అందని బంధు

6 Feb, 2018 18:48 IST|Sakshi

రైతుబంధు పథకం అమలులో అలసత్వం

క్షేత్రస్థాయిలో అవగాహన కరువు

తక్షణ అవసరాల రుణసాయం అరకొరే

తక్కువ ధరలకే పంటల అమ్మకాలు

బూర్గంపాడు :  పంటలకు గిట్టుబాటు ధర లభించనప్పుడు రైతుల తక్షణ అవసరాల కోసం మార్కెటింగ్‌ శాఖ రైతుబంధు పథకాన్ని అమలుచేస్తోంది. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ కమిటీ గోదాముల్లో నిల్వ చేసుకుంటే రైతుబంధు పథకానికి అర్హులవుతారు. ఇలా నిల్వచేసిన పంటల కనీస మద్దతు ధరలో 75 శాతం మేర రైతులకు మార్కెటింగ్‌ శాఖ వడ్డీ లేకుండా రుణం అందజేయడమే రైతుబంధు పథకం ఉద్దేశం. ఇలా ఒక్కో రైతు గరిష్టంగా రూ. 2 లక్షల వరకు రుణం పొందవచ్చు. పంటలను అమ్ముకున్నప్పుడు రుణం చెల్లించాల్సి ఉంటుంది. ఈ  పథకంలో రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల వరకు వడ్డీ ఉండదు. ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు 12 శాతం వడ్డీ వసూలు చేస్తారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేనప్పుడు రైతులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. మంచి ధరలు వచ్చేవరకు తమ అవసరాలకు తగిన రుణసాయం ఈ పథకంలో అందుతుంది. అయితే ఈ పథకంపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో మార్కెటింగ్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  

ఆరు మార్కెట్‌ కమిటీలు...
జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, ఇల్లెందు, భద్రాచలం, దమ్మపేట, చర్లలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ పంటలు నిల్వ చేసుకునేందుకు గోదాములున్నాయి. ధాన్యం, అపరాలు నిల్వచేసుకున్న వారికి రైతుబంధు పథకం వర్తిస్తుంది. అయితే మార్కెటింగ్‌ అధికారులు రైతులకు అవగాహన కల్పించడకపోవడంతో తక్షణ అవసరాలకు తక్కువ ధరలకే పంటలు అమ్ముకుంటున్నారు.  

జిల్లాలో నలుగురు రైతులకే వర్తింపు...
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు రైతుబంధు పథకాన్ని నలుగురు రైతులకే వర్తింపజేశారు. బూర్గంపాడు మార్కెట్‌లో ఇద్దరు, కొత్తగూడెంలో ఇద్దరు రైతులు వడ్డీలేని రుణం పొందారు. గత వ్యవసాయ సీజన్‌లో కూడా జిల్లాలో 40 మంది రైతులకు మాత్రమే ఈ పథకం అమలైంది. దీనిపై సరైన ప్రచారం లేకపోవడం వల్లే ఎక్కువ మంది ఉపయోగించుకోవడం లేదని, మార్కెట్‌ అధికారులు కరపత్రాలను పంపిణీ చేసి చేతులు దులుపుకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించి రైతులకు వివరిస్తే ఎంతోమంది వినియోగించుకునే అవకాశాలున్నాయని అంటున్నాయి. ఈ ఏడాది అపరాలకు సరైన గిట్టుబాటు ధర లేకున్నా రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరలకే అపరాలను అమ్ముకుంటున్నారు. ఈ పథకం గురించి  తెలిస్తే అపరాలు నిల్వచేసుకుని రుణం తీసుకునేవారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
రైతుబంధు పథకంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మార్కెట్‌ గోదాముల్లో పంటలను నిల్వచేసుకునే రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నాం. చాలామంది రైతులు  పంటలు నిల్వ చేసుకునేందుకు ముందుకు రావటం లేదు. ఇక నుంచి గ్రామస్థాయిలో కూడా ఈ పథకంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం.
– నరేందర్, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

మరిన్ని వార్తలు