‘మిషన్‌’ స్లో

2 Feb, 2018 18:17 IST|Sakshi
కొనసాగుతున్న పంపింగ్‌ మోటార్‌ పనులు

గడువు ముగిసినా పూర్తికాని

భగీరథ ఇన్‌టేక్‌వెల్‌ పనులు

ఫిబ్రవరి వచ్చినా

చేపట్టని ట్రయల్‌రన్‌

వాటర్‌ ట్యాంక్‌లు, పైపులైన్ల నిర్మాణాల్లో జాప్యం 

అశ్వాపురం : ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా చేపడుతున్న మిషన్‌ భగీరథ పనులు అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ నిర్లక్ష్యంతో ఆలస్యమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి  నియోజకవర్గాల పరిధిలో గల 23 మండలాల్లోని 1826 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2250 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం పనులు చేపడుతున్నారు. అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఇన్‌టేక్‌ వెల్, అప్రోచ్‌బ్రిడ్జి, ఫిల్టర్‌బెడ్, మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40 ఎంఎల్‌డీ  వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, సంప్, 900 కేఎల్, 3900 కేఎల్‌ సామర్థ్యం గల రిజర్వాయర్లు, పైప్‌లైన్‌ పనులు చేస్తున్నారు. కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్, అప్రోచ్‌బ్రిడ్జి, ఫిల్టర్‌బెడ్, రథంగుట్ట వరకు పైప్‌లైన్‌ పనులు డిసెంబర్‌ 31 నాటికి పూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. కానీ జనవరి దాటినా ఇన్‌టేక్‌వెల్‌ పనులు పూర్తికాలేదు. ఇందులో 6 టర్బైన్‌లకు పంపింగ్‌ మోటార్లు, ప్యానల్‌బోర్డులు, ఎలక్ట్రానిక్‌ పనులు, అప్రోచ్‌ బ్రిడ్జి మీదుగా మిట్టగూడెం రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్‌ పనుల్లో జాప్యం జరుగుతోంది.

 రబీకి నీటి విడుదలతో... 
రబీ సీజన్‌ ప్రారంభం అవుతుండటంతో పాములపల్లి లిఫ్ట్‌ ద్వారా గోదావరి నీరు పొలాలకు వదులుతుండటంతో రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్‌ పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో జరుగుతున్న అంతర్గత పైపులైన్లు, వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. 752 వాటర్‌ట్యాంక్‌లకు ఇప్పటి వరకు సగం కూడా పూర్తి కాలేదు. ఈ పనులకు మార్చి వరకు గడువు ఉందని, ఆ లోపు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు.  

ట్రయల్‌ రన్‌కు సిద్ధం కాని పనులు.. 
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రాధాన్యమైన దుమ్ముగూడెం ఇన్‌టేక్‌వెల్‌ పనులపై ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా  ఇప్పటికే పనులను పలుమార్లు మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పర్యవేక్షించారు. అయినా పనుల్లో పురోగతి లేదు. కుమ్మరిగూడెం, మిట్టగూడెం రథంగుట్ట వద్ద జరుగుతున్న పనులను జనవరి 6న పరిశీలించిన వేముల ప్రశాంత్‌రెడ్డి, స్మితా సబర్వాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాప్యంపై అధికారులను మందలించారు.

అంతేకాక అధికారులు, నిర్మాణ సంస్థతో  మిట్టగూడెంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జనవరి నెలాఖరు నాటికి ఇన్‌టేక్‌వెల్‌ పనులు పూర్తి చేయాలని, టర్బైన్లకు మోటార్లు బిగించాలని, అప్రోచ్‌ బ్రిడ్జి నుంచి రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్‌ పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్‌కు సిద్ధం చేయాలని  ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని, కాంట్రాక్ట్‌ సంస్థను బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. జనవరి 25 వరకు ఇన్‌టేక్‌ వెల్‌ పనులు పూర్తి చేస్తామని అధికారులు, నిర్మాణ సంస్థ చెప్పాయి. కానీ 25 రోజులు గడిచినా పనుల్లో ఏ మాత్రం  పురోగతి లేదు. ట్రయల్‌రన్‌కు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది.

 అత్యంత ప్రాధాన్యంగా మిట్టగూడెం రథంగుట్ట 
కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్, రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, రెండు రిజర్వాయర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ఇన్‌టేక్‌ వెల్‌ పూర్తయితే ఇక్కడి నుంచి రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్‌ ద్వారా గోదావరి నీటిని 900 కేఎల్, 3900 కేఎల్‌ సామర్థ్యం గల రిజర్వాయర్లకు పంపిస్తారు. తద్వారా పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని 1826 గ్రామాలకు, మణుగూరు, పాల్వంచ , కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తాగునీరు అందించనున్నారు. 900 కేఎల్‌ రిజర్వాయర్‌ ద్వారా పినపాక నియోజకవర్గానికి, 3900 కేఎల్‌ రిజర్వాయర్‌ ద్వారా మిగిలిన నియోజకవర్గాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయనున్నారు.  దుమ్ముగూడెం, చర్ల మండలాలకు తాగునీరు అందించేందుకు పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్‌డీ, వాజేడు, వెంకటాపురం మండలాలకు తాగునీరు అందించేందుకు పూసూరు వద్ద 9 ఎంఎల్‌డీ వాటర్‌ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు నిర్మిస్తున్నారు.  

ఫిబ్రవరి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం 
పనులు వేగవంతం చేసి ఫిబ్రవరి నెలాఖరుకు మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేస్తాం.  ఇన్‌టేక్‌వెల్‌లో టర్బైన్లకు పంపింగ్, మోటార్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 10 నాటికి ఇన్‌టేక్‌వెల్‌లో మోటర్లు, ప్యానల్‌బోర్డులు అమర్చే ప్రక్రియ పూర్తి చేస్తాం. అప్రోచ్‌బ్రిడ్జి, ఫిల్టర్‌బెడ్, రథంగుట్ట వరకు ప్రధాన పైపులైన్‌ పనులు 15 రోజుల్లో పూర్తి చేసి ట్రయల్‌రన్‌కు సిద్ధం చేస్తాం.  
– మహేందర్‌రెడ్డి, డీఈ, మిషన్‌ భగీరథ  

మరిన్ని వార్తలు