హత్య కేసులో ఇద్దరి అరెస్ట్‌

21 Feb, 2018 15:33 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న సీఐ సత్యనారాయణ రెడ్డి   

భద్రాచలంటౌన్‌ : హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. భద్రాచలం పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపిన వివరాలు... దుమ్ముగూడెం మండలం కోయనర్సాపురం గ్రామానికి చెందిన కారం రాజులు ఈ నెల 14న ఎవరో హత్య చేశారు. మృతదేహాన్ని రామచంద్రునిపేట–కోయ నర్సాపురం గ్రామాల మధ్యనున్న ఆర్‌అండ్‌బీ రోడ్డుపై పడేశారు. అతని భార్య ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని దుమ్ముగూడెం ఎస్‌ఐ బమ్మెర బాలకృష్ణ పరిశీలించారు. రాజులును మద్దిమడుగు గ్రామానికి చెందిన తెల్లం కన్నయ్య, తెల్లం రాముడు హత్య చేసినట్టుగా గుర్తించారు. కారం రాజులు మంత్రాలు, చేతబడులు, క్షుద్ర పూజలు చేస్తున్నాడని..

గ్రామంలోని వారిని చంపుతున్నాడని అనుకున్నారు. అంతేకాదు, కారం రాజులుతో వీరికి భూమి తగాదాలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో, కారం రాజులును ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. మద్దిమడుగులోని తన పోడు భూమిలోని కంది చేను వద్దకు ఈ నెల 14న రాజులు వెళ్లాడు. రాత్రి 9.00 గంటల సమయంలో ఇంటికి తిరిగొస్తున్నాడు. కన్నయ్య, రాముడు కాపుగాశారు. కారం రాజులును కర్రలతో కొట్టి చంపారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేస్తే.. ఏదేని వాహనం తగిలి చనిపోయాడని అందరూ అనుకుంటారని భ్రమించారు. రోడ్డుపై పడేశారు. భద్రాచలం సీఐ సత్యనారాయణరెడ్డి, దుమ్ముగూడెం ఎస్‌ఐ బాలకృష్ణ, దుమ్ముగూడెం పోలీస్‌ సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించారు. కోయ నర్సాపురం గ్రామంలో ఉన్న ఆ ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. కోర్టుకు అప్పగించారు. సమావేశంలో పట్టణ ఎస్‌ఐ కరుణాకర్, పోలీసులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు