జోరుగానే వాహన విక్రయాలు

2 Apr, 2016 00:55 IST|Sakshi
జోరుగానే వాహన విక్రయాలు

మారుతీ, రెనో ఇండియాల జోరు
రేట్ల కోతపై కంపెనీల ఆశలు

న్యూఢిల్లీ:  వాహన విక్రయాలు  ఈ ఏడాది మార్చి నెలలో జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టీవీఎస్ మోటార్, హీరో మోటొకార్ప్, అశోక్ లేలాండ్ కంపెనీల వాహన విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. హోండా కార్స్ ఇండియా, హీరో మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఆఫ్ ఇండియాల వాహన అమ్మకాలు మాత్రం తగ్గాయి. ఆర్‌బీఐ కీలక రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలున్నాయని, దీంతో వడ్డీరేట్లు తగ్గుతాయని, అమ్మకాలు పుంజుకునే అవకాశాలున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్(ప్రవీణ్ షా) వ్యాఖ్యానించారు.

గత ఆర్థిక సంవత్సరం పరిశ్రమ పనితీరు  మిశ్రమంగా ఉందని హీరో మోటొకార్ప్ పేర్కొంది.  వర్షాలు మంచిగా కురిస్తే, సకాలంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు బాగా ఉంటాయని వివరించింది. అన్ని మోడళ్లను బీఎస్-4 పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా అందుబాటులోకి తెస్తామని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా తెలిపింది.  మరింతగా గ్రామీణ మార్కెట్లలోకి విస్తరిస్తామని పేర్కొంది. గత నెలలో 50వేలకు పైగా బైక్‌లు విక్రయించామని, ఒక్క నెలలో 50వేల బైక్‌లు విక్రయించడం చెప్పుకోదగ్గ మైలురాయని రాయల్ ఎన్‌ఫీల్డ్ పేర్కొంది.

 మారుతీ, హ్యుందాయ్ రికార్డ్ వార్షిక అమ్మకాలు
గత ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ కంపెనీలు రికార్డ్ స్థాయి అమ్మకాలను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ, హోండా కార్స్ కూడా మంచి అమ్మకాలు సాధించాయి. మారుతీ సుజుకీ అమ్మకాలు 11 శాతం వృద్ధితో 14.2 లక్షలకు, హ్యుందాయ్ అమ్మకాలు 15 శాతం వృద్ధితో 4.8 లక్షలకు చేరాయి. దేశీయంగా వాహన పరిశ్రమ 7 శాతం వృద్ధి సాధిస్తే తమ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయని మారుతీ పేర్కొంది.  గత ఆర్థిక సంవత్సరంలో 13,05,351 దేశీయంగా అమ్మకాలు సాధించామని, గత ఆర్థిక సంవత్సరంలో తమ అమ్మకాలు 2 శాతం పెరిగాయని హోండా కార్స్  పేర్కొంది.

>
మరిన్ని వార్తలు