దండకారణ్యంలో యుద్ధ మేఘాలు

9 Mar, 2019 10:36 IST|Sakshi
దండకారణ్యంలో కూంబింగ్‌ సాగిస్తున్న పోలీసు బలగాలు (ఫైల్‌)  

సాక్షి, చర్ల: తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోగల దండకారణ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మూడు రోజుల నుంచి సరిహద్దుల్లోకి ప్రత్యేక పోలీసు బలగాలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నాయి. మావోయిస్టుల కోసం అణువణువునా గాలిస్తున్నాయి. మహిళాదినోత్సవాన్ని ఘనంగా జరపాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే, సరిహద్దు గ్రామాల్లో ఆ పార్టీ మహిళాప్రతినిధులు ప్రచారం నిర్వహించారన్న సమాచారంతో పోలీసు బలగాలు వచ్చాయి. మహిళాదినోత్సవ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు, సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే, మూడు రోజుల నుంచి సీఆర్‌పీఎఫ్, స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ పోలీసు బలగాలు దండకారణ్యంలోకి చేరుకుంటున్నాయి. దండకారణ్యానికి దగ్గరలోగల భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, తూర్పుగోదావరి, బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల సరిహద్దుల్లో ఈ బలగాలు కూంబింగ్‌ సాగిస్తున్నాయి. దీంతో, ఆయా ప్రాంతాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఇటు ప్రత్యేక పోలీసు బలగాలు, అటు మావోయిస్టుల మధ్యన ఆదివాసీలు నలుగుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని వారు తీవ్ర భయాందోళనతో ఉన్నారు.

మావోయిస్టుల కదలికలపై పోలీసు బలగాలు గట్టి నిఘా వేశాయని, ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారం ఆధారంగా దండకారణ్యం వైపు కదులుతున్నాయని తెలిసింది. తెలంగాణ నుంచి సరిహద్దుకు చేరుకున్న పోలీసు బలగాలు, ఛత్తీస్‌గఢ్‌ పోలీసు బలగాలతో సమన్వయపర్చుకుంటూ ముందుకు సాగుతున్నట్టు సమాచారం. బలగాల కూంబింగ్‌ మరో వారం రోజులపాటు నిరంతరాయంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు