‘హీరోయిన్‌ను చంపితే రూ.5 కోట్లు ఇస్తాం’

16 Nov, 2017 18:37 IST|Sakshi

సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ’పద్మావతి‘  చిత్రం విడుదల తేదీ దగ్గర పడేకొద్దీ వివాదాలు, విమర్శలు తీవ్రమవుతున్నయి. పద్మావతి చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకునే ముక్కు కోస్తామని కొందరు అంటుంటే.. ఆమెను చంపితే రూ. 5 కోట్లు ఇస్తామని మరో సంస్థ ప్రకటించింది. పద్మావతి చిత్రంపై ఎవరూ ఊహించని స్థాయిలో కర్ణిసేన ప్రతిస్పందిస్తోంది. సినిమా విడుదలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని సంస్థ తేల్చి చెప్పింది. సంజయ్‌లీలా భన్సాలీ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని కర్ణిసేన ఆరోపించింది. సినిమా విడుదల ఆపకపోతే దీపిక ముక్కు కత్తిరిస్తామని కర్ణిసేన బహిరంగంగా ప్రకటించింది. థియేటర్లను ధ్వంసం చేస్తామని స్పష్టం చేసింది. మరికొందరు మాత్రం దీపికను చంపితే రూ. 5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.

ఆదిత్యనాథ్‌ లేఖ
ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పద్మావతి చిత్రాన్ని నిలపాలని ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ చిత్రం విడుదలను ఆపకపోతే.. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని ఆదిత్యనాథ్‌ కేంద్రానికి తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని సెన్సార్‌ బోర్డు వ్యహరించాలని యూపీ ప్రభుత్వం కోరింది. ఇదిలా ఉండగా.. పద్మావతి చిత్ర వివాదంపై జోక్యం చేసుకోలేమని కేంద్రం స్పష్టం చేసింది. అదే సమయంలో శాంతి భద్రతల విషయాన్ని రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం తెలిపింది. దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీకి, నాయిక దీపికా పదుకునేకు తగినంత భద్రత కల్పిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దీపికకు ఉమాభారతి అండ
పద్మావతి చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీపై కేంద్ర మంత్రి ఉమాభారతి మండిపడ్డారు. భన్సాలీ హిందువుల ఆత్మస్థైర్యాన్ని రాజపుత్రుల సెంటిమెంట్లను అవమానిస్తున్నారని అన్నారు. అదే సమయంలో దీపికపై వస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు.

భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోలేం : సుప్రీం కోర్టు
పద్మావతి చిత్రంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టిస్టులకు తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కు ఉందని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇదిలా ఉండగా.. సినిమా పరిశ్రమను భయపెట్టడం, బెదిరించడం, దాడులకు పాల్పడడం కల్చరల్‌ టెర్రరిజం కిందకు వస్తుందని ఐఎఫ్‌టీడీ అధ్యక్షుడు అశోక్‌ పండిట్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు