ఎక్కడివి అక్కడే..

6 Feb, 2018 19:38 IST|Sakshi

అస్తవ్యస్తంగా భగీరథ పనులు

ఆందోళనలో ప్రజలు

పట్టించుకోని అధికారులు

మిషన్‌ భగీరథ పనులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.. పైప్‌లైన్ల ఏర్పాటుకు తీస్తున్న గుంతలను సరిగా పూడ్చకపోవడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.. గుంతలకోసం తవ్వే క్రమంలో తీవ్ర నష్టాన్ని మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రం అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి పక్కన నెల రోజుల క్రితం తీసిన భగీరథ గుంతలు ప్రమాదకరంగా ఉన్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భగీరథ పైపు లెన్ల నిర్మాణం కోసం గ్రామంలోని ప్రధాన రహదారి వెంట ఉన్న ఇళ్లను సైతం కూల్చారు. గ్రామంలో ఈ పైపులైన్ను ఇష్ట రాజ్యంగా వెశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. అవసరం లేకున్నా చాలా చోట్ల ఇల్లు కూల్చినట్లు బాధితులు చెబుతున్నారు. ప్రధాన రహదారి నుంచి 9 మీటర్లు దూరంలో పైపు లైన్‌ నిర్మాణం చేయాలని నిబంధన ఉన్నా కొన్ని చోట్ల 11 మీటర్లు దూరంలో వేశారు . దీంతో చాలా చోట్ల ఇల్లు కోల్పోవాల్సి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు.

అన్నపురెడ్డిపల్లి నుండి మాదారం వెళ్లే ప్రధాన రహదారి పక్కన పైపులు, మట్టి కుప్పలు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భగీరథ పైపు లైన్లు నిర్మాణానికి సూమరు 6 అడుగుల లోతుతో గుంతలను తీసి ఉంచడంతో చిన్న పిల్లలు, జంతువులు ప్రమాదవ శాత్తు పడిపోయే అవకాశం ఉందని స్థానికులు తెలుపుతున్నారు. త్వరలో గ్రామంలో జరిగే శివరాత్రి పండగ నాటికి గుంతలను పూడ్చకపోతే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని ఆలయ సిబ్బంది అంటున్నారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు వేడుకుంటున్నారు.  

త్వరగా పూడ్చాలి
పైపులైన్‌ కోసం తీసిన గుంతలను త్వరగా పూడ్చాలి. ఈ గుంతల్లో చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. శివాలయంలో త్వరలో జాతర జరగనుంది. జాతరకు వేలలో భక్తులు వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే స్పందించాలి.
– యాదాల జమలయ్య

పరిహారం ఇవ్వాలి
భగీరథ పైపులైన్‌ నిర్మాణాల్లో పాడైపోతున్న ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వాలి. నెల క్రితం గ్రామంలో పర్యటించడానికి వచ్చిన ఎమ్మెల్యేకు నష్ట పరిహారం ఇప్పించాలని వినతిపత్రం ఇచ్చాం. అయినా స్పందన కనిపించడంలేదు. ఏం చేయాలో అర్థం కావడంలేదు.
– నరసింహారావు 

మరిన్ని వార్తలు