నన్ను ఏ రాజకీయ పార్టీ తీసుకోదు: నటి

18 Mar, 2018 17:59 IST|Sakshi
బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌

సాక్షి, న్యూఢిల్లీ : ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ.. వివాదాలతో సావాసం చేసే బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘రైజింగ్‌ ఇండియా సమ్మిట్‌’ లో కంగన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ రంగం అద్భుతమైనది అన్నారు. కానీ ఫ్యాషన్‌గా ఉండే తన లాంటి వారిని ఏ రాజకీయ పార్టీలు తీవుకోవని పేర్కొన్నారు.

రాజకీయాలు అంటే  చాలా ఇష్టమని, కానీ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదని కంగనా తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్రమోదీకి తాను పెద్ద అభిమానినని, ఆయనే తనకి రోల్‌ మోడల్‌ అని వెల్లడించారు. ‘నేను కూడా ఆయనలాగా ఎదగాలని కోరుకుంటున్నాను. చాయ్‌ వాలా నుంచి ప్రధాని స్థాయి వరకు ఎదిగిన మోదీ విజయ గాథ యువతకు ఆదర్శం’అని అన్నారు.

చాయ్‌వాలాను ప్రధానిని చేసిన గొప్ప ప్రజాస్వామ్య దేశం మన ఇండియా అని కొనియాడారు. జాతీయవాదాన్ని గూర్చి మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా పురోగతి సాధిస్తే దేశ పురోగతికి సాయం చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. ‘ఒక యువతిగా నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నాను. అందరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది’  అని ఆమె అన్నారు.

‘భారత్‌లో పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను భారతీయురాలిని. అదే నా గుర్తింపు’ అని  కంగనా అన్నారు. భారత్‌లో ఉన్న పాకిస్తానీ కళాకారుల వివాదం గూర్చి మాట్లాడుతూ.. కళాకారులకు ప్రాంతీయభేదం లేదని, వారిది వేరే రాజ్యమని అన్నారు. కళాకారులకు మతాలు, కులాలు, సరిహద్దులు ఉండవని, అంతా ఒకటేనని, వారిది కళాత్మక రాజ్యం అని కంగనా తన అభిప్రాయాన్ని వెలువరించారు.

మరిన్ని వార్తలు