-

గతవారం బిజినెస్‌

12 Jun, 2017 01:33 IST|Sakshi
గతవారం బిజినెస్‌

ఎస్‌బీఐ రూ. 15,000 కోట్ల సమీకరణ

క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ ప్లేస్‌మెం ట్‌ (క్విప్‌) మార్గంలో రూ. 15,000 కోట్లు సమీకరించినట్లు ఎస్‌బీఐ వెల్ల డించింది. క్విప్‌ కింద షేరు ఒక్కింటికి రూ. 287.25 చొప్పున మొత్తం 52.2 కోట్ల షేర్లను జారీ చేసినట్లు పేర్కొంది. ఈ నిధులను క్యాపిటల్‌ అడెక్వసీ నిష్పత్తిని మెరుగుపర్చుకునేందుకు, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించుకోనున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ఫండ్‌ మేనేజర్లకు అచ్చొచ్చిన 2017
దేశీయ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ ఫండ్స్‌కు ఈ ఏడాది ఇప్పటి వరకు లాభాల వర్షమే కురిసింది. టాప్‌ 30 ఫండ్స్‌ సగటున ఈ ఏడాది ఇప్పటి వరకు 25% రాబడులను అందుకున్నవే. మోర్గాన్‌ స్టాన్లీ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ 32% వృద్ధితో అగ్ర స్థానంలో ఉంది. దేశీయ ఫండ్‌ మేనేజర్లు లాభాల విషయంలో మరింత మెరుగ్గా ఉన్నారు. రూ.4.8 లక్షల ఆస్తులతో కూడిన 109 ఫండ్స్‌ సగటు వృద్ధి డాలర్లలో చూసుకుంటే 27%గా ఉంది.

ఐదేళ్లలో నిఫ్టీ 30,000!!
ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ మాత్రం నిఫ్టీ వచ్చే ఐదేళ్లలో 30,000 పాయింట్ల స్థాయికి చేరుతుందని అంటోంది. సమీప కాలంలో అంటే ఈ నెలలోనే సెన్సెక్స్‌ 34,000 వరకూ పెరగొచ్చంటోంది.

వృద్ధి గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నాం: ఇన్ఫీ
ప్రాజెక్టులను కొనసాగించేందుకు కొంత మంది క్లయింట్లు భారీ డిస్కౌంట్లు అడుగుతున్నప్పటికీ.. ఈ ఏడాది ఆదాయ వృద్ధికి సంబంధించి ఇచ్చిన 6.5–8.5% గైడెన్స్‌కి కట్టుబడి ఉన్నామని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది. ఐటీ బడ్జెట్‌ పూర్వ స్థాయిల్లోనే కొనసాగుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు 3–5 ఏళ్ల రెన్యువల్‌ డీల్స్‌ విషయంలో 30–40% తక్కువకే ప్రాజెక్టులు చేయాలని కోరవచ్చని సంస్థ సీవోవో యూబీ ప్రవీణ్‌ రావు చెప్పారు.

శాంసంగ్‌ భారీ విస్తరణ
ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల్లో ప్రముఖ కంపె నీ అయిన శాంసంగ్‌ దేశీయంగా స్మా ర్ట్‌ఫోన్లు, రిఫ్రిజిరేటర్ల తయారీ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనుంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ప్లాంట్‌ ఆవరణ పక్కనే ఉన్న 35 ఎకరాల విస్తీర్ణంలో కొత్ల ప్లాంట్‌ ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ.4,915 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఈ విస్తరణ ప్రాజెక్టు వచ్చే రెండేళ్లలో పూర్తి కానుంది.

బ్యాంకుల రేట్ల తగ్గింపు
భారీ గృహ రుణాలపై వడ్డీరేటును   ఎస్‌బీఐ స్వలంగా 10 బేసిస్‌ పాయిం ట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గించింది. దీనితో మహిళలకు సంబంధించి ఈ రుణ రేటు 8.55 శాతంగా ఉంటుంది. ఇతరులకు 8.60 శాతంగా అమలవుతుంది. తాజా నిర్ణయం జూన్‌ 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఇక ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 0.20 శాతం తగ్గించింది. ఈ రేటు జూన్‌ 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. మరొకవైపు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ తన బేస్‌ రేటును ప్రస్తుత 9.50 శాతం నుంచి 9.45 శాతానికి తగ్గించింది. జూలై 1 నుంచి తాజా రేటు అమలవుతుంది.

ఆర్‌బీఐ పాలసీ యథాతథం
ద్రవ్యోల్బణం భయాలను కారణంగా చూపుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  కీలక పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ను మాత్రం 0.5 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 20 శాతానికి తగ్గింది. రెపోను పాలసీ కమిటీ యథాతథంగా కొనసాగించింది. అంటే గడిచిన 8 నెలలుగా ఈ రేటు 6.5 శాతంగానే ఉంది. మారలేదు. ఇక రివర్స్‌ రెపో యథాపూర్వం 6 శాతంగా కొనసాగనుంది.  

తగ్గిన ఎంఎఫ్‌ నిర్వహణ ఆస్తులు
మ్యూచువల్‌ ఫండ్‌ (ఎంఎఫ్‌) పరిశ్రమ నిర్వహణ ఆస్తుల (ఏయూఎం) విలువ మే నెలలో 1.15 శాతం క్షీణతతో రూ.19.03 లక్షల కోట్లకు తగ్గింది. మనీ మార్కెట్‌ విభాగాల నుంచి ఔట్‌ఫ్లో ఉండటం దీనికి ప్రధాన కారణం. ఇక ఎంఎఫ్‌ పరిశ్రమ నిర్వహణ ఆస్తుల విలువ ఏప్రిల్‌ నెలలో రూ.19.26 లక్షల కోట్లకు ఎగసింది. ఇది ఆల్‌టైం గరిష్ట స్థాయి.

వాహన విక్రయాల్లో 9 శాతం వృద్ధి
దేశీ ప్యాసెంజర్‌ వాహన విక్రయాలు మే నెలలో 8.63 శాతం వృద్ధితో 2,31,640 యూనిట్ల నుంచి 2,51,642 యూనిట్లకు పెరిగాయి. కొత్త మోడళ్ల ఆవిష్కరణ, యుటిలిటీ వాహనాలకు బలమైన డిమాండ్‌ ఉండటం వంటి అంశాలు అమ్మకాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఇక దేశీ కార్ల విక్రయాలు కూడా 4.8 శాతం వృద్ధితో 1,58,996 యూనిట్ల నుంచి 1,66,630 యూనిట్లకు పెరిగాయి.

82.9 కోట్లకు ఇంటర్నెట్‌ యూజర్లు!
దేశంలో ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 2021 నాటికి రెట్టింపుతో 82.9 కోట్లకు చేరుతుందని సిస్కో విజువల్‌ నెట్‌వర్కింగ్‌ ఇండెక్స్‌ అంచనా వేసింది. అంటే దాదాపు 59 శాతం మంది భారతీయులకు ఇంటర్నెట్‌ చేరువ కానుంది.

ఐపీవో కాలమ్‌..
టెలికం సంస్థలకు ఉత్పత్తులు, డిజైన్‌ సేవలు అందించే తేజాస్‌ నెట్‌వర్క్స్‌ ఐపీవో ఈ నెల 14న ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.250–257గా ఖరారు చేశారు.  

రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఐపీవోకు రానుంది. అనిల్‌ అంబానీ గ్రూపు ఈ మేరకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఐపీవో ద్వారా రూ.20 వేల కోట్ల మార్కెట్‌ విలువ లభిస్తుందన్న అంచనాతో ఉంది.

ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌ తన ఐపీవోకు సంబంధించిన షేర్ల ధరల శ్రేణిని రూ. 600–603గా నిర్ణయించింది. ఐపీవో ద్వారా రూ.1 ముఖ విలువ గల 2,88,75,000 షేర్లను కంపెనీ విక్రయిస్తోంది. జూన్‌ 16న ప్రారంభమయ్యే ఆఫర్‌ 20న ముగుస్తుంది.

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంస్థ టికెట్‌న్యూలో చైనాకి చెందిన ఆలీబాబా గ్రూప్‌ సంస్థ ఆలీబాబా పిక్చర్స్‌ గ్రూప్‌ మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడి కాలేదు.

ప్రవాస భారతీయుడు వీకే చావ్లాకి చెందిన చావ్లా హోటల్స్‌.. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుల సారథ్యంలోని ట్రంప్‌ హోటల్స్‌తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం అమెరికాలోని మిస్సిసిపీలో నాలుగు హోటల్స్‌ను రూపొందించనున్నారు. అమెరికన్‌ ఐడియా పేరిట మూడు, సియోన్‌ బ్రాండ్‌ కింద మరొకటి వీటిలో ఉండనుంది.

మౌలిక రంగ సంస్థ జీఎంఆర్‌ గ్రూప్‌ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మరో ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఇన్‌ఫ్రా దిగ్గజం టెర్నా భాగస్వామ్యంతో గ్రీస్‌లోని క్రీతి నగరంలో ఉన్న హిరాక్లియో విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ ప్రాజెక్టును దక్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది.

పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ సంస్థలో తమకున్న మొత్తం 10 శాతం వాటాలు విక్రయించినట్లు ఫ్రాన్స్‌కి చెందిన జీడీఎఫ్‌ ఇంటర్నేషనల్‌ వెల్ల డించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 7.5 కోట్ల షేర్లను అమ్మినట్లు పేర్కొంది. సగటున షేరు ఒక్కింటికి రూ.421.63 ధరతో లావాదేవీల మొత్తం విలువ రూ.3,162.22 కోట్లుగా ఉంటుందని జీడీఎఫ్‌ తెలిపింది.

ఐటీ కన్సల్టింగ్, సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌ కంపెనీ బోధ్‌ట్రీ తాజాగా ఇన్ఫోసిస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్‌ క్లయింట్లకు జీఎస్‌టీ పరిష్కారాలను బోధ్‌ట్రీ అందించనుంది. ఈ ప్రాజెక్టు విలువ రూ.200 కోట్లు.

రష్యాకి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ వినెష్కోనోమ్‌బ్యాంక్‌తో కలిసి ఐటీ, ఇన్నోవేషన్‌ ఫండ్‌ ప్రారంభించినట్లు శ్రేయి ఇన్ఫ్రా ఫైనాన్స్‌ సంస్థ తెలిపింది. దీని ప్రకారం రెండు సంస్థలు 200 మిలియన్‌ డాలర్ల మేర టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయనున్నాయి.

భారతీ ఎయిర్‌టెల్, టెలీనార్‌ ఇండియా విలీనానికి కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గ్రిన్‌ సిగ్నల్‌ ఇచ్చిం ది. సెబీ, స్టాక్‌ ఎక్సే్చంజ్‌లు ఇప్పటికే ఆమోదం తెలిపాయి.

దివాన్‌ హౌసింగ్‌ గ్రూపులో భాగమైన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ వైశ్యా, ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ విలీనానికి నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు (ఎన్‌హెచ్‌బీ) ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల విలీనం ఆగస్ట్‌ నాటికి పూర్తి కానుంది.

మరిన్ని వార్తలు