‘పట్టా’ పరేషాన్‌ 

27 Jan, 2018 18:46 IST|Sakshi

ప్రభుత్వ ‘సాయం’ పట్టాదారులకేనా..?

ఏజెన్సీలో అర్హుల ఎంపిక ఎలా..

కాస్తుదారులకు మొండిచెయ్యే

జిల్లాలో సగం మందికి అన్యాయమే

మణుగూరు:   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు పెట్టుబడి పథకం ఫలాలు పట్టాదారులకు మాత్రమే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టా ఉన్న రైతులకే పెట్టుబడి నగదును అందించేలా ప్రణాళిక
రూపొందించడంతో కాస్తుదారులైన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామసభల ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరించేటప్పుడు,  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపసంఘం చర్చల సమయంలో కేవలం
పట్టాదారులనే లెక్కలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా గల పట్టాదారు రైతులు (1బీలో నమోదైన పట్టాదారు మాత్రమే) ‘ఏ’ కేటగిరి కింద సుమారు 71.75 లక్షల మంది ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల
ప్రక్షాళన తర్వాత ప్రభుత్వం అంచనాకు వచ్చింది. పట్టాదారు రైతుల వివరాలు, సాగు విస్తీర్ణం తదితర వివరాలు నమోదు చేస్తుండటంతో ఈ పథకం కొంతమంది రైతులకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. దీంతో
జిల్లా వ్యాప్తంగా గల 23 మండలాల్లో కాస్తుదారుల్లో కొనసాగుతున్న రైతులకు, కౌలుదారులకు, రెవెన్యూ, భూదాన సమితి, దేవాదాయ భూములు సాగు చేసే రైతులకు ఎలాంటి సహాయం అందే అవకాశాలు
లేవు.  

జిల్లాలో 50 శాతం భూములకే పట్టాలు.. 
జిల్లా వ్యాప్తంగా 3, 25, 182 ఎకరాల భూమి సాగులో ఉండగా 1,04, 616 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. సాగు భూమి(1/70 చట్టం పరిధిలో)లో 50 శాతం భూములకే పట్టాలు ఉన్నట్లు భూ
ప్రక్షాళనలో అధికారులు గుర్తించారు. పలు రకాల ప్రభుత్వ (వ్యవసాయ) భూముల్లో సన్న, చిన్నకారు రైతులే ఎక్కువగా పంటలు సాగు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ సాయం పట్టాదారులకే దక్కితే ఆర్థిక
ఇబ్బందులు ఉండి, సరైన భూ హక్కులు లేని నిరుపేద రైతులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. వారసత్వం, పసుపు కుంకుమ, విక్రయాలకు సంబంధించిన అంశాల ప్రక్షాళన విషయంలో లక్షల్లో డబ్బులు
చేతులు మారుతున్నాయి. కానీ పలు రకాల ప్రభుత్వ భూములు సాగు చేసే బీద రైతులకు మాత్రం రెవెన్యూ రికార్డుల్లో స్థానం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలకు దూరం
అవుతుండగా, తాజాగా రైతు పెట్టుబడి సహాయానికి కూడా అర్హత లేకపోవడంతో సన్న, చిన్నకారు రైతులు తలలు పట్టుకుంటున్నారు. 
 
ఏజెన్సీలో రైతుల భవిష్యత్‌ ప్రశ్నార్థకం... 

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత రైతులు పొందలేకపోతున్నారు.  సుమారు 70, 80 సంవత్సరాలుగా (తరతరాలుగా) ఏజెన్సీ ప్రాంతంలో నివాసం
ఉంటూ జీవనాధారం కోసం నిరుపేద రైతులు ప్రభుత్వ భూములు(రెవెన్యూ, దేవాదాయ, భూదాన సమితి, అటవీ భూములు) సాగు చేసుకుంటున్నారు. కాగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందించే క్రమంలో
మైదాన ప్రాంతాలకు సంబంధించిన అంశాలనే పరిగణనలోకి తీసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో పొలాలు సాగు చేస్తున్న గిరిజనేతర రైతులకు తరుచూ అన్యాయం జరుగుతోంది. 

జిల్లాలో 23 మండలాల్లో (జిల్లా మొత్తం) గల భూములకు 1/70 చట్టం అమల్లో ఉండటం గమనార్హం. ప్రభుత్వం పకడ్భందీగా చేపట్టిన భూ ప్రక్షాళనలో కూడా గిరిజనేతర రైతులకు పేర్లు మార్చే అవకాశాలు
లేవు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక శాతం భూముల్లో సాగుచేసే సన్న, చిన్నకారు గిరిజనేతర రైతులకు ప్రభుత్వ సహాయం అందటం లేదు. సాగు చేస్తున్న భూములకు పూర్తిస్థాయిలో హక్కులు లేక,
కనీసం ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కూడా పొందే అవకాశం లేకపోవడంతో బీద రైతులు ఆవేదన చెందుతున్నారు. 

మరిన్ని వార్తలు