సల్మాన్‌ సినిమాలో ‘స్పైడర్‌ విలన్‌’

8 Nov, 2019 18:11 IST|Sakshi

సాక్షి, ముంబై : సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో వస్తున్న రాధే సినిమాలో తమిళ నటుడు భరత్‌ విలన్‌గా నటించనున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ నటుడు భరత్‌ సల్మాన్‌, ప్రభుదేవాతో విడివిడిగా దిగిన ఫోటోలను శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా భరత్‌ తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. అలాగే దర్శకుడు ప్రభుదేవాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. భరత్‌కు బాలీవుడ్‌లో ఇది రెండో సినిమా. 2013లో ఆయన జాక్‌పాట్‌ అనే హిందీ సినిమాలో నటించారు. భరత్‌ టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా, మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్‌ సినిమాలో మెయిన్‌ విలన్‌ సూర్యకు తమ్ముడిగా కీలక పాత్ర పోషించాడు. సల్మాన్‌, ప్రభుదేవా కాంబినేషన్‌లో ప్రస్తుతం దబాంగ్‌ 3 తెరకెక్కుతోంది. డిసెంబరు 20న విడుదల అవుతున్న ఈ సినిమాలో ఈగ విలన్‌ కిచ్చ సుదీప్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా అనంతరం సల్మాన్‌ ‘రాధే’ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా 2020 రంజాన్‌కు విడుదల కానుంది. 

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతీ రంజాన్‌కు సినిమా విడుదల చేసే ఆనవాయితీ ఉన్న సల్మాన్‌ 2019 రంజాన్‌కి ప్రేక్షకులకి నిరాశపరిచాడు. మొదట్లో ఇన్షా అల్లా పేరుతో సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్‌ హీరోయిన్‌గా సినిమా అనౌన్స్‌ చేశారు కానీ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. దాంతో దబాంగ్‌ 3 సినిమాను ఆఘమేఘాల మీద పట్టాలెక్కించి, శరవేగంగా షూటింగ్‌ చేస్తున్నారు. ఆ చిత్రానికీ ప్రభుదేవానే దర్శకుడు. ఈద్‌కి రాబోయే రాధే సినిమాలో దిశాపటాని, జాకీష్రాఫ్‌, రణదీప్‌ హుడా కీలక పాత్రధారులు. కాగా, సల్మాన్‌ ఖాన్‌ తన వరుస సినిమాలలో దక్షిణాది నటులకు అవకాశాలివ్వడం వెనుక మార్కెట్‌ స్ట్రాటజీ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఖాన్‌ త్రయంలోని మిగతా ఇద్దరితో పోల్చి చూస్తే సల్మాన్‌కు హైదరాబాద్‌ మినహా సౌత్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమా కలెక్షన్లు తక్కువ. వీటిని అధిగమించడానికే సౌత్‌లో పేరున్న నటులను తీసుకుంటున్నారని బి టౌన్‌ టాక్‌. 

Read latest Bollywood News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా