వానరకం

29 Jan, 2018 17:57 IST|Sakshi

దమ్మపేటలో విజృంభిస్తున్న కోతులు

ఆందోళనలో ప్రజలు 

దమ్మపేట : మండల కేంద్రమైన దమ్మపేటలో ప్రజలు కోతులతో వేగలేకపోతున్నారు. అవి ఎప్పడు ఎవరి మీద దాడి చేస్తాయో..ఏ ఇంట్లో దూరి సామగ్రి ఎత్తుకుపోతాయో తెలియక జనం భయపడుతున్నారు. దమ్మపేటలో కొంత కాలంగా కోతులు విచ్చిల విడిగా తిరుగుతున్నాయి. ఇళ్ల తలుపులు తెరచి ఉంటే చాలు ఇంట్లోకి జొరబడి సామగ్రిని చిందరవందర చేయడమే కాకుండా ఎత్తుకుపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్ల పక్కన కిరణా షాపులు, పండ్ల దుకాణాల్లో అయితే యజమానులున్నా లోనికి దూరిపోయి చేతికందిన వాటిని తీసుకుపోతున్నాయి. రోడ్లపై నడిచే వ్యక్తుల చేతుల్లో కవర్లు కనిపిస్తే వారి నుంచి కవర్లును లాక్కెళ్తున్నాయి. దీంతో కూరగాయలు, ఇతర సామగ్రిని చేతపట్టుకోవాలంటే జనం జంకిపోతున్నారు. ఉదయం, సాయంత్రం అని సమయం లేకుండా ఇళ్ల పైకప్పులపై చేరి పెంకులను తొలగిస్తూ నానా భీవత్సం సృష్టిస్తున్నాయి. వాటి బెడద నుంచి తట్టుకోలేక ప్రజలు ఇళ్ల వద్ద కర్రలతో కాపలా కాస్తున్నారు.

ఇటీవల మల్కారం రోడ్డులో నివాసముంటున్న ఒక వ్యక్తిపై కోతులు పడి విపరీతంగా కరిశాయి. దమ్మపేటలో కోతుల సమస్య పరిష్కరించాలని పట్టణ ప్రజలు పంచాయతీ అధికారులను, పాలకవర్గాన్ని కోరుతున్నారు. దమ్మపేటలో కోతులతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పట్టణ ప్రజలు వాపోతున్నారు. ఇంటి ఆవరణలో కూరలు తయారు చేయడానికి సిద్ధం చేసిన కూరగాయలను ఎత్తుకెళ్తున్నాయని అంటున్నారు. వాటితో పాటు బయట ఆరవేసిన దుస్తులను ఎత్తుకెళుతు జనాలను భయబ్రాంతులను చేస్తున్నాయి. దమ్మపేటలో కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. వాటి వల్ల ప్రజలు, చిన్న పిల్లలు చాలా ఇబ్బందులకు గురువుతున్నారు. గతంలో ఒకసారి దమ్మపేటలో కోతులను పట్టి దూరంగా వదిలారు. కొంతకాలం కోతుల సమస్యలేదు. కొద్దికాలంగా సమస్యల మళ్లీ పునరావృతం అయిందని, కోతుల సమస్యకు పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు