పథకం ప్రకారమే చంపేశాడా..?!

1 Jan, 2018 17:13 IST|Sakshi

సాక్షి, అశ్వారావుపేట: మండలంలోని నెమలిపేట పాఠశాలలో అక్కడి విద్యావలంటీర్‌ హత్య సంచలనం సృష్టించింది. ఆమె మృతదేహం వద్దనే, ఆమె పేరుతో ‘సూసైడ్‌ నోట్‌’ కనిపించింది. ‘‘పథకం ప్రకారమే చంపాడు’’ అనే అనుమానాలకు ఈ సూసైడ్‌ నోట్‌ బలాన్నిస్తోంది. అతడి పేరు శ్రీనివాసరావు(24). కుక్కునూరుకు చెందిన వనమా వెంకటేశ్వరరావు కుమారుడు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మందుల కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడికి ఆరు నెలల వయసు ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. మేనమామ సంరక్షణలో పెరిగాడు. ఆమె పేరు మీనా ప్రవళిక(22). దమ్మపేట మండలం నెమలిపేట ఏకోపాధ్యాయ పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తోంది. వేంసూరు మండల పరిషత్‌ కార్యాలయంలో యూడీసీగా పనిచేస్తున్న ఊటుకూరు శ్రీనివాసరావు కుమార్తె. వీరిది కూడా కుక్కునూరు గ్రామమే. అశ్వారావుపేటలో నివాసముంటున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య దూరపు బంధుత్వం ఉంది. శ్రీనివాసరావు, మీనా ప్రవళిక.. వరుసకు బావామరదలు. ఇద్దరి మధ్య గతంలో ప్రేమాయణం సాగింది. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు కూడా తెలుసు.  

తన కుమారుడికి ప్రవళికను ఇచ్చి వివాహం చేయాలని ఆమె తండ్రిని, శ్రీనివాసరావు(హంతకుడు) తండ్రి వెంకటేశ్వరరావు గతంలో కోరారు. తన కూతురికి ఇప్పట్లో పెళ్లి చేసే ఆలోచన లేదని ఆమె తండ్రి శ్రీనివాసరావు చెప్పారు. ఇది జరిగిన కొన్నాళ్లకు, ప్రవళికకు వేరొక యువకుడితో వివాహాన్ని ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు. దీనికి ఆమె అంగీకారం కూడా ఉంది. ఇది, ఆమె ప్రియుడైన శ్రీనివాసరావుకు నచ్చలేదు. కోపం తెప్పించింది. ఇదే విషయం మాట్లాడేందుకు ఆమె పనిచేస్తున్న పాఠశాల వద్దకు శనివారం సాయంత్రం వచ్చా డు. అప్పటికే పిల్లలంతా వెళ్లిపోయారు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అప్పటికే అతడి వద్ద చిన్న సైజు విషపు బాటిల్, చిన్న కత్తి ఉంది. కొద్దిసేపటి తరువాత.. ఆమె పాఠశాల గదిలోకి పరుగెత్తి తలుపు వేసుకుంది. తన అన్నయ్యకు ఫోన్‌ చేసి చెప్పింది. ఆయన రాగానే తలుపు తీసి బయటకు పరుగెత్తబోయింది. తలుపు పక్కనే మాటువేసిన శ్రీనివాసరావు.. ఆమె బయటకు రాగానే కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత అతడు కూడా, తన జేబులోని విషాన్ని మింగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పథకం ప్రకారమే జరిగిందా..?! 
ఆమె మృతదేహం వద్ద పోలీసులకు సూసైడ్‌ నోట్‌ దొరికింది. దీనినిబట్టి, శ్రీనివాసరావు పథకం ప్రకారమే ఆమెను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారు ఇలా భావిస్తున్నారు... ‘‘తనతో పెళ్లికి ఆమెను ఒప్పించాలనుకున్నాడు. ఒప్పుకోకపోతే ఆమెకు విషమిచ్చిగానీ, కత్తితో పొడిచిగానీ చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిద్దామనుకున్నాడు. అందుకే, ఆమె తన తండ్రిని ఉద్దేశించి రాసినట్టుగా లేఖను సృష్టించాడు. తన దగ్గర పెట్టుకున్నాడు. పెళ్లికి ఆమె అంగీకరించలేదు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతడు ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో ఆమె గదిలోకి వెళ్లి దాక్కుంది. తన అన్నను చూడగానే తలుపు తీసి బయటకు పరుగెత్తబోయింది. అప్పటికే కోపోద్రేకంతో అక్కడే ఉన్న శ్రీనివాసరావు.. ఆమె బయటకు రాగానే పట్టరాని కోపంతో కత్తితో పొడిచాడు. ఆమె అన్న అక్కడే ఉండడం, తప్పించుకునే అవకాశం లేకపోవడం, మనసులో ఉద్రేకం–భయాందోళన... ఇవన్నీ తట్టుకోలేకపోయాడు. తన జేబులోని చిన్నపాటి బాటిల్‌లోగల (తక్షణమే పనిచేసే) విషాన్ని మింగాడు. ఆమె పేరుతో అతడే రాసుకున్న సూసైడ్‌ నోట్‌ అక్కడే, ఆమె మృతదేహం పక్కనే జారి పడింది’’. 

అలా చేసి ఉంటే.. ఇలా జరిగేది కాదేమో...! 
‘‘ప్రవళిక వివాహం సాధ్యపడదన్న విషయాన్ని అతడికి ఆమె తండ్రి ముందుగానే చెప్పి ఉండాల్సింది. ఇద్దరి మధ్య ప్రేమాయణం ఉన్నందున రెండు కుటుంబాల వారు చర్చించుకుని ఉండాల్సింది. ఇది జరగలేదు. ఆమెగానీ, ఆమె తండ్రిగానీ శ్రీనివాసరావుకు ముందుగానే విషయం చెప్పలేదు. ఇది అతడిలో కోపాన్ని పెంచింది. తనను మోసగించారన్న అభిప్రాయాన్ని ఏర్పరిచింది. స్వతహాగా వాడు మంచోడు. ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నాం. ఆ తండ్రీకూతురు అలా చేసి ఉంటే.. ఇలా జరిగేది కాదేమో...!’’ అని, శ్రీనివాసరావు కుటుంబీకులు, బంధువులు, అతడి సన్నిహితులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు