సార్లే.. సారథులు..

6 Feb, 2018 19:23 IST|Sakshi

ఉపాధ్యాయ సంఘాల కీలక పదవుల్లో జిల్లా టీచర్లు  

రాష్ట్రస్థాయిలో భద్రాద్రి కొత్తగూడేనికి గుర్తింపు

సుజాతనగర్‌ : సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం గురువులది.. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసేది వారి భాషణాలే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు సర్కార్‌ బడుల పరిరక్షణలోనూ మేము సైతం అంటున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయా సంఘాల్లో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వ పటిమను నలుదిశలా చాటిచెబుతున్నారు.

రాందాస్, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి
ఇల్లెందు మండలం చెన్నంగులగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బానోత్‌ రాందాస్‌ టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో రాందాస్‌ వీఆర్‌పురం, బయ్యారం, సింగరేణి, మండలాల్లో పనిచేశారు. 2016లో మహబూబ్‌నగర్‌లో జరిగిన టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ‘‘ఇదివరకు ఉన్న అప్రెంటిస్‌ వ్యవస్థ రద్దు కోసం సుమారు 16 సంవత్సరాల పాటు మా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం. ఆ వ్యవస్థను రద్దు చేయించగలిగాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు అన్‌ట్రెయిన్డ్‌ ఉపాధ్యాయుల రెగ్యులర్‌ కోసం పోరాడి సాధించాం. సీపీఎస్‌ రద్దు కోసం గత ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్‌ ముందు 15 వేల మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించాం. విజయం సాధించే వరకూ పోరాడుతూనే ఉంటాం.’’ అని రాందాస్‌ అన్నారు.

లక్ష్మణ్‌నాయక్, టీఎస్‌టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు  
టేకులపల్లి మండలానికి చెందిన ఇస్లావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ తెలంగాణ స్టేట్‌ ట్రైబల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(గతంలో ఈ యూనియన్‌ టీటీటీఎఫ్‌గా ఉండేది) రాష్ట్ర అధ్యక్షుడిగా 2013 నుంచి కొనసాగుతున్నారు. ‘‘ఏజెన్సీ పాఠశాలల్లో జీఓ నెం 3  ప్రకారం నూరు శాతం ఉద్యోగాలు గిరిజన ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలని పోరాడాం. సాధించాం. పీఆర్సీలో రావాల్సిన ఏహెచ్‌ఆర్‌ఏ అలవెన్సులు వచ్చేలా ఉద్యమించాం. ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలలోకి వెళ్లడానికి సహకరించాం. ముంపు ఉపాధ్యాయులను మన జిల్లాకు వచ్చేందుకు పోరాటం చేశాం. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు 342జీఓ ద్వారా ఉన్నత విద్య(ఎంఈడీ లేదా పీజీ) అవకాశం కల్పించాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ (ఓపీఎస్‌) స్కీంనే కొనసాగించాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం.’’ అని లక్ష్మణ్‌ నాయక్‌ అన్నారు.

సీహెచ్‌ రవి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాల్వంచకు చెందిన చావా రవి ఖమ్మంలోని నయాబజార్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014 జూన్‌ 2 నుంచి టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్టంలో 2006 నుంచి ‘ఐక్య ఉపాధ్యాయ’అనే మాస పత్రికకు ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. 1997 నుంచి 2006 ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్‌ అన్‌ట్రెయిన్డ్‌ ఉపాధ్యాయులను స్పెషల్‌ విద్యావలంటీర్లుగా గుర్తించి వారికి అన్ని వసతులు కల్పించడానికి పోరాటం చేసి విజయం సాధించాం. సీపీఎస్‌ వ్యతిరేక ఉద్యమంలో మా సంఘం కీలక భూమిక పోషిస్తోంది. నాణ్యమైన విద్యాభోదన అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.’’ అని రవి పేర్కొన్నారు.   

కేఎస్‌సీ చౌదరి, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు
కొత్తగూడేనికి చెందిన కె.సురేష్‌ చంద్ర చౌదరి పాత కొత్తగూడెంలోని తెలంగాణ ప్రభుత్వ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ‘‘గిరిజన ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ల విషయంలో పోరాటం చేసి సాధించాం. గతంలో ఉన్న హెచ్‌ఆర్‌ఏను 14.5 శాతానికి పెంచడానికి సుదీర్ఘంగా ఉద్యమించాం. మహిళా ఉపాధ్యాయులకు 5 అదనపు క్యాజువల్‌ లీవులకోసం పోరాడి సాధించుకున్నాం’’ అని చౌదరి అన్నారు.

జయబాబు, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు
భద్రాచలం పట్టణానికి చెందిన కల్లూరి జయబాబు చర్ల మండలంలోని లెనిన్‌ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదివాసీ టీచర్స్‌ అసోసియేషన్‌(ఏటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సంఘానికి ఆయన 2012 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ‘‘ఏజెన్సీలో ఏరియాలో నూరు శాతం ఉద్యోగాలు, పదోన్నతులు జీఓ నెం 03 ప్రకారం భర్తీ చేయాలని నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి పంపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. 2015 పీఆర్సీలో ఏజెన్సీ ప్రాంతంలో ఏహెచ్‌ఆర్‌ఏ జీఓ అమలు కోసం ఉద్యమించి విజయం సాధించాం.’’ అని జయబాబు వివరించారు.  

పూర్ణచందర్‌రావు, టీపీటీఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి  
ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సాధినేని పూర్ణచందర్‌రావు తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1983 నుంచి పూర్ణచందర్‌రావు టీపీటీఎఫ్‌లో కొనసాగుతున్నారు. గతంలో ఏపీటీఫ్‌గా ఉన్నప్పుడు 1983 నుంచి 2007 దాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ‘‘ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1974 నుంచి 1986 దాకా స  ర్వీస్‌ రెగ్యులైజేషన్‌ లేదు. ఆ సమస్యను ఐటీడీఏ పీఓ దృష్టి్టకి తీసుకెళ్లి రెగ్యులైజేషన్‌ సాధించాం.’’ అని పూర్ణచందర్‌రావు చెప్పారు.

మరిన్ని వార్తలు