మళ్లీ తగ్గిన వడ్డీ రేట్లు- మారటోరియం పొడిగింపు

22 May, 2020 10:18 IST|Sakshi

రెపో రేటు 0.4 శాతం కట్‌

4 శాతానికి దిగివచ్చిన రెపో రేటు

రివర్స్‌ రెపో రేటు 3.35 శాతానికి

ఆర్థిక వ్యవస్థకు ఆర్‌బీఐ దన్ను

కోవిడ్‌-19 కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి రంగంలోకి దిగింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో తాజాగా 0.4 శాతం కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇప్పటివరకూ రెపో రేటు 4.4 శాతంగా అమలవుతోంది. రెపో రేటును తగ్గించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. దీంతో రివర్స్‌ రెపో సైతం 3.75 శాతం నుంచి 3.35 శాతానికి తగ్గింది. కాగా.. మార్చి 1 నుంచి మే 31వరకూ మూడు నెలలపాటు రుణ చెల్లింపుల వాయిదాలపై విధించిన మారటోరియంను తాజాగా ఆగస్ట్‌ 31వరకూ పొడిగిస్తున్నట్లు శక్తికాంతదాస్‌ పేర్కొన్నారు. కోవిడ్‌-19 కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డవున్‌ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు భారీగా కుంటుపడినట్లు శక్తికాంత్‌ దాస్‌ పేర్కొన్నారు. పలు రంగాలలో ఉత్పాదక కార్యకలాపాలతోపాటు పెట్టుబడులు నిలిచిపోయినట్లు తెలియజేశారు.దీంతో తాజా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

గతంలో భారీ కోత
దేశీయంగానూ కరోనా వైరస్‌ విస్తరించడం ప్రారంభమయ్యాక ఆర్‌బీఐ నిర్వహిస్తున్న మూడో సమావేశమిది. మార్చి 27, ఏప్రిల్‌ 17న ఇంతక్రితం ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పలు చర్యలు ప్రకటించారు. కోవిడ్‌-19 కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డవున్‌ విధించడంతో నీరసించిన ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ ఇప్పటికే బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీని పంప్‌చేసిన విషయం విదితమే. ఈ బాటలో మార్చిలో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటులో 75 బేసిస్‌ పాయింట్ల(0.7 శాతం)మేర కోత పెట్టింది. దీంతో రెపో రేటు 4.4 శాతానికి దిగివచ్చింది. ఇక ఆర్‌బీఐ వద్ద జమచేసే స్వల్పకాలిక నిధులపై బ్యాంకులు పొందే వడ్డీ రేటుకు సంబంధించిన రివర్స్‌ రెపోను సైతం 3.75 శాతానికి తగ్గించింది. రెపో బాటలో ఆర్‌బీఐ.. రివర్స్‌ రెపోలో సైతం 0.9 శాతం కోతను మార్చిలోనే  విధించింది. దీంతో ఏప్రిల్‌ సమావేశంలో ప్రధానంగా లిక్విడిటీ చర్యలకే ప్రాధాన్యమిచ్చింది. దాదాపు అన్ని రకాల రుణ చెల్లింపుల వాయిదాలపై మే 31వరకూ మూడు నెలల మారటోరియం విధించింది కూడా.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా