భారీ స్కాం : 10 మంది బ్యాంకు ఉద్యోగులు సస్పెండ్‌

14 Feb, 2018 13:52 IST|Sakshi
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (ఫైల్‌ ఫోటో)

దేశీయ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ముంబై బ్రాంచులో దాదాపు రూ.11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బ్యాంకు తేల్చింది. డైమండ్‌ మెర్చంట్‌ నిరవ్‌ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు, బిజినెస్‌ పార్టనర్‌ మెహల్ చోక్సి ఈ స్కాంకు పాల్పడినట్టు బ్యాంకు ఆరోపిస్తోంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను పీఎన్‌బీ సస్పెండ్‌ చేసినట్టు బ్యాంకింగ్‌ సెక్రటరీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.  దీనిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

తన బ్యాంకులో దాదాపు రూ.11,359 కోట్లకు పైగా విలువైన మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కొంతమంది అకౌంట్‌ హోల్డర్స్‌ ప్రయోజనార్థం ముంబైలోని ఓ బ్రాంచులో ఈ మోసపూరిత లావాదేవీలు జరిగాయని తెలిపింది. ఈ నగదును విదేశీ అకౌంట్లకు తరలించినట్టు కూడా ధృవీకరించింది. ఈ కుంభకోణం వల్ల బ్యాంకుకు ఏ మేర నష్టం వాటిల్లుతుందో పీఎన్‌బీ వెల్లడించలేదు. కాగ, ఇదే బ్యాంకుకు సంబంధించి రూ.280 కోట్ల చీటింగ్‌ కేసులో భాగంగా అత్యంత ధనికవంతుల్లో ఒకరైన సెలబ్రిటీ జువెల్లరీ నిరవ్‌ మోదీని గతవారమే సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు.

భారీ నష్టాల్లో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు 
ఈ వార్తల నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. పీఎన్‌బీ ముంబయి బ్రాంచ్‌లో దాదాపు రూ.11,359 కోట్ల మేర భారీ కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆ కంపెనీ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెప్పారు. రూ.160 షేరు విలువతో బీఎస్‌ఈలో ట్రేడింగ్‌ ప్రారంభించిన పీఎన్‌బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్‌ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్‌బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోయారు.

మరిన్ని వార్తలు