీలనియ్యకండి. పొట్టకి కొంత తక్కువ ఆహారాన్ని మాత్రమే అందియ్యండి.
అలౌకిక పరిహారం: యోగ్యుడైన బ్రాహ్మణ కుటుంబానికి 6 నెలలకి సరిపడ గుడం (బెల్లం) దానం చెయ్యండి మహాలయ పక్ష ప్రారంభ సందర్భంగా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ప్రతి సంసారంలోనూ సోదరులతో అక్కచెల్లెళ్లతో అందరితోనూ కాకపోయినా ఏ ఒక్కరితోనో కొద్ది అభిప్రాయ భేదం కొంతకాలం ఉండచ్చు. మీ సోదరుల్లోగాని మీరే పెద్ద అయ్యున్నట్లయితే తమ్ముడు లేదా చెల్లెలింటికి వెళ్లి హృదయపూర్వకంగా పలకరించి ఆ సోదర సోదరీ బంధాన్ని చిగురించేలా చేసుకోండి. దీనిద్వారా ఎంత మార్పుంటుందో గమనించుకోండి! కుజుడూ బుధుడూ మాత్రమే సంపూర్ణ శుభులు కాని కారణంగా మీరు గాని కొద్ది ముందడుగు వేస్తే పరిస్థితులు చక్కబడతాయి. అదే కుజుడు మరొక అశుభగ్రహంతో చేరి ఉన్నట్లయితే ఈ సూచన చెప్పబడేదే కాదు.

మీ పై అధికారి ఆగ్రహంతోనో మూర్ఖంగానో తన మాటే నెగ్గాలనే పట్టుదలతోనో ఉండి మిమ్మల్ని భయపెట్టి తప్పు పని చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లనిపించవచ్చు. మౌనంగా ఉండి చక్కగా సెలవు పెట్టండి. జీతం నష్టపరుస్తానని బెదిరించినా బెదరకండి. రవి గురు శుక్ర శని కేతువులు మీకు అనుకూలురుగా ఉన్న కారణంగా ఏనుగు వెళ్తుంటే కుక్క మొరుగుళ్లలా బెదిరింపులూ సంజాయిషీ కాగితాలు ఉండవచ్చు. మరీ ముదిరినట్లయితే పై అధికారి ఏం చేయవలసిందంటుంటే మీరు చేయనన్నారో– చేయలేనన్నారో దానినంతా కాగితం మీద రాసి వారికే పంపండి. ఇక వ్యవహారం గప్‌చుప్‌ అయిపోతుంది. అనేక గ్రహాల బలం ఉన్న మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయ(లే)రు. ఎవరో ఆప్తులు ఓ సాక్ష్యం చెప్పే నిమిత్తం (నిజానికి మీరు ఆ ప్రదేశంలో అప్పుడున్నారు. సాక్ష్యం చెప్పవలసిన అంశం నిజమే. అసత్యం కాదు) న్యాయస్థానానికి రమ్మంటే నిర్ద్వంద్వంగా చెప్పండి ‘రా(లే)నని’. ఆ సందర్భంలో అక్కడే ఉన్నప్పుడెందుకు చెప్పవని మిమ్మల్ని నిలదీయబోతే లేదా పదిమందిలో నిలదీస్తే మీరు ఆ వ్యవహారంలో చిక్కుకుపోయేలా మాట్లాడకండి. మౌనంగా ఉండండి. జరగబోయే అశుభం కష్టం అంటూ ఏమీ ఉండ(బో)దుగాని మానసిక ప్రశాంతత కరవౌతుంది. ఈవేళ ఆ వేళ అనకుండా సమయ వ్యర్థత జరుగుతుంది కూడా. మీరే అధికారులయ్యుంటే సొంత బుద్ధితో ఉ ండండి తప్ప, మీ పై వాడి ఇష్టాన్ని పాటించి కీర్తి కిరీటాన్ని సొంతం చేసుకోవాలనే ఊహంతో మీ కింది వారి మీద జులుం చెలాయించకండి. ఆబోతులు రెండు దెబ్బలాడుకుంటుంటే ఆ మధ్యకి లేగదూడలు వెళ్లడం మంచిది కాదు.

లౌకిక పరిహారం: ధర్మబద్ధంగా ఉండండి. ఒత్తిడిని ఎవరి మీదా తేకండి. ఇబ్బంది పడకండి.
అలౌకిక పరిహారం: రాగి కలశం (చెంబు) నిండుగా ఆవు నేతిని నింపి పండితునికి సమర్పించుకోండి.

సింహం (జూలై 23 –ఆగస్ట్‌ 22)
అనుమానం పెనుభూతమనే సామెతకి సరిపోయేలా మీరు ప్రతి విషయంలోనూ సంశయ దృష్టితో ఉంటారు. ఏదో తెలియని అశుభం కలుగుతుందేమోననే మనో భయంతో ఉంటారు. అలాంటిదేమీ ప్రస్తుతం జరిగే అవకాశం ఏమాత్రమే లేదు. అయితే ఎవరి దగ్గర రుణాన్ని తీసుకున్నారో వారి నుండి కొంత అమర్యాదకర వ్యాఖ్యలు మీకు వినిపించవచ్చు. ప్రస్తుతం మీ ఆర్థిక స్థితి బాగానే ఉన్న కారణంగా రుణ వ్యవహారాన్ని ఏదో సర్దుబాటు ధోరణితోనూ వాద వివాదాల స్థాయికి రాకుండా ఉండేలాగానూ సమన్వయ దృష్టితో పరిష్కరింపడేలా ప్రయత్నం చేయండి. తప్పక అనుకూలత ఉండబోతుంది. వ్యాపార రంగంలో పై అధికారుల నుండి ఏవేవో ఒత్తిడులు రావచ్చు. వ్యాపార స్థలాన్ని మార్చాల్సిన లేదా ఎక్కువ మొత్తంలో జరిమానాని చెల్లించవలసిన పరిస్థితులు కనిపించవచ్చు. దిగులు పడకండి. అధికారులతో వాగ్వివాదాన్ని చేయకుండా మధ్యే మార్గాన్ని ఆశ్రయించండి. అప్పుడే పరిస్థితులు అనుకూలించవచ్చు. మీ వాదన ధర్మబద్ధమైనప్పటికీ అధికారుల వాదనని అంగీకరించడమే మంచిది. దాదాపు సంవత్సరం వెనక శస్త్ర చికిత్స గాని లేదా దానితో సమానమైన అనారోగ్యం గాని చేసి ఉండి ఉండచ్చు. తెలిసి తెలిసి మీరు ప్రస్తుతం ధన సంపాదన కోసం కీర్తికోసం ఎక్కువ శారీరక శ్రమని చేస్తున్నారు అనేక దూరభార ప్రయాణాలని లెక్కచేయకుండా. ఇది ఏమాత్రమూ సరికాదని గ్రహించండి. కుటుంబ సభ్యులందరికీ మీ శరీర శ్రమని వివరించి చెప్పినట్లయితే వారు వ్యయం చేస్తున్న తీరు తెన్నులో చక్కని మార్పు కనబడుతుంది. కుటుంబ వ్యవస్థా ఆర్థిక సంతృప్తీ ఉంటుంది. తేలికగానూ చౌకగానూ దగ్గరగా ఉన్న స్థలమో ఇల్లో రాబోతోందనుకుంటూ దృష్టిని అటువైపుకి పోనీయకండి. అదేవిధంగా ఉన్న ఆస్తిని కొద్ద ఎక్కువ మూల్యానికి అమ్మి ఇంతకంటే గొప్ప ఆస్తిని కొనాలని భావించకండి. బుధ శుక్ర రాహు గ్రహాలు అనుకూలురై ఉన్నా రవిగ్రహం మాత్రం అర్ధశుభునిగా ఉన్న కారణంగా ఊహించని ఖర్చు (శుభకార్యమే సుమా) వచ్చి పడే అవకాశం ఉంది. కొంత ధనపరంగా నిలవలో ఉండడం మంచిది తప్ప వట్టి చేతులతో ఉండడం సరికాదు.

లౌకిక పరిహారం: ఆరోగ్య విషయంలో శ్రద్ధతోపాటు, ఖర్చుని ఆచితూచి మరీ చేయాలి.
అలౌకిక పరిహారం: పితృపక్షం కాబట్టి నూతన వస్త్రాలని మీ దృష్టిలో ఉత్తమ వ్యక్తికి సమర్పించుకోండి.

కన్య (ఆగస్ట్‌ 23 –సెప్టెంబర్‌ 22)
మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత చికాకుతనం కనిపించవచ్చు. గతుకుల మార్గంలో Ðð ళ్లేప్పడు కుదుపులొస్తున్నాయని ఎలా అనుకోకూడదో అదేతీరుగా జీవనాధారమైన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న ఒడిదుడుకులొస్తే ఇంతవరకూ తిండి పెడుతున్న వాటిని చీత్కరించుకోవడం విడిచి వేద్దామనుకోవడం సరికాదు. దాదాపుగా రెండు మూడు రాశులవారికి ఈ తీరు అసంతృప్తి ధోరణే.
గురుగ్రహం 3వ ఇంట ఉన్న కారణంగా మొహమాటానికి పోయి సరికాని వానికి ఉద్యోగ నిమిత్తం మీ పలుకుబడిని ఉపయోగించి సిఫారసు చేయడమూ, మధ్యలో ఉంటూ ఒకరినుండి మరొకరికి రుణాన్ని ఇప్పించడం వంటి పనులు తప్పక బెడిసికొట్టే ప్రమాదముంది. జాగరూకత తప్పనిసరి.
అర్ధాష్టమ శని (4వ ఇంట శని ఉండడం) ఉన్న కారణంగా చేతిదాకా వచ్చిన అవకాశం కాస్త అలా చూస్తుండగా జారిపోవడం గాని, ఎదురు చూపుతోనే ఎక్కువకాలం గడుస్తూ ఉండడం కాని తేలికగా కావలసిన అయ్యే అవకాశమున్న పని కూడా జరిగి జరిగి దూరం వెళ్లిపోవడం గాని సంభవించవచ్చు. ముందకి ముందే ఇలా ప్రతిపనీ వాయిదా పడే పరిస్థితిలో ఉండబోతోందని మానసికంగా స్థిరపడ్డ పక్షంలో నిరాశ ఉండ(బో)దు. శని ఎప్పుడూ (శనిదశలో తప్ప) చెడు చేయగు గాని, తీవ్రంగా విసుగుదలనీ, అసహనాన్నీ కలుగ జేస్తాడు.
ఇదే తీరుగా కేతు గ్రహం 4వ ఇంట ఉన్న కారణంగా బుద్ధి నిలకడగా ఉండదు. క్షణానికి ఒక్కో ఆలోచన చేస్తూ ఏ నిర్ణయానికీ రా(లే)కపోవడం జరుగుతుంది. వృతద్తి ఉద్యోగ వ్యాపారాలని మార్చేయాలనే ఆలోచనగాని, వాటి స్థలాలని మార్చేద్దామనే ఊహగాని ఊరు మారే ఆలోచన గాని బలంగా కలగవచ్చు. ఏ మార్పునీ చేయలేకపోవడం వల్ల సత్ఫలితాలు లభిస్తాయి తప్ప మార్పు వల్ల ఏ కొత్త ప్రయోజనమూ సిద్థించకపోవచ్చు.

లౌకిక పరిహారం: స్థిరమైన ఆలోచన చెయ్యండి– నిర్ణయాలని మార్చద్దు.
అలౌకిక పరిహారం: ఒక పేద కుటుంబం చక్కగా ఒక నెలపాటైనా వాడుకోగలంత నువ్వుల నూనెని సమర్పించడం మంచిది మహాలయ పక్షాల సందర్భంగా.

తుల (సెప్టెంబర్‌ 23 –అక్టోబర్‌ 22)
పట్టిందల్లా బంగారమనే సామెతకి ఉదాహరణగా అన్నిటా విజయాలని సాధిస్తూ వెళ్తారు. గురువు తన 2వ ఇంట ఉన్న కారణంగా ఇంట్లో ఏవో శుభకార్యాలు జరిగే అవకాశముంది. నలుగురికీ సహాయపడుతూ పదిమందికి మెచ్చే మంచి పనుల్ని చేస్తారు కీర్తి ప్రతిష్ఠలని సాధిచగలుగుతారు. కీలక విషయాల్లో మీకు తీర్పు అనుకూలంగా తగినంత ధనం కూడా చేతికందుతుంది.
శనిగ్రహం తృతీయంలో (3వ ఇంట) ఉన్న కారణంగా విదేశీయాన ప్రయత్నాన్నైతే చేస్తారు. వెంటనే ఫలించకపోవచ్చు గాని వ్యతిరేకత మాత్రం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో పై స్థాయిని సంపాదించాలనే పట్టుదలతో కొత్త చదువులో చేరే అవకాశం ఉంది. చదువు పూర్తవుతుందని చెప్పలేకపోవచ్చు గాని ఉత్సాహం మాత్రం తగ్గదు.
ఎక్కడో దూరంగా చేస్తుండే ఉద్యోగాన్ని ఇంటినుండి గాని లేదా మీకు అనుకూలమైన స్థలం నుండి గాని చేసుకోవచ్చుననే తీరు అవకాశాలూ అనుమతులూ పైవారి నుండి లభించవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉండడమే కాక మానసికంగా దృఢంగా ఉంటారు కూడా.
గురుగ్రహం తృతీయంలో (3వ ఇంట) ఉన్న కారణంగా బంధుజనంతో జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ ఉండాల్సిందే. పనుల్లో బాగా శ్రమించవలసి రావచ్చు. అయితే పదింట ఏ రెండో మూడో అనుకూలించవు తప్ప దాదాపు అన్నీ మంచిరోజులే అవుతూ అనుకూలిస్తాయి. ఉత్సాహ అతిశయంతో విందులు వినోదాలు విహార యాత్రలు చేసే అవకాశముంది. దాంతో ఆర్థికంగా కొంత వ్యయం తప్పదు.
కళ్లకి గాని ఉదరానికి గాని సంబంధించిన తాత్కాలిక అనారోగ్యం వచ్చే అవకాశముంది. ఔషధ సేవతో నయమయ్యే అనారోగ్యమే తప్ప దీర్ఘకాలిక వ్యాధిగా మారే పరిస్థితే లేదు. వైద్యాలయంలో చేరి ఔషధాలని తీసుకోవలసిన అవసరం అస్సలు లేదు.

లౌకిక పరిహారం: ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. విజయగర్వంతో అహంకరించకండి.
అలౌకిక పరిహారం: ఒక ఆత్మీయునికి కట్టుకోవడానికి వీలైన విలువైన నూతన వస్త్రాలని బహూకరించండి పెద్దల పేరు మీదుగా.

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
గురుగ్రహం జన్మలో (1వ ఇంట) ఉన్న కారణంగా మీరు చేస్తున్నది వృత్తి అయినా వ్యాపారమైనా ఉద్యోగమే అయినా అనుక్షణం జాగ్రత్తగా ఉండాల్సిందే. చేయని తప్పుకి నింద పడవలసిన పరిస్థితి గోచరిస్తున్న కారణంగా ఎవరితోనూ వాగ్వివాదాలుగాని, పట్టుదలని  పట్టడం గాని, ద్వేషం, పగ తీర్చుకోవాలనే ప్రయత్నాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చేయడం ఏమాత్రమూ సరికాదు.
శనిగ్రహం రెండవ ఇంట ఉంటూ తన ఏలిన నాటి శని ప్రభావాన్ని చూపక తప్పని సందర్భం కారణంగా ఎంతో నమ్మకమైన వాళ్లు కూడా మీ విషయంలో అనుమాన ధోరణితో ప్రవర్తించవచ్చు. వెనకగా దొంగదెబ్బ తీసే అవకాశం ఆలోచన శత్రుపక్షానికి ఉండే కారణంగా ఆ విషయాన్నే మానసికంగా నిరంతరం ఆలోచిస్తూ అనవసర ఆలోచనాపరులుగా ఉంటూ నిద్రలేమికి గురౌతారు. మీకు కలిగే ఆటంకం అవమానం తొలగింపు... వంటిదేమీ ఉండకపోతున్నా ఎందుకో తెలియని దిగులుతో ఉండనే ఉంటారు.
రాహు గ్రహానికి 8వ ఇంట ఉన్న కారణంగా మీకు వెంటనే పై ఉండే అధికారి రెండు తీరుల మాటల్ని మాట్లాడుతూ మీ నిజాయితీ తనాన్ని అనుమానిస్తూ మీ గురించి మీ పై అధికారికి వ్యతిరేక దిశలో మీ గురించిన రాతల్ని రాసుండవచ్చు– మీకంటూ జరిగే ఇబ్బంది ఏదీ ఉండకపోవచ్చుగాని అనుక్షణం ఈ వ్యవహార భారమూ ఎదురు చూపులతో తీవ్ర అసహనంతో ఉంటారు.
కేతువు కూడా ద్వితీయంలో (2వ ఇంట) ఉండే కారణంగా పరుషంగా మాట్లాడిన సరైన మాటల వల్లే కష్టాలు చుట్టుముట్టే అవకాశముంది. పైగా అపకీర్తికి గురి ఔతారు కూడా. ఓ నోరూ! వీపుని రక్షించు! అనే సామెత ప్రకారం నోటిని అదుపు చేసుకోవలసిందే!
అది కూడా నలుగురిలో అవమానానికి దారితీసే విధంగా మీరు మాట్లాడే కాలమైన కారణంగా సాత్విక గుణంతో ఉండడాన్ని నేర్చుకోండి.

లౌకిక పరిహారం: దిగులు పడాల్సిన సంఘటనలేమీ లేవు. ఉత్సాహంగా ఉండండి.
అలౌకిక పరిహారం: ఒక కుటుంబానికి 3 నెలలపాటు వాడుకునేంత ఉప్పుని (సముద్రపు గళ్ల ఉప్పు) దానం చేయండి పెద్దల రోజుల సందర్భంగా.

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
వ్యవసాయదారులకి చాలా అనువుగా ఉంటుంది. పెద్దగా ఖర్చు లేకుండా, కూలీలు రావడం, వస్తు పరికరాలు సమకూరడం, రుణం అవసరం లేకుండానే పొలాన్ని మరమ్మతు చేసుకోగలగడమనే అన్నీ సిద్ధిస్తాయి ఆశ్చర్యకరంగా. ఎప్పుడూ లేనంత ధీమా కలుగుతుంది పంట దిగుబడి మీద. వాహనాలని సరైన తీరులో పనిచేసేలా చూసుకోండి. పూర్తిగా వాటిని వాడే సందర్భాల్లో – అంటే నిర్విరామంగా పనిచేయించే పరిస్థితుల్లో – మధ్యలో ఇబ్బంది పెట్టకుండా తగిన జాగ్రతలు తీసుకోండి. స్వల్ప అనారోగ్యం కన్పిస్తోంది కాబట్టి సకాలనిద్ర భోజనాలు అవసరం. గురుగ్రహం 1వ యింట (జన్మ)లో ఉన్న కారణంగా అన్నీ పైకి సక్రమంగా ఉన్నట్లనిపిస్తాయి గాని క్షేత్రంలోకి దిగాక (కార్యస్థలానికి వెళ్లాక) ఇబ్బందికి గురిచేసే అవకాశముంది. ఉద్యోగస్థులకైతే పని ఒత్తిడీ శారీరకశ్రమకి గురిచేసే దూరభార ప్రయాణాలతో పాటు అసౌకర్యమూ కూడ ఉండచ్చు. అయితే ఇంతటి క్లిష్టతరమైన పనిని సాధించుకొచ్చే కారణంగా ప్రతిభ తప్పక గుర్తింపబడుతుంది.
ప్రభుత్వోద్యోగులకంటె ప్రభుత్వేతర రంగ సంస్థలో పనిచేసేవారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగం. నిరుద్యోగులకి ఉద్యోగం వెదుక్కుంటూ వచ్చే సందర్భాలు గోచరిస్తున్నాయి. జీతం ఎంత? ఉద్యోగ ప్రదేశం ఎక్కడ? ఎంత దూరం? వంటి శషభిషలకి (అనవసర సంశయాలకి) పోకుండా కొద్ది వివేకంతో వచ్చిన ఉద్యోగంలో చేరిపోవడం ఎంతైనా మంచిది. దగ్గరి వారి ఆస్తులు కొద్ది అనుకూలంగా అమ్మకానికి వచ్చే కారణంగా కొనుక్కోవాలనే ఆలోచనకొస్తారు. వేరేచోట రుణాన్ని తెచ్చి ఇక్కడి వ్యవహారాన్ని పూర్తి చేసుకోవడం మంచిది తప్ప, ధనం లోటు ఉందని చెప్పి కొనుగోలుకి ఇబ్బంది తెచ్చుకోవడం, ధనం తక్కువగా ఉందనే మాటని అమ్మకందారులకి (బంధువైనా సరే) చెప్పడం సరికాదు.

లౌకిక పరిహారం: సకాలనిద్రాభోజనాలు మంచిది. మంచి పనికోసం రుణాన్ని చేయచ్చు.
అలౌకిక పరిహారం: గతించినట్లయితేనే ఆ తలిదండ్రుల పేరిట పురోహితునికి యధాశక్తి వెండి పానపాత్ర (గ్లాసు)ని దానమిచ్చుకోండి.

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
పశువులకి సంబంధించిన అలాగే పక్షులకి సంబంధించిన లేదా ఇతర జీవాలకి (చేపలూ వంటివి) సంబంధించిన వ్యాపారం చేసేవాళ్లు ముఖ్యమైన జాగ్రతలని తీసుకోవడం అవసరం. తమవద్ద పనిచేసే వ్యక్తుల అశ్రద్ధవల్లగాని, వాతావరణ వైపరీత్యాల కారణంగా గాని, లేదా ఆ ప్రాణుల అనారోగ్య కారణంగా గాని పెద్దగా కలిసిరాకపోవడం, పశునష్టం వంటివి జరగచ్చు. తగిన జాగ్రతలతో ఉన్న పక్షంలో ఇబ్బంది ఉండదు. గురు గ్రహం కారణంగా ఈ పరిస్థితి రావచ్చు. శని వ్యయంలో ఉన్న కారణంగా ఏలిననాటి శనిదోషం నడుస్తోంది.
ఈ కారణంగా వ్యాపారం ఉద్యోగం వృత్తీ కూడ లాభసాటిగానే ఉంటాయి గాని ఆ ఒత్తిడి కారణంగా సకాలభోజనం – సరైన భోజనం దొరక్కపోవచ్చు. పరుగెత్తి పాలు తాగడంలా అన్పిస్తుంది ఒక్కో సందర్భంలో. ఏమైనా అనారోగ్యం రాకుండా ముందుకి ముందే సకాల ఆహారనియమాన్ని పాటించడం ఎంతైనా మంచిది. ఒక సందర్భంలో పని ఒత్తిడి మానసిక శ్రమా కారణంగా మీ ఆప్తులకో బంధువులకో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయే పరిస్థితి ఉంది. శని దోషం కారణఃగా వాళ్లు ఒక మాటని అంటే తప్పుని అంగీకరించి మనశ్శాంతికరంగా ఉండండి తప్ప, అలా వాగ్దానాన్ని నిలుపుకోలేకపోవడానికి గల కారణాలని వాళ్లకి చెప్పి వాళ్లని సంతృప్తిపరచాలనే ప్రయత్నాన్ని చేయకండి.
వాళ్లు సంతృప్తిపడరు– మీ పరిస్థితిని అర్ధం చేసుకో(లే)రు గనుక. నూరు సహాయాలని చేసిన 101వది చేయలేనని చెప్తే ఈ చేసిన సహాయాలన్నింటినీ మర్చిపోయే లక్షణమున్న కలియుగంలో సహాయపడదలిస్తే – ముఖ్యంగా ఏలిననాటి శని పరిపాలిస్తున్న ప్రస్తుతపు మీ దశలో – అది సాధ్యం కాదనే వ్యతిరేక భావంతోనే ఉండండి. తప్పనిసరిగా సహాయపడదలిచిన వ్యక్తులకి ఈ మాటని ముందుగా చెప్పి మరీ సహాయానికి దిగండి.

లౌకిక పరిహారం: శనిదోషకారణంగా మాట పడాల్సి రావచ్చు. వివాదం వద్దు. మౌనంగా భరించండి.
అలౌకిక పరిహారం: పితృపక్షాలు గనక ఒక పురోహిత కుటుంబానికి వారం రోజులకి సరిపడిన కూరగాయలని సమర్పించుకోండి.

కుంభం  (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ప్రయాణాల్లో వస్తువుల పట్ల జాగ్రత వహించండి. అనుకోకుండా రావలసిన బాకీలన్నీ వసూలు అవుతూండే కారణంగా ఏ విధమైన ఆర్థికపు లోటూ ఉండదు. ధనాదాయం బాగున్నదనే ఉద్దేశ్యంతో వస్తు వస్త్ర కాంచన వాహనాలని కొనే అవకాశముంది. ఈ తీరుగా ధనాన్ని దాచుకోవడం కూడ మంచిదే కాబట్టి వెనుకాడకండి. అయితే ఓ ప్రణాళిక ప్రకారమే కొనుగోళ్లు చేసుకోండి. కాలం అనుకూలం. రాహువు పంచమం (5వ ఇంట)లో ఉన్న కారణంగా మీరు ఊహించినంత గౌరవాన్ని మీ వ్యాపార స్థలంలో సంఘంలో పొంద(లే)కపోవచ్చు తాత్కాలికంగా. అంత మాత్రాన ఏదో కోల్పోయినట్లుగా భావించకండి. కాలం తిరుగుతూండే కారణంగా అప్పుడప్పుడు ఇలాటివి జరుగుతూ ఉండచ్చు.
అప్పటి గౌరవాధిక్యానికీ ఇప్పుడొచ్చిన అల్పగౌరవానికీ రెంటికీ ప్రత్యేక కారణమంటూ ఏమీ ఉండదు. కేవలం రాహుగ్రహపరిపాలనం మాత్రమే. సంతానానికి ఒక వయసంటూ వచ్చాక వాళ్లకి వాళ్లు కొన్ని నిర్ణయాలని కుటుంబంలో చేస్తూ ఉండచ్చు.
వాళ్ల బాల్యంలో ఎలా గద్దించి మీ మాటనే అమలు చేసేవారో ఆ పద్ధతి ప్రస్తుతం సరికాదు. రాహువు పై తీరుగానే పంచమం (5వ ఇంటి)లో ఉన్న కారణంగా సంతానంతో అకాల నిష్కారణ వాదనలని తెచ్చిపెడతాడు. ఆ గొడవల మధ్యలోకి సంబంధం లేని వ్యక్తులకి ప్రవేశాన్ని కల్పించి మానసిక అశాంతికి అవకాశం వచ్చేలా చేస్తాడు.
కాబట్టి వాళ్లని స్వేచ్ఛగా విడవడమే మంచిది కొంతకాలం పాటు. శనికేతువులు శుభదృష్టితో ఉన్న కారణంగా తీర్థయాత్రలనీ పుణ్యనదీ స్నానాలనీ చేయాలనే ఆలోచనలు కలుగుతాయి. ప్రతి విషయంలోనూ వచ్చే అనుమానాలూ మానసిక భయాలూ ఈ తీర్థయాత్రాగమనం ద్వారా తొలుగుతాయి.

లౌకిక పరిహారం: సంతానంతో వివాదపడకండి. ఎక్కడైనా గౌరవం తక్కువ అనిపిస్తే నిరుత్సాహపడకండి.
అలౌకిక పరిహారం: తీర్థయాత్రలకి వెళ్లే ఉత్తమపురోహితునికి ఆ ప్రయాణపు ఖర్చులని భరించండి.

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
కుజ బుధ శక్రగ్రహాలు అర్ధశుభదృష్టితో ఉన్న కారణంగా చదువుకుంటున్న మీ సంతానం తీవ్రంగా శ్రమిస్తున్నా – రాత్రింబవళ్లు చదువులోనే సతమతమౌతున్నా అనుకున్నంత ఫలితాన్ని పొంద(లే)కపోవచ్చు. వాళ్ల బుద్ధిబలం చాలా గొప్పది. అందులో అనుమానం లేదు. కాబట్టి ఇప్పుడు ఫలితం రానంతమాత్రాన వాళ్లని తీవ్రంగా మందలించి వాళ్ల మనసుని గాయపరచకండి. ప్రోత్సహిస్తూ ఓదార్చండి తగినరీతిలో. వ్యాపారంలో కిందటి నెలవచ్చిన లాభాలతో ఈ మాసపు లాభాన్ని పోల్చుకోకండి. రాహువు 4వ ఇంట ఉన్న కారణంగా మనసుని అదుపులో ఉంచుకోవాలి. కల్గిన పరాజయాలనీ, జరిగిన నష్టాలనీ లెక్కించుకుంటూ కూచోడం కర్తవ్యం కాదు – అంతేకాక మనోధైర్యం వచ్చే ఔషధం ఇది కానే కాదు కూడ. కుటుంబసభ్యులంతా ఐకమత్యంభావంతో ఉండే కారణంగా చెప్పలేనంత ఆనందంగా గడుపుతారు. మీ దంపతిలో కూడ ఉత్సాహం వెల్లివిరుస్తుంది. కేతువు 10వ ఇంట ఉన్న కారణంగా ఏ పనిని చేపట్టినా విజయవంతంగా ముగుస్తుందనే ధైర్యం వస్తుంది. ఆ ఉత్సాహం వల్ల మరింత ప్రయత్నాన్ని సునాయసంగా చేయగలగుతారు కూడ.
మీ పనిని మీరే చేసుకోవడం వల్ల విజయాలు సొంతమవుతాయి గాని భరోసాతో ఇతరుల మీద పెట్టినా లేక ఇతరులకే అప్పగించినా మీరనుకున్నంత విజయం రావడం అసాధ్యం. మళ్లీ అది మానసిక వ్యధకి కారణాన్ని కల్గించేదిగా కూడ అవుతుంది. పుట్టిన రోజు వేడుకలో పెళ్లిరోజు పండగలో వంటి అప్రధాన (ఈ రోజుల్లో ఇవి మరింత ప్రధానం) ఉత్సవాలకి వెళ్లాల్సిన తప్పనిపరిస్థితులుండచ్చు, వెళ్లిరండి. లేని పక్షంలో పిసినారి – బంధువుతో పరిచయాన్ని కలిగి ఉండని వ్యక్తి – స్వార్థపరుడు.. వంటి మాటలు రావచ్చు. నిష్కారణ వ్యయమైనా వెళ్లి రావడం వల్ల ఆనందం మనశ్శాంతీ ఉంటాయి మీకు.
లౌకిక పరిహారం: పిల్లలని నిరుత్సాహపరచకండి. వాళ్లు బుద్ధిమంతులే, ప్రోత్సాహపరచండి.
అలౌకిక పరిహారం: ఈ మహాలయ పక్షంలో ఒక పేద కుటుంబానికి నెలకి సరిపడిన చక్కని తినదగిన బియ్యాన్ని సమర్పించుకోండి.

మరిన్ని వార్తలు